Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

దూరదర్శన్ ప్రస్థానానికి 65 ఏళ్లు

  • గతంలో ఘనంగా వెలిగిన దూరదర్శన్
  • 1959 సెప్టెంబరు 15న దూరదర్శన్ ప్రారంభం
  • 1982లో జాతీయ ప్రసారదారుగా అవతరణ

ఇప్పుడంటే ప్రైవేట్ టీవీ చానళ్లు, హెచ్ డీ చానళ్ల యుగం నడుస్తోంది కానీ, ఒకప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని దూరదర్శన్ చానల్ ప్రసారాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇంటిల్లిపాదినీ అలరించే ప్రసార సంస్థగా దూరదర్శన్ గతంలో వన్నెకెక్కింది. రామాయణ్, మహాభారత్ వంటి విజయవంతమైన కార్యక్రమాలతో దూరదర్శన్ ఓ వెలుగు వెలిగింది. కానీ కాలక్రమంలో ప్రైవేటు చానళ్ల రాకతో దూరదర్శన్ ప్రాభవం మసకబారింది. 

కాగా, దూరదర్శన్ ప్రస్థానం కీలక మైలురాయికి చేరింది. దూరదర్శన్ నేటితో 65 ఏళ్లు పూర్తి చేసుకుంది. 1959 సెప్టెంబరు 15వ తేదీన దూరదర్శన్ ప్రారంభమైంది. 1982లో ఇది జాతీయ ప్రసారకర్తగా అవతరించింది. 

ప్రభుత్వ అధీనంలో నడిచే ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 46 స్టూడియోలు ఉన్నాయి. దూరదర్శన్ కింద 33 టీవీ చానళ్లు ఉన్నాయి. ఇందులో డీడీ నేషనల్, డీడీ న్యూస్ పాన్ ఇండియా చానళ్లు. అంతేకాకుండా, దూరదర్శన్ అధీనంలో 17 ప్రాంతీయ చానళ్లు, 11 రాష్ట్ర స్థాయి నెట్ వర్క్ లు, ఓ ఇంటర్నేషనల్ చానల్ (డీడీ ఇండియా) ఉన్నాయి. క్రీడా ప్రసారాల కోసం డీడీ స్పోర్ట్స్, సాంస్కృతిక, సమాచార, వ్యవసాయ అంశాల ప్రసారం కోసం డీడీ భారతి, డీడీ ఉర్దూ, ఓ వ్యవసాయ చానల్ ఉన్నాయి. 

80వ దశకంలో మహాభారత్, రామాయణ్ వంటి సీరియళ్లతో ప్రతి ఇంట్లోనూ దూరదర్శన్ చానల్ సందడి చేసింది. అయితే, 90వ దశకం ఆరంభంలో ఆర్థిక సంస్కరణలకు తెరలేపడంతో ఎన్నో ప్రైవేటు చానళ్లు భారత్ లో ప్రవేశించాయి. అక్కడ్నించి దూరదర్శన్ కు ప్రజాదరణ తగ్గడం మొదలైంది. 

ఇక, సంచనాలకు దూరంగా ఉంటుందని పేరొందిన దూరదర్శన్ చానల్ పై కూడా వివాదాలు ఉన్నాయి. ఇందిర హయాంలో ఎమర్జెన్సీ వేళ ప్రభుత్వ భావజాలాన్ని వ్యాప్తి చేసే వాహకంగా దూరదర్శన్ అప్రదిష్ఠ మూటగట్టుకుంది. 1984లో అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ బ్లూస్టార్ సమయంలోనూ ప్రభుత్వ వార్తలనే ప్రసారం చేసిన దూరదర్శన్ విమర్శలపాలైంది.

Related posts

జార్ఖండ్‌ అడ‌వుల్లో తుపాకుల మోత…ఒక జవాన్ మృతి …మరొకరికి సీరియస్….

Ram Narayana

డేంజర్ మార్కును దాటేసిన యమున.. ముప్పు ముంగిట్లో ఢిల్లీ

Ram Narayana

భక్తులతో కిటకిటలాడుతున్నశబరిమల గిరులు…

Ram Narayana

Leave a Comment