- ఆగస్టులో రికార్డు స్థాయిలో 10.06 బిలియన్ డాలర్లకు చేరిన బంగారం దిగుమతులు
- గత ఏడాది ఆగస్టులో బంగారం దిగుమతులు 4.93 బిలియన్ డాలర్లు
- బంగారం స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలను అరికట్టేందుకు కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించినట్లు పేర్కొన్న వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్
ఒక పక్క కస్టమ్స్ డ్యూటీ తగ్గింపు.. మరో పక్క పండుగలు, పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారం దిగుమతులు గణనీయంగా పెరిగాయి. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఆగస్టులో రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులు జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆగస్టు నెలలో బంగారం దిగుమతులు 4.93 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఈ ఏడాది ఆగస్టు నెలలో రికార్డు స్థాయిలో 10.06 బిలియన్ డాలర్లకు చేరడం విశేషం.
గణనీయంగా బంగారం దిగుమతులు జరగడంపై వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వాల్ స్పందించారు. బంగారం స్మగ్లింగ్, ఇతర కార్యకలాపాలను అరికట్టేందుకు కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించినట్లు ఆయన తెలిపారు. నగల వ్యాపారులు పండుగ సీజన్ నేపథ్యంలో అమ్మకాల కోసం బంగారాన్ని నిల్వ చేయడం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు. 2024 – 25 ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం బంగారం దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 15 శాతం నుండి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.