Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కొండా సురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖుల ఫైర్ …తల పట్టుకున్న కాంగ్రెస్!

కొండాసురేఖ వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు ముక్త కంఠంతో ఫైర్ కావడంతో కాంగ్రెస్ తల పట్టుకుంది …మంత్రి కొండా సురేఖ ఎదో చేయబోయి ఎదో చేశారని దీంతో పార్టీకి డ్యామేజీ అవ్వడమే కాకుండా అక్కినేని కుటుంబానిది , సమంతల పరువు తీసిందని ఇది క్షమించరానిదని ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.. ఇది దుర్మార్గం సిగ్గుచేటు అని మండి పడుతున్నాయి..ఏఐసీసీ అగ్రనేత పార్లమెంట్ లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అక్కినేని అమల చర్యలు విజ్ఞప్తి చేశారు …చిరంజీవి , జూనియర్ ఎన్టీఆర్ , మహేష్ బాబు ఆర్జీవీ ఘాటుగా స్పందించారు ..అన్ని వైపుల నుంచి విమర్శల జడివాన కురవడంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని కొండా సురేఖ సన్నాయి నొక్కులు నొక్కారు ..సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా వేయగా , కేటీఆర్ కూడా నోటీసులు పంపారు ..

కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మెగాస్టార్ చిరంజీవి

  • చిత్ర పరిశ్రమలో దుమారం రేపిన కొండా సురేఖ వ్యాఖ్యలు
  • మంత్రి వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయన్న చిరంజీవి
  • ఇలాంటి దుర్మార్గపు మాటల దాడిని తామంతా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామన్న మెగాస్టార్

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గౌరవమంత్రి చేసిన ఇలాంటి అవమానకరమైన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. వార్తల్లో నిలిచేందుకు సెలబ్రిటీలు, సినీ పరిశ్రమకు చెందినవారు సాఫ్ట్ టార్గెట్లుగా మారడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్రపరిశ్రమకు చెందిన తామందరం ఇలాంటి దుర్మార్గపు మాటల దాడిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.

రాజకీయ లబ్ధి కోసం రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులను, మరీ ముఖ్యంగా మహిళలను ఇలా రాజకీయాల్లోకి లాగడం, అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేస్తూ ఈ స్థాయికి దిగజారడం సరికాదని చిరంజీవి హితవు పలికారు. సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకే మనం నాయకులను ఎన్నుకుంటామని, కానీ, ఇలాంటి వ్యాఖ్యల ద్వారా తమ స్థాయిని తగ్గించుకోవద్దని కోరారు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్నవారు ఉదాహరణగా నిలవాలి తప్పితే ఇలాంటి వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు. ఇలాంటి హానికర వ్యాఖ్యలు చేసినవారు ఉపసంహరించుకుంటారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. 

తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న మంత్రి!
చిరంజీవి స్పందించడానికి ముందే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. నటి సమంతకు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి, మరీ ముఖ్యంగా చిత్ర పరిశ్రమ నుంచి విమర్శల వర్షం కురవడంతో మంత్రి వెనక్కి తగ్గారు. మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించేందుకు మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. స‌మంత మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయాలన్నది తన ఉద్దేశం కాదని, స్వ‌యం శ‌క్తితో ఆమె ఎదిగిన తీరు త‌న‌కు ఆద‌ర్శమని పేర్కొన్నారు. త‌న వ్యాఖ్య‌ల వ‌ల్ల స‌మంత కానీ, ఆమె ఫ్యాన్స్ కానీ మ‌న‌స్తాపానికి గురైనట్టయితే బేష‌ర‌తుగా ఆ వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు సురేఖ పేర్కొన్నారు.

మౌనంగా ఉండం.. మేమంతా ఏక‌మై నిల‌బ‌డ‌తాం: మంచు విష్ణు

Manchu Vishnu Tweet on Konda Surekha Comments
  • మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై భగ్గు మంటున్న టాలీవుడ్‌
  • ఇప్ప‌టికే చిరు, నాగార్జున, వెంకటేశ్‌, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని ఫైర్‌
  • తాజాగా ఎక్స్ వేదిక‌గా స్పందించిన ‘మా’ అధ్య‌క్షుడు విష్ణు
  • త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల‌ను ప్ర‌జా చ‌ర్చ‌ల్లోకి లాగొద్దంటూ ట్వీట్‌

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలుగు చిత్ర సీమ భగ్గు మంటోంది. అక్కినేని ఫ్యామిలీ, సమంతపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ ని ఆగ్ర‌హానికి గురి చేస్తున్నాయి. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, జూనియ‌ర్‌ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని, సుధీర్ బాబు, సమంత, నాగా చైతన్య, అమల, అఖిల్, ఖుష్బూ, సుశాంత్ ఇలా అందరూ కూడా మంత్రి సురేఖ మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

తాజాగా ‘మా’ అధ్య‌క్షుడు మంచు విష్ణు కూడా ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. ప్ర‌జ‌ల దృష్టిని ఆక‌ర్షించేందుకు న‌టుల పేర్లు, వారి కుటుంబాల పేర్ల‌ను వాడొద్ద‌ద‌న్నారు. త‌మ వ్య‌క్తిగ‌త జీవితాల‌ను ప్ర‌జా చ‌ర్చ‌ల్లోకి లాగొద్ద‌ని విష్ణు పేర్కొన్నారు. అంద‌రూ ఒకరినొకరు గౌరవించుకోవాలి అని తెలిపారు. ఇలా మా ప్రెసిడెంట్ హోదాలో ఆయ‌న‌ ఓ సుదీర్ఘమైన లేఖ‌ను పోస్ట్‌ చేశారు. 

“సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో, వాటి కారణంగా కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని నేను భావిస్తున్నాను. మన పరిశ్రమ, ఇతర రంగాలవలే, పరస్పర గౌరవం మరియు నమ్మకంతో నడుస్తుంది. కానీ నిజం కాని కథనాలను ప్రజా లేదా రాజకీయ లాభాల కోసం వాడటం చాలా నిరాశను కలిగిస్తుంది.

మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం, కానీ మా కుటుంబాలు వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే వారికి కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం, లేదా వారి వ్యక్తిగత జీవితాలు అబద్దపు ఆరోపణలలోకి లాగబడటం ఇష్ట పడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు ఆ గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.

రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రాజకీయ కథ‌నాల కోసం లేదా ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లు వాడకండి.

మేము, చిత్రపరిశ్రమలో పనిచేసేవారు సమాజానికి వినోదం ఇవ్వడానికి, సహకరించడానికి ఎంతో కష్టపడుతున్నాం. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చలలోకి లాగకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా మనుషులుగా కూడా మన కుటుంబాల పైన వచ్చే అబద్ధపు కథనాల వలన కలిగే బాధ చాలా తీవ్రమైంది. 

ఇలాంటి సంఘటనలు మరింత సమస్యలని బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిస్తాం. పరిశ్రమ తరపున, నేను మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. మేమంతా ఏకమై నిలబడతామ” అని మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

నాగచైత‌న్య, నాని, అఖిల్‌, ఖుష్బూ ఏమ‌న్నారంటే..!

Hero Nani Akkineni Akhil and Khushbu Sundar Tweets on Konda Surekha Comments

కొండా సురేఖ వ్యాఖ్య‌లు పూర్తిగా అబద్ధ‌మే కాకుండా హాస్యాస్ప‌దం: నాగ‌చైత‌న్య


స‌మంత‌తో త‌న విడాకుల‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌ను అక్కినేని నాగ చైత‌న్య తీవ్రంగా ఖండించారు. మంత్రి వ్యాఖ్య‌లు పూర్తిగా అబద్ధ‌మే కాకుండా హాస్యాస్ప‌దమ‌ని పేర్కొన్నారు. 

“జీవితంలో విడాకుల నిర్ణ‌యం అనేది అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మైన‌, బాధాక‌ర‌మైన విష‌యాల్లో ఒక‌టి. ఎన్నో ఆలోచ‌న‌ల త‌ర్వాత ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే నా మాజీ భార్య‌, నేను విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. ఆ త‌ర్వాత విడాకులు తీసుకున్నాం. మా విడాకుల‌పై గ‌తంలో అనేక నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. 

ఇరు కుటుంబాల‌పై ఉన్న గౌర‌వంతో ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా. తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు పూర్తిగా అబద్ధ‌మే కాకుండా హాస్యాస్ప‌దం. ఆమె వ్యాఖ్య‌లు ఆమోద‌నీయం కాదు. స‌మాజంలో మ‌హిళ‌ల‌కు మ‌ద్ద‌తుతో పాటు గౌర‌వం ద‌క్కాలి. సినీ ప్ర‌ముఖుల ప‌ర్స‌న‌ల్ లైఫ్ నిర్ణ‌యాల‌ను మీడియా హెడ్ లైన్స్ కోసం ఉప‌యోగించుకోవడం సిగ్గుచేటు” అని నాగ‌చైత‌న్య ట్వీట్ చేశారు.  

సమాజానికి చెడుగా ప్రతిబింబించే ఇలాంటి వాటిని అంద‌రూ ఖండించాలి: నాని  


“తాము ఏం మాట్లాడినా త‌ప్పించుకోవ‌చ్చ‌ని రాజకీయ నాయకులు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖ‌త్వ‌మే అవుతుంది. ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. సమాజానికి చెడుగా ప్రతిబింబించే ఇలాంటి వాటిని అంద‌రూ ఖండించాలి” అని నాని ట్వీట్ చేశారు. 

ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం త‌ప్ప వేరే మార్గం లేదు: అక్కినేని అఖిల్ 


మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై అక్కినేని అమ‌ల చేసిన ట్వీట్‌కు ఆమె కుమారుడు, యువ న‌టుడు అఖిల్ స్పందించారు. “అమ్మ‌.. మీ ప్ర‌తి మాట‌కు నేను మ‌ద్ద‌తు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విష‌యంపై మీరు స్పందించాల్సి రావ‌డం ప‌ట్ల విచారం వ్య‌క్తం చేస్తున్నాను. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం త‌ప్ప మ‌న‌కు వేరే మార్గం లేదు” అని అఖిల్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

మంత్రి కొండా సురేఖ క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి: న‌టి ఖుష్బూ


మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ నేత‌, న‌టి ఖుష్బూ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా సినీ పరిశ్రమ గురించి బాధ్య‌త‌రాహిత్య‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. సినీ పరిశ్రమ ఇకపై ఇలాంటి వాటిని స‌హించ‌బోద‌ని, మొత్తం సినీ పరిశ్రమకు సురేఖ‌ క్షమాపణ చెప్పాల‌ని ఖుష్బూ ట్వీట్ చేశారు. 

“రెండు నిమిషాల ఫేమ్, ఎల్లో జర్నలిజంలో మునిగిపోయే వారు మాత్రమే ఇలాంటి భాష మాట్లాడతార‌ని అనుకున్నాను. కానీ ఇక్కడ స్త్రీత్వానికి ఘోర అవమానాన్ని చూస్తున్నాను. కొండా సురేఖ గారూ, మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై ఇలాంటి నిరాధారమైన, భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయ‌రాదు. ఇలాంటి ఆధారంలేని ఆరోప‌ణ‌లు చేస్తే సినీ పరిశ్రమ చూస్తూ కూర్చోదు. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు ఆరోపణలకు మీరు మరొక మహిళకు మహిళగా, మొత్తం సినీ పరిశ్రమకు క్షమాపణ చెప్పాలి. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు, కానీ మేము మీ స్థాయికి దిగజారలేం” అని ఖుష్బూ చెప్పుకొచ్చారు.

నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేం.. ఎన్‌టీఆర్‌

Jr NTR Tweet on Minister Konda Surekha Comments

నాగ చైత‌న్య‌-స‌మంత విడాకుల విష‌య‌మై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై నటుడు జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ఇత‌రులు త‌మ‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమ‌ని అన్నారు. సినీ పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా నిరాధారమైన ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం బాధించింద‌ని తార‌క్ పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మంత్రి వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. 

“కొండా సురేఖ గారూ, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం స‌రికాదు. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. ముఖ్యంగా సినీ పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా నిరాధారమైన ప్రకటనలు చేయ‌డం తీవ్రంగా బాధించింది. 

ఇతరులు మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం మౌనంగా కూర్చోం. ఇలాంటి వాటిని సినీ ప‌రిశ్ర‌మ స‌హించ‌దు. ఒక‌రిని ఒక‌రు గౌర‌వించుకోవ‌డం, ప‌రిధులు దాటి ప్ర‌వ‌ర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని క‌చ్చితంగా లేవ‌నెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను మన సమాజం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ హ‌ర్షించ‌దు” అని తార‌క్ ట్వీట్ చేశారు.

నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. అలాగే చాలామంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని సినిమా రంగం నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరేనని ఆమె ఆరోపించారు. 

కేటీఆర్ మత్తు పదార్థాలకు అలవాటు పడి, హీరోయిన్లకు కూడా మత్తు పదార్థాలు అలవాటు చేశారని ఆరోపించారు. వారితో కలిసి రేవ్ పార్టీలు చేసుకుని, మదమెక్కి… వారి జీవితాలతో ఆడుకున్నారని, ఆ తర్వాత వారిని బ్లాక్‌మెయిల్ చేశారని తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఈ విషయం సినీ ఇండ‌స్ట్రీలో అందరికీ తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. దీంతో సురేఖ వ్యాఖ్య‌ల‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

కొండా సురేఖ వ్యాఖ్యలపై హీరో మహేశ్ బాబు ఆగ్రహం

Mahesh Babu condemns Konda Surekha comments on cine celebrities

నాగచైతన్య, సమంత విడిపోవడానికి, చాలామంది హీరోయిన్లు సినీ పరిశ్రమను వదిలి పోవడానికి కేటీఆరే కారణమన్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. రాజకీయాల్లోకి సినిమా పరిశ్రమకు చెందిన వారిని లాగడం ఏమిటని ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగచైతన్య, సమంత, హీరోయిన్లపై సురేఖ మాట్లాడిన తీరును చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, నాగార్జున తదితర ప్రముఖులు స్పందించారు.

తాజాగా, నటుడు మహేశ్ బాబు కూడా ఈ అంశంపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మా సినిమా కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తనకు ఎంతో బాధ కలిగించాయి అని పేర్కొన్నారు. ఒక కూతురికి తండ్రిగా, భార్యకు భర్తగా, ఓ తల్లికి కొడుకుగా… ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన వ్యాఖ్యలు తనను తీవ్ర వేదనకు గురిచేశాయని, ఆమె ఉపయోగించిన భాష ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. 

ఎదుటివారి మనోభావాలను గాయపర్చనంత వరకు మనకు వాక్‌స్వాతంత్రం ఉంటుందని గుర్తు చేశారు. ఇలాంటి చవకబారు, నిరాధారమైన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సినిమా వారిని లక్ష్యంగా చేసుకోవద్దని, సినిమా వాళ్లే కదా అని చులకనగా చూడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. మన దేశంలోని మహిళలను, సినిమా పరిశ్రమ వారిని గౌరవించాలని సూచించారు.

నా భర్తపై అపనింద వేస్తావా?: నాగార్జున భార్య అమల

Shocked to hear a woman minister turn into a demon

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అక్కినేని నాగార్జున భార్య అమల తీవ్రంగా స్పందించారు. నా భర్తపై అపనింద వేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె ట్వీట్ చేశారు. ఓ మంత్రి అయి ఉండి ఇంత దారుణంగా మాట్లాడటం, కల్పిత చెడు ఆరోపణలు చేయడం దారుణమని పేర్కొన్నారు. వారి రాజకీయ యుద్ధానికి లేదా ప్రయోజనాల కోసం మంచి మనుషులను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని రాసుకొచ్చారు.

మేడమ్ మినిస్టర్, మీరు నిజాలు తెలుసుకోకుండా నా భర్తపై అపనిందలు వేశారని మండిపడ్డారు. తన భర్త గురించి తప్పుడు కథనాలు చెబుతున్న వ్యక్తులను నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఇది సిగ్గుచేటు అని పేర్కొన్నారు. రాజకీయ నేతలు ఇంతలా దిగజారి ప్రవర్తిస్తే మన దేశం ఏమవుతుంది? అని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆ తర్వాత రాహుల్ గాంధీని ఉద్దేశించి అమల ట్వీట్‌లో పేర్కొన్నారు. రాహుల్ గాంధీ గారూ, మీరు మానవత్వం, మర్యాదలను నమ్మితే దయచేసి మీ రాజకీయ నాయకులను అదుపులో ఉంచుకోండని సూచించారు. మీ మంత్రి మా కుటుంబానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె చేసిన విషపూరిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనన్నారు. ఇలాంటి వారి నుంచి ఈ దేశపౌరులను రక్షించాలని కోరారు.

ముదురుతున్న వివాదం.. కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

KTR sends legal notice to Konda Surekha

హీరోయిన్లను ఉద్దేశిస్తూ తనపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనకు ఏ మాత్రం సంబంధం లేని ఫోన్ ట్యాపింగ్ తో పాటు, ఇతర అంశాలపై కొండా సురేఖ అబద్ధాలు మాట్లాడారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన గౌరవానికి భంగం కలిగించేలా తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సాక్ష్యాలు లేకుండా అసత్యాలు మాట్లాడారని దుయ్యబట్టారు. 

గతంలో కూడా తన గురించి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని… ఆ వ్యాఖ్యలపై ఏప్రిల్ లో నోటీసులు పంపించానని కేటీఆర్ చెప్పారు. చట్ట పరంగా తాను స్పందించకుంటే… ఆమె చేసిన వ్యాఖ్యలు నిజమని ప్రజలు భావించే ప్రమాదం ఉందని అన్నారు. తనకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని… లేకపోతే పరువునష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తానని హెచ్చరించారు.

కేటీఆర్ వల్ల కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడ్డారని… కొందరు త్వరగా పెళ్లి చేసుకుని, ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారని కొండా సురేఖ అన్నారు. నాగార్జున కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాలకు… సమంత, నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు.

నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ కామెంట్లు విని షాక్ అయ్యాను: రామ్ గోపాల్ వర్మ

Ram Gopal Varma reaction on Konda Surekha comments

నాగచైతన్య-సమంత విడాకులకు కేటీఆర్ ను ముడిపెడుతూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టించడం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఎన్ కన్వెన్షన్ కూల్చకుండా ఉండడానికి కేటీఆర్ పెట్టిన ఓ షరతు నాగచైతన్య-సమంతల విడాకులకు దారితీసిందన్నది కొండా సురేఖ వ్యాఖ్యల సారాంశం. దీనిపై సినీ ప్రముఖుల తీవ్రస్థాయిలో స్పందిస్తున్నారు.

తాజాగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఈ అంశంపై తన బాణీ వినిపించారు. నాగార్జున కుటుంబాన్ని కొండా సురేఖ అత్యంత దారుణంగా అవమానపర్చిందని పేర్కొన్నారు. కొండా సురేఖ కామెంట్లు విని తాను షాక్ అయ్యానని వర్మ వెల్లడించారు. 

తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి అత్యంత గౌరవనీయ నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీదికి లాగడం ఏమాత్రం భరించరాని విషయం అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్జీవీ ట్వీట్ చేశారు.

. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

RS Praveen Kumar fires at Konda Surekha comments

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలు అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకు వెళ్తామన్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనమన్నారు.

రేవంత్ రెడ్డి పాలనలో అరాచకాలు, అశాంతి, అభద్రతాభావం పెరుగుతున్నాయని ఆరోపించారు. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున పట్టపగలే కేటీఆర్ కాన్వాయ్ మీద కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కాన్వాయ్‍‌‌పై దాడి జరిగి ఇరవై నాలుగు గంటలు దాటినా నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.

కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ భవన్ వద్దకు వచ్చి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారని, కానీ వారిపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి మా కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయడం లేదో చెప్పాలన్నారు.

కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత స్పందన

Samantha response on Konda Surekha comments on her divorce

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీ నటి సమంత స్పందించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె స్పందిస్తూ.. తన విడాకులు తన వ్యక్తిగత విషయమని, దాని గురించి ఎవరూ ఊహాగానాలు చేయవద్దని ఆమె అన్నారు. ఒక మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి పోరాడటానికి ఎంతో ధైర్యం, బలం కావాలని చెప్పారు. ఈ ప్రయాణం తనను మార్చినందుకు గర్వపడుతున్నానని… దయచేసి చిన్నచూపు చూడవద్దని కోరారు. ఒక మంత్రిగా మీ మాటలకు ఎంతో విలువ ఉంటుందనే విషయాన్ని మీరు గ్రహించి ఉంటారని అన్నారు. 

ఇతర వ్యక్తుల వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతగా, గౌరవంగా వ్యవహరించాలని తాను కోరుతున్నానని సమంత చెప్పారు. తన విడాకులు సామరస్యపూర్వకంగా జరిగాయని… అందులో రాజకీయ ప్రమేయం లేదని అన్నారు. తాను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటానని… తన పేరును రాజకీయాలకు దూరంగా ఉంచాలని కోరుకుంటున్నానని చెప్పారు.

 మంత్రి కొండా సురేఖ యూట‌ర్న్‌.. త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

Konda Surekha Take Back her Comments on Samantha

నాగ చైత‌న్య‌-స‌మంత విడాకుల విష‌య‌మై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ దుమారం రేపిన‌ విష‌యం తెలిసిందే. దీంతో మంత్రి వ్యాఖ్య‌ల‌ను అంద‌రూ ముక్త‌కంఠంతో ఖండించారు. దాంతో తాజాగా కొండా సురేఖ స్పందించారు. త‌న వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు తెలిపారు. 

త‌న వ్యాఖ్య‌ల ఉద్దేశం మ‌హిళ‌ల ప‌ట్ల ఒక నాయ‌కుడి చిన్న‌చూపు ధోర‌ణిని ప్ర‌శ్నించ‌డం మాత్ర‌మేన‌ని అన్నారు. కానీ స‌మంత మ‌నోభావాల‌ను దెబ్బ‌తీయ‌డం కాద‌ని స్ప‌ష్టం చేశారు. స్వ‌యం శ‌క్తితో ఆమె ఎదిగిన తీరు త‌న‌కు ఆద‌ర్శం అని సురేఖ అన్నారు. త‌న వ్యాఖ్య‌ల వ‌ల్ల స‌మంత కానీ, ఆమె ఫ్యాన్స్ కానీ మ‌న‌స్తాపానికి గుర‌యిన‌ట్లైతే బేష‌ర‌తుగా ఆ వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు మంత్రి తెలిపారు.

ఆ కుటుంబం పెట్టిన పోస్టు చూసి చాలా బాధ‌ప‌డ్డా.. నా ఉద్దేశం అది కాదు: మంత్రి కొండా సురేఖ

Konda Surekha Explanation on Comments about Akkineni Family

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతోనే భావోద్వేగానికి గురైనట్లు మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఆయనపై విమర్శలు చేసే క్రమంలోనే అనుకోకుండా ఓ కుటుంబాన్ని ప్రస్తావించాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు. ఇవాళ హనుమకొండలో మంత్రి కొండా సురేఖ మీడియా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. తనకు ఎవరిమీద వ్యక్తిగత ద్వేషం లేదని చెప్పిన మంత్రి.. ఆ కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి చాలా బాధపడ్డాన‌ని అన్నారు. 

మంత్రి కొండా సురేఖ ఇంకా మాట్లాడుతూ… “తాను ఏ విష‌యంలోనైతే బాధ‌ప‌డ్డానో.. ఆ విష‌యంలో మ‌రొక‌రిని నొప్పించాన‌ని తెలిసి నా వ్యాఖ్య‌ల‌ను ఉప‌సంహ‌రించుకున్నాను. నేను ప‌డ్డ బాధ మ‌రొక‌రు ప‌డ‌కూడ‌ద‌ని ఈ నిర్ణ‌యం తీసుకున్నాను. అప్పుడే దీనిపై స్పందిస్తూ ఎక్స్ (ట్విట్ట‌ర్) వేదిక‌గా పోస్టు పెట్టాను. అయితే, కేటీఆర్ విషయంలో మాత్రం వెన‌క్కి త‌గ్గే ప్ర‌స‌క్తి లేదు. ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే. కానీ ఇప్పుడు రివ‌ర్స్‌లో న‌న్ను ఆయన క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కోర‌డం విడ్డూరంగా ఉంది. ఆయ‌న వ్య‌వ‌హారం దొంగే.. దొంగా దొంగా అన్న‌ట్లుగా ఉంది. కేటీఆర్ లీగల్ నోటీసుపై న్యాయ‌ప‌రంగా ముందుకెళ్లం జ‌రుగుతుంది” అని మంత్రి సురేఖ‌ అన్నారు. 

ఇక మంత్రి సురేఖ ఇప్ప‌టికే సమంతకు ఎక్స్ వేదిక‌గా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే అంటూ మంత్రి తెలిపారు. కానీ, స‌మంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. త‌న‌ వ్యాఖ్యల పట్ల ఆమె కానీ, స‌మంత‌ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్ల‌యితే బేషరతుగా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. అన్యదా భావించవద్దని మంత్రి సురేఖ త‌న ఎక్స్ పోస్టులో వెల్లడించారు. 

మంత్రి కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా

Defamation case registered on Konda Surekha in Nampally court by Nagarjuna
  • నాంపల్లి కోర్టులో కేసు వేసిన అక్కినేని నాగార్జున
  • మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారన్న నాగార్జున
  • సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్ల ఫిర్యాదు

తెలంగాణ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు నాగార్జున పరువు నష్టం దావా వేశారు. నాంపల్లి కోర్టులో ఆయన ఈ దావా వేశారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు. నటి సమంత, నాగచైతన్య విడుకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై నాగార్జున కోర్టును ఆశ్రయించారు. మంత్రి తన కుటుంబ సభ్యుల పరువుకు భంగం కలిగించారని నాగార్జున పేర్కొన్నారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.

బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

మంత్రి కొండా సురేఖపై పలువురు బీఆర్ఎస్ మహిళా కార్పోరేటర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు సినీ ప్రముఖులపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్పోరేటర్లు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మహిళా కార్పోరేటర్లు మాట్లాడుతూ… నిన్న కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారని, అందుకే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కేటీఆర్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Related posts

ఈజిప్ట్ …ఇసుకలో సమాధి అయిన 3 వేల ఏళ్ల నాటి నగరం.. 

Drukpadam

7 people To Follow If You Want A Career in UX Design

Drukpadam

భద్రకాళి ఆలయంలో ప్రధాని మోదీ..

Drukpadam

Leave a Comment