- కరీంనగర్ మహాశక్తి ఆలయంలో కలిసి దాండియా తిలకించిన సంజయ్, ప్రభాకర్
- విద్యార్థి దశ నుంచి పని చేస్తూ మంత్రులుగా ఎదిగామన్న పొన్నం ప్రభాకర్
- వేర్వేరు పార్టీలైనప్పటికీ కరీంనగర్ అభివృద్ధికి పాటుపడతామని హామీ
తాను, బండి సంజయ్ విద్యార్థి దశ నుంచి క్రియాశీలకంగా పనిచేస్తూ ఈరోజు రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగామని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు బండి సంజయ్ కేంద్ర సహాయమంత్రిగా, తాను రాష్ట్ర మంత్రిగా ఉన్నామన్నారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో నిర్వహించిన దసరా నవరాత్రి ఉత్సవాల్లో పొన్నం పాల్గొన్నారు. ఇరువురు మహాశక్తి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇరువురు కలిసి మహాశక్తి ఆలయంలో నిర్వహించిన దాండియాను తిలకించారు.
అంతకుముందు పొన్నం మాట్లాడుతూ… బండి సంజయ్, తాను వేర్వేరు పార్టీలలో ఉన్నప్పటికీ కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం రాజీలేకుండా పని చేస్తామన్నారు. రాజకీయాలు వేరు… అభివృద్ధి వేరు అన్నారు. గత ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం తాము పని చేస్తున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులతో కేంద్రస్థాయిలో బండి సంజయ్, రాష్ట్రస్థాయిలో తాను జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు.