- మద్యం ధరలను పెంచాలని కోరుతున్న బ్రూవరీలు
- మద్యం ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం
- మద్యంపై రూ.20 నుంచి రూ.150 వరకు పెరిగే అవకాశం
మద్యం ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. మద్యం ధరలు పెంచాలని బ్రూవరీలు… ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రభుత్వం కూడా అందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. అదే జరిగితే ధరలు 15 శాతం వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
సాధారణంగా ప్రభుత్వం ధరలను ప్రతి రెండేళ్లకోసారి పెంచుతుంది. వివిధ రకాల మద్యంపై రూ.20 నుంచి రూ.150 వరకు పెంచాలని బ్రూవరీలు ప్రభుత్వాన్ని కోరాయి. తెలంగాణలోని 6 బ్రూవరీల్లో ప్రతి సంవత్సరం 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది.
ప్రతి సంవత్సరం దసరా పండుగ సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈసారి పది రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకు పైగా మద్యాన్ని తెలంగాణ మందుబాబులు తాగేశారు.
మద్యం అమ్మకాల్లో ఈసారి కూడా హైదరాబాద్ ముందు నిలిచింది. సెప్టెంబర్ 30 వరకు రూ.2,838 కోట్ల మద్యం అమ్మకాలు జరగగా… అక్టోబర్ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ రూ.1,100 కోట్ల విలువైన 10 లక్షల 44 వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. 10 రోజుల వ్యవధిలో 17 లక్షల 59 వేల బీర్లు అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది.