- జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో నిరసన కార్యక్రమంలో సింగర్
- నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో భావోద్వేగ గీతాలాపన
- ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ ఆడియన్స్ నినాదాలు
కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో పాల్గొన్న ప్రముఖ సినీ గాయని శ్రేయా ఘోషల్ తన పాటకు ఎవరూ చప్పట్లు కొట్టకూడదని విజ్ఞప్తి చేశారు. జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన నేపథ్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆమె పాల్గొని, హత్యాచార ఘటనపై భావోద్వేగ గీతాన్ని ఆలపించారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది.
“గాయపడిన నా శరీరం బాధను ఈ రోజు మీరు వింటున్నారు” అంటూ సాగే పాటను ఆమె ఆలపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తన పాటకు ఎవరూ చప్పట్లు కొట్టవద్దని విజ్ఞప్తి చేశారు. ఆమె పాట పాడటం పూర్తయ్యాక “వీ వాంట్ జస్టిస్” అంటూ ఆడియన్స్ నినాదాలతో హోరెత్తించారు.
శ్రేయా ఘోషల్ పాడిన పాటకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ గాయకుడు అర్జీత్ సింగ్ కూడా ఓ బెంగాలీ పాటతో నిరసనలకు మద్దతు తెలిపాడు. బాధితురాలికి న్యాయం జరగాలని కోరారు. న్యాయం కోసం తాను ఎంతో ఆవేదనతో పాట పాడుతున్నానని, మార్పును కోరుకునే వారి కోసం ఈ గీతం అన్నారు. భయంకరమైన హింసను ఎదుర్కొంటున్న మహిళలందరికీ సంఘీభావం తెలుపుతున్నానన్నారు.