- రైతుబంధు కావాలా? రాబందు కావాలా? అంటూ ముందే చెప్పామన్న కేటీఆర్
- ఇప్పుడు రైతుబంధు ఎగిరిపోయి… రాబందుల రెక్కల చప్పుడే మిగిలిందని విమర్శ
- ఉన్న రూ.10 వేల రైతుబంధు కూడా ఊడగొట్టారని ఆగ్రహం
రైతుబంధు కావాలా? రాబందు కావాలా? అంటూ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుకు ఉందా? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఖరీఫ్ భరోసా బోల్తా’ అంటూ పత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ జత చేస్తూ ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతుబంధు ఎగిరిపోయింది… రాబందుల రెక్కల చప్పుడే మిగిలిందని పేర్కొన్నారు. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్లుగా పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఊదరగొట్టి ఉన్న పదివేల రూపాయలు కూడా ఊడగొట్టారని విమర్శించారు. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే అన్నదాత వెన్ను విరవడమేనని మండిపడ్డారు. రైతు ద్రోహి కాంగ్రెస్.. చరిత్ర నిండా అనేక రుజువులు ఉన్నాయని… ఇప్పుడు మరో రుజువు కనిపిస్తోందని తెలిపారు.