పేలుడు ఘటనలో గాయపడిన పూజారి
విషయం తెలియడంతో ఘటనాస్థలికి పోలీసులు
పేలుడుకు గల కారణాలపై విచారణ
హైదరాబాద్ శివారులోని ఓ దేవాలయం సమీపంలో సోమవారం నాడు భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆలయ పూజారి గాయపడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధి మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ రోడ్డులో గల ప్రజాపతి శ్రీశ్రీశ్రీ యాదే మాత ఆలయం సమీపంలో ఈ పేలుడు జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పూజారి ఆలయం వెలుపల పేవ్‌మెంట్‌పై చెట్లను తొలగిస్తున్న సమయంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పూజారి సుగుమరాంను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇది మార్వాడి సమాజ్‌కు చెందిన దేవాలయం. ఉదయం పదిన్నర గంటల సమయంలో పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. బాంబ్ స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించింది. పేలుడుకు గల కారణాలపై ఫోరెన్సిక్ బృందం విచారణ చేపట్టింది.
ఆధారాలు సేకరించేందుకు పోలీసుల బృందాన్ని రంగంలోకి దించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (రాజేంద్రనగర్) టి.శ్రీనివాస్, స్థానిక కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేశారు.