Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

హమాస్ సాయుధ బలగాలను సమూలంగా నాశనం చేశామన్న నెతన్యాహు!

అనూహ్య పరిణామం.. ఆసక్తికర వ్యాఖ్యలు

  • యుద్ధ భూమి గాజాను ప్రత్యక్షంగా సందర్శించిన ఇజ్రాయెల్ ప్రధాని
  • యుద్ధం ముగిశాక గాజాను హమాస్ మళ్లీ పాలించలేదని ప్రకటన
  • హమాస్ సాయుధ బలగాలను సమూలంగా నాశనం చేశామన్న నెతన్యాహు

ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అందరినీ ఆశ్చర్యపరిచారు. అరుదైన రీతిలో  మంగళవారం గాజాలో ఆయన పర్యటించారు. హమాస్ సైనిక సామర్థ్యాలను ఇజ్రాయెల్ సాయుధ బలగాలు సమూలంగా నాశనం చేశాయని ఆయన ప్రకటించారు. హమాస్‌ను కూడా నామరూపాలు లేకుండా చేసేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. యుద్ధం ముగిసిన తర్వాత తిరిగి గాజాను హమాస్ పాలించడం సాధ్యపడదని బెంజమిన్ నెతన్యాహు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు గాజా సముద్ర తీరంలో నిలబడి మాట్లాడారు. ‘హమాస్ తిరిగి రాదు’ అనే క్యాప్షన్‌తో వీడియోను ఇజ్రాయెల్ బలగాలు షేర్ చేశాయి. ఆర్మీ చొక్కా, బాలిస్టిక్ హెల్మెట్ ధరించి ఆయన కనిపించారు. గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్ మిలిటరీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు.

కాగా ఇప్పటికీ హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల గురించి బెంజిమన్ నెతన్యాహు మాట్లాడారు. గాజాలో కనిపించకుండాపోయిన 101 మంది ఇజ్రాయెల్ బందీల కోసం అన్వేషణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. బందీలను అప్పగిస్తే ఒక్కొక్కరికి 5 మిలియన్ డాలర్లు చొప్పున నగదు బహుమతిని కూడా ఇస్తామని నెతన్యాహు ఆఫర్ ఇచ్చారు. తమ బందీలకు హాని చేసే ధైర్యం చేస్తే వారి తలపై రక్తం చిందుతుందని, వెంటాడి వేటాడి పట్టుకుంటామని హమాస్ నేతలను ఆయన హెచ్చరించారు. అయితే బందీలను తమకు అప్పగించేవారు సురక్షితంగా ఉంటారని ఆయన హామీ ఇచ్చారు.

Related posts

భార్యను తుపాకీతో కాల్చి చంపేసిన అమెరికా న్యాయమూర్తి

Ram Narayana

3 వేల కార్లతో వెళ్తున్న నౌకలో అగ్నిప్రమాదం.. వాహనాలన్నీ బుగ్గి

Ram Narayana

షేక్ హసీనాకు ఆశ్రయంపై బ్రిటన్ ఏం చెబుతోంది?

Ram Narayana

Leave a Comment