- ‘యూపీఐ లైట్’ వాలెట్ పరిమితి రూ.2000 నుంచి రూ.5000కు పెంపు
- ఒక్కో లావాదేవీ గరిష్ఠ పరిమితి రూ.500 నుంచి రూ.1000కి పెంపు
- ఆఫ్‌లైన్ విధానాన్ని కూడా అప్‌డేట్ చేసిన ఆర్బీఐ
- సౌకర్యవంతమైన నూతన మార్గదర్శకాల విడుదల
కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యూపీఐ లైట్’ వాలెట్ పరిమితిని రూ.2000 నుంచి రూ.5000లకు పెంచింది. ఇక గరిష్ఠ లావాదేవీ పరిమితిని రూ.500 నుంచి రూ.1000కి పెంచింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. ఆఫ్‌లైన్ పేమెంట్ విధానాన్ని కూడా అప్‌డేట్ చేశామని, ఒక ట్రాన్సాక్షన్‌లో గరిష్ఠంగా వెయ్యి రూపాయలు, ఒక రోజులో గరిష్ఠంగా రూ.5000 వరకు లావాదేవీలు నిర్వహించవచ్చని సూచించింది.
సవరించిన ‘యూపీఐ లైట్’ పరిమితులు తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్బీఐ వెల్లడించింది. రోజువారీ కొనుగోళ్ల కోసం ఈ విధానంలో చెల్లింపులపై ఆధారపడే వినియోగదారులకు తాజా మార్పులు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయని ఆర్బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. డిజిటల్ చెల్లింపులను క్రమబద్ధీకరించడంతో పాటు వినియోగదారుల భద్రత, సౌలభ్యాన్ని పెంచుతాయని ఆర్బీఐ ధీమా వ్యక్తం చేసింది.
కాగా యూపీఐ లైట్ విధానంలో యూపీఐ పిన్‌ని ఉపయోగించకుండానే తక్కువ విలువ లావాదేవీలు నిర్వహించచ్చు. వేగంగా పేమెంట్లు చేసేందుకు అవకాశం ఉంటుంది. టైమ్ సేవ్ కావడంతో పాటు సైబర్ మోసగాళ్ల బారిన పడినా రిస్క్ ఉండే డబ్బు తక్కువగా ఉంటుంది.