- డీఎంకే హయాంలో అదానీ గ్రూప్ తో ఒప్పందాలు చేసుకోలేదన్న మంత్రి
- ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపాటు
- అన్నాడీఎంకే హయాంలో విద్యుత్ ఒప్పందం జరిగిందని వెల్లడి
సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఎలాంటి కాంట్రాక్ట్ పై సంతకం చేయలేదని తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ తెలిపారు. గౌతమ్ అదానీని ముఖ్యమంత్రి స్టాలిన్ ఎప్పుడూ కలవలేదని చెప్పారు. అదానీ గ్రూప్ తో డీఎంకే హయాంలో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని అన్నారు.
అదానీని స్టాలిన్ కలవలేదని… అధిక ధరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్నారంటూ ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. కొన్ని మీడియా సంస్థలు కూడా అసత్య కథనాలను ప్రచురిస్తున్నాయని అన్నారు. యూనిట్ కు రూ. 7.01 చొప్పున విద్యుత్ కొనుగోలు చేసిన అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని తెలిపారు.
అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో అదానీ గ్రూపుకు చెందిన 648 మెగావాట్ల సోలార్ ప్లాంట్ నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందని… దీన్ని డీఎంకే ప్రభుత్వం చేసుకున్నట్టుగా చిత్రీకరించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దిగజార్చేలా అసత్య ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.