- బెంగళూరు నుంచి తిరుమల చేరుకున్న కారులో చెలరేగిన మంటలు
- ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఘటన
- కారు యజమాని అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
తిరుమలలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ కారు హఠాత్తుగా దగ్ధం కావడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. బెంగళూరుకు చెందిన భరత్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనం కోసం కారులో తిరుమలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరిన వారు .. రాత్రి 9.05 గంటలకు తిరుమల ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నారు.
అయితే .. ఆ సమయంలో కారులో నుంచి పొగలు రావడం గమనించిన భరత్.. వెంటనే అప్రమత్తమయ్యాడు. కారులో నుంచి కుటుంబ సభ్యులందరినీ వెంటనే కిందకు దింపేశాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లో కారులో నుంచి మంటలు వ్యాపించాయి. వారు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.
అప్పటికే మంటల్లో కారు ముందు భాగం పూర్తిగా దగ్దమైంది. అయితే ముందుగా కారులో ఉన్నవారు అప్రమత్తమవ్వడంతో సురక్షితంగా బయటపడ్డారు. పెనుప్రమాదం తప్పిపోయిందంటూ ఊపిరిపీల్చుకున్నారు.