Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఒడిశా గవర్నర్ గా కంభంపాటి హరిబాబు…

  • ఐదు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
  • ముగ్గురు గవర్నర్లు బదిలీ..
  • రెండు రాష్ట్రాలకు నూతన గవర్నర్‌లు నియామకం

ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా సేవలు అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డాక్టర్ కంభంపాటి హరిబాబు ఒడిశా గవర్నర్‌గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం దేశంలోని పలు రాష్ట్రాలకు గవర్నర్‌లను నియమించింది. మూడు రాష్ట్రాల్లో గవర్నర్లను బదిలీ చేసిన కేంద్రం రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. 

ఈ క్రమంలో మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కేంద్రం ఒడిశాకు బదిలీ చేసింది. అలాగే బీహార్ గవర్నర్‌గా కొనసాగుతున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కేరళ గవర్నర్‌గా, ప్రస్తుత కేరళ గవర్నర్‌గా ఉన్న అరిఫ్ మహ్మద్ ఖాన్‌ను బీహార్‌కు బదిలీ చేశారు. మిజోరం గవర్నర్‌గా జనరల్ విజయ్ కుమార్ సింగ్, మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

కంభంపాటి హరిబాబు ఏపీలోని ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం గ్రామంలో జన్మించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత అదే విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పొందారు. అక్కడే అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేసి 1993లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. 

తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన కంభంపాటి .. ఏపీ బీజేపీలో కీలకంగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగానూ బాధ్యతలు నిర్వహించారు. 2021 జులైలో తొలిసారి ఆయన మిజోరం గవర్నర్‌గా నియమితులైయ్యారు. ఒడిశా గవర్నర్ రఘుబర్ దాస్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి .. తాజాగా ఆయన స్థానంలో కంభంపాటిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

Related posts

 ఈ బిల్లు నాకు వ్యక్తిగతంగా భావోద్వేగంతో కూడుకున్నది: సోనియాగాంధీ

Ram Narayana

రాహుల్ గాంధీ ఆరోపణలను ఖండించిన ఆర్మీ!

Ram Narayana

తిరుపతి లడ్డూ వివాదంపై తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ!

Ram Narayana

Leave a Comment