Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలు

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై కత్తితో దాడి.. ఆరు చోట్ల గాయాలు

  • ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఘటన
  • చోరీ కోసం ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు
  • అడ్డుకునే ప్రయత్నం చేసిన సైఫ్‌పై దాడి
  • లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దుండగుడు దాడిచేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఆయన ఇంట్లోకి ప్రవేశించి కత్తితో ఆయనపై దాడిచేశాడు. ఈ ఘటనలో సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నాడు. 

ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సైఫ్ కుటుంబం నిద్రలో ఉండగా ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చోరీకి యత్నించాడు. అలికిడికి మెలకువ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసిన సైఫ్‌పై దుండగుడు దాడిచేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సైఫ్ ఇంటికి చేరుకుని ఆధారాలు సేకరించారు. నిందితుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దాడి.. స్పందించిన ఎన్‌టీఆర్‌

Shocked and Saddened to Hear About The Attack on Saif Ali Khan Sir Says Jr NTR

బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై క‌త్తితో దుండగుడి దాడిపై జూనియ‌ర్ ఎన్‌టీఆర్ స్పందించారు. ఈ దాడి త‌న‌ను షాక్‌కు గురి చేసింద‌ని తారక్ ట్వీట్ చేశారు. “సైఫ్ అలీ ఖాన్ సార్‌పై జ‌రిగిన దాడి గురించి విని షాక్‌కు గుర‌య్యా. ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాలి. ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని కోరుకుంటున్నా” అని ఎన్‌టీఆర్ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. 

అటు దేవ‌ర టీమ్ కూడా ఈ ఘ‌ట‌న‌పై స్పందించింది. “ఇది తెలుసుకుని దిగ్భ్రాంతికి గుర‌య్యాం. త్వ‌ర‌గా కోలుకోండి సైఫ్ సార్” అని పేర్కొంది. 

కాగా, గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఈ తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో సైఫ్‌ ఇంట్లోకి చొర‌బ‌డి కత్తితో ఆయనపై దాడికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో సైఫ్‌కు ఆరు చోట్ల గాయాలయ్యాయి. దాంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను లీలావ‌తీ ఆసుపత్రికి తరలించారు.

ప్ర‌స్తుతం ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. కాగా, సైఫ్‌కు అయిన గాయాల్లో రెండు మ‌రీ లోతుగా ఉన్నాయ‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ దాడి ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న బాలీవుడ్ వ‌ర్గాల‌ను ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది. 

సైఫ్ అలీ ఖాన్‌ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల

Lilavati Hospital has issued a statement regarding the attack on Saif Ali Khan

దేశవ్యాప్తంగా అభిమానులను కలిగివున్న బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇవాళ (గురువారం) తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో  ఆయన నివాసంలోనే కత్తి దాడి జరిగిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన అతడిని ముంబైలోని లీలావతి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

సైఫ్ అలీఖాన్‌ శరీరంపై ఆరు కత్తిపోట్లు ఉన్నాయని, అందులో రెండు లోతైన తీవ్ర గాయాలని వైద్యులు ప్రకటించారు. మెడ, వెన్నెముకపై కత్తి పోట్లు లోతుగా దిగాయని వివరించారు. ప్రస్తుతం ఆయనకు శస్త్రచికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు.

సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనపై పోలీసులు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించామని తెలిపారు. సైఫ్‌కు, దుండగుడికి మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగిందని, ఈ క్రమంలోనే సైఫ్ కత్తిపోట్లకు గురయ్యారని వాంగ్మూలంలో పోలీసులు పేర్కొన్నారు. 

మరోవైపు, ముంబై పోలీసులు బాంద్రాలోని సైఫ్ అలీఖాన్ నివాసానికి చేరుకొని ఇంట్లో పనిచేసే సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దాడి చేసిన వ్యక్తిని కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. సీసీటీవీ ఫుటేజీలలో దుండగుడి కదలికలు నమోదయాయి. ఇంట్లో చోరీకి ప్రయత్నించినట్లు తెలుస్తోందని, అభిమానులు ఓపిక పట్టాలంటూ సైఫ్‌ అలీఖాన్‌ టీమ్‌ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా, సైఫ్ అలీఖాన్ చివరిగా ‘దేవర: పార్ట్ 1’లో సినిమాలో మెప్పించిన విషయం తెలిసిందే.

నిలకడగా సైఫ్ ఆరోగ్యం… ఔటాఫ్ డేంజర్ అన్న వైద్యులు

Doctors Say Saif Ali Khan Out Of Danger

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రమాదం తప్పినట్టేనని వైద్యులు ప్రకటించారు. కత్తిపోట్ల కారణంగా సైఫ్ వెన్నెముకకు గాయం అయిందని లీలావతి ఆసుపత్రి వైద్యుడు ఒకరు తెలపారు. మెడపైనా కత్తి గాయం అయిందని వివరించారు. సైఫ్ వీపు భాగంలో ఇరుక్కుపోయిన కత్తి మొనను బయటకు తీసినట్లు సమాచారం. కాగా, సైఫ్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆయన ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వివరించారు.

బుధవారం రాత్రి 2:30 గంటల ప్రాంతంలో సైఫ్ ఇంట్లోకి చొరబడ్డ ఓ దుండగుడు హీరోపై దాడి చేసిన విషయం తెలిసిందే. అనంతరం దుండగుడు పారిపోగా సైఫ్ కుమారుడు ఇబ్రహీం తన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. రక్తమోడుతున్న తండ్రిని ఎత్తకుని బయటకు పరుగు పెట్టాడు. సమయానికి కారు లేకపోవడంతో ఆటోలోనే సైఫ్ ను ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం.

ఇంట్లో నక్కి ఉండి సైఫ్ అలీఖాన్‌పై దాడి చేశాడా?… సీసీటీవీ ఫుటేజీ పరిశీలించిన పోలీసులు

CCTV cameras at Saif Ali Khans home did not capture anyone entering premises within two hours before attack

బాలీవుడ్ అగ్రనటుడు సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి ఘటనలో దర్యాప్తును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. ఒకపక్క ఇంట్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రశ్నిస్తూనే, మరోపక్క సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. గురువారం తెల్లవారు జామున 2.30 గంటల సమయంలో దాడి జరగగా, ఈ దాడికి రెండు గంటల ముందు ఎవరూ సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు నిర్ధారించారు. రాత్రి 12 గంటల తర్వాత ఎవరూ నివాసంలోకి వెళ్లలేదని సీసీటీవీ ఫుటేజీల ద్వారా స్పష్టమైనట్టు చెబుతున్నారు.

సైఫ్‌పై దాడి చేసిన వ్యక్తి ముందుగానే బిల్డింగ్‌లోకి ప్రవేశించి దాడికి అనువైన సమయం కోసం వేచిచూశాడా? అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. లోపల దాక్కొని ఈ పన్నాగానికి పాల్పడ్డాడా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటన నేపథ్యంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సారథ్యంలోని కూటమి ప్రభుత్వంపై అక్కడి విపక్షాలు మండిపడుతున్నాయి. సెలబ్రిటీలకు కూడా రక్షణ లేకపోతే, ముంబై నగరంలో శాంతిభద్రతల పరిస్థితి ఏమిటంటూ విరుచుకుపడుతున్నాయి.

సైఫ్ అలీఖాన్ ను కత్తితో పొడిచిన సమయంలో పక్కనే ఉన్న భార్య కరీనా కపూర్

Kareen Kapoor with Saif Ali Khan when he was stabbed

సైఫ్ అలీ ఖాన్ పై ఆయన నివాసంలో నిన్న రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయనపై దాడి చేశారు. ఆ సమయంలో ఆయనతో పాటు ఆయన భార్య, బాలీవుడ్ నటి కరీనా కపూర్, పిల్లలు ఉన్నారు. దాడి జరిగే సమయంలో అరుపులు విని, అక్కడకు వచ్చిన సైఫ్ కేర్ టేకర్ అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆయనపై కూడా దుండగులు దాడి చేశారు. 

దాడికి ఒక రోజు ముందే దుండగులు సైఫ్ ఇంట్లోకి చేరుకున్నట్టు సమాచారం. ఒక వ్యక్తి మాత్రమే సైఫ్ పై కత్తితో దాడి చేశారనే వార్తలు ఇప్పటి వరకు వచ్చినప్పటికీ… ఇద్దురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించినట్టు ఇప్పుడు తెలుస్తోంది. 

ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో సైఫ్ చికిత్స పొందుతున్నారు. ఆయనకు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఆసుపత్రికి చెందిన ఒక వైద్యుడు నితిన్ దంగే స్పందిస్తూ… కత్తి పోట్ల వల్ల సైఫ్ వెన్నులో స్పైనల్ ఫ్లూయిడ్ లీక్ అయిందని తెలిపారు. వెన్నులో ఉన్న కత్తి ముక్కను తొలగించామని వెల్లడించారు. కత్తి పోట్ల కారణంగా గాయపడ్డ సైఫ్ చేతికి, మెడకు ప్లాస్టిక్ సర్జరీలు నిర్వహించామని తలిపారు. సైఫ్ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని చెప్పారు. 

అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆసుపత్రిలో సైఫ్ అడ్మిట్ అయ్యారని డాక్టర్ నితిన్ తెలిపారు. థొరాసిక్ స్పైనల్ కార్డ్ లో ఆయనకు కత్తి ముక్క ఇరుక్కుపోయిందని చెప్పారు. థొరాసిక్ స్పైనల్ కార్డ్ మెడ దిగువ ప్రదేశం, పక్కటెముకల దిగువ ప్రదేశం మధ్యలో ఉంటుందని తెలిపారు. కత్తి ముక్కను తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించామని చెప్పారు. సైఫ్ ఎడమ చెయ్యి మీద రెండు, మెడ మీద ఒకటి లోతైన కత్తిపోటు గాయాలు ఉన్నాయని వెల్లడించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని చెప్పారు. 

సైఫ్ కోలుకుంటున్నారని మరో డాక్టర్ తెలిపారు. ప్రస్తుత పరీక్షల తర్వాత ఆయన 100 శాతం కోలుకుంటారనే అంచనాలు తమకు ఉన్నాయని చెప్పారు. సైఫ్ కు ఆరు కత్తిపోట్లు ఉన్నాయని ఆసుపత్రి వర్గాలు చికిత్స ప్రారంభంలో తెలిపిన సంగతి తెలిసిందే.

సైఫ్ అలీ ఖాన్ ఇంటిని పరిశీలించిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్

Encounter specialist Daya Nayak visits Saif Ali Khan residence

కత్తిపోట్లకు గురైన బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. మరోపై సైఫ్ పై దాడి చేసిన నిందితుల కోసం పోలీసులు పది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. 

మరోవైపు, బాంద్రాలోని సైఫ్ ఇంటిని పోలీసు అధికారులు పరిశీలించారు. వీరిలో ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా పేరుగాంచిన దయా నాయక్ కూడా ఉన్నారు. సైఫ్ ఇంటికి వచ్చిన ఆయన… ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. 

ముంబై అండర్ వరల్డ్ ను వణికించిన ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా దయాకు పేరుంది. దాదాపు 80 మందిని ఆయన ఎన్ కౌంటర్ చేసినట్టు సమాచారం. ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా ఆయనకు ఎంత గొప్ప పేరు ఉందో… ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా అంతే అపఖ్యాతి ఉంది. దయా నాయక్ జీవిత కథ స్ఫూర్తితో బాలీవుడ్ లో సినిమాలు కూడా వచ్చాయి. సైఫ్ పై దాడి కేసులో ఘటనను పరిశీలించడానికి దయా నాయక్ రావడంతో… అందరిలో ఎంతో ఆసక్తి నెలకొంది.

Related posts

టీవీ సెట్‌టాప్‌ బాక్స్‌ షాక్ కొట్టి నాలుగేళ్ల బాలుడి మృతి

Ram Narayana

కోర్టు హాలులోనే రాజీనామా చేసిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి

Ram Narayana

తెల్లవారుజామునే కూరగాయల మార్కెట్‌లో రాహుల్ గాంధీ.. వ్యాపారులతో మాట్లాడిన కాంగ్రెస్ నేత..

Ram Narayana

Leave a Comment