- రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘటన
- ఈ నెల 8న కనిపించకుండా పోయిన సాకేత్, బిందు
- 11న పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టల్లో హత్య
- పక్కా ప్రణాళికతోనే జరిగి ఉంటుందని పోలీసుల అనుమానం
- నిందితుల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపిన జంట హత్యల కేసులో చిక్కుముడి వీడింది. వివాహేతర బంధమే ఈ హత్యలకు కారణమని పోలీసులు నిర్ధారించారు. మృతులను అంకిత్ సాకేత్ (25), బిందు (25)గా గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది.
పోలీసుల కథనం ప్రకారం.. చత్తీస్‌గఢ్‌కు చెందిన బిందు, దివాకర్ దంపతులు శంకర్‌పల్లిలో ఉండేవారు. వీరికి ముగ్గురు పిల్లలు. దివాకర్ ప్లంబర్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో అక్కడ హౌస్‌కీపింగ్ చేసే సాకేత్‌తో బిందుకు ఏర్పడిన పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. గమనించిన దివాకర్ కుటుంబాన్ని వనస్థలిపురంలోని చింతల్‌కుంటకు మార్చాడు. కొన్ని రోజుల క్రితం బిందు, సాకేత్ ఇద్దరూ మాయమయ్యారు. దీంతో దివాకర్ ఈ నెల 8న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల తర్వాత సాకేత్ కనిపించడం లేదంటూ ఆయన సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ నెల 14న పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి గుట్టల్లో రెండు మృతదేహాలను గుర్తించారు. వీరిద్దరినీ దారుణంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. 11నే వీరు హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
బిందుతో సాకేత్ వ్యభిచారం చేయిస్తున్న విషయం బయటపడింది. ఈ నెల 8న వనస్థలిపురం వెళ్లిన సాకేత్ అక్కడి నుంచి బైక్‌పై బిందును తీసుకుని నానక్‌రామ్‌గూడ వెళ్లాడు. అక్కడ మిత్రుడి గదిలో మూడు రోజులున్నాడు. 11న ఫోన్ కాల్ రావడంతో బిందుతో కలిసి అనంత పద్మనాభస్వామి గుట్టల వద్దకు చేరుకున్నాడు. అక్కడ నలుగురైదుగురితో కలిసి మద్యం తాగారు. ఈ క్రమంలో అక్కడ గొడవ జరిగింది. సాకేత్‌ను వారు కత్తితో పొడవడంతో భయపడిన బిందు పారిపోయే ప్రయత్నంలో హత్యకు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
బిందుతో సంబంధం కొనసాగిస్తున్న మరో వ్యక్తి వారిని అక్కడికి రప్పించి ఈ హత్యకు ప్లాన్ చేసి ఉంటాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పలు బృందాలు గాలిస్తున్నాయి.