- బీఆర్ఎస్ నేతలు కుల గణనలో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని నిలదీత
- బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా కుల గణన సర్వేలో పాల్గొనలేదన్న ముఖ్యమంత్రి
- సర్వేలో భూముల వివరాలు చెప్పాలని అడిగితే సమాచారం ఇవ్వలేదని విమర్శ
కుల గణన సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు కుల గణన సర్వేలో పాల్గొనలేదని ఆయన విమర్శించారు.
అసెంబ్లీలో సామాజిక, ఆర్థిక, కుల గణనపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ నేతలు సర్వేలో ఎందుకు పాల్గొనలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. సర్వేలో పాల్గొనని వారికి ఈ సభలో మాట్లాడే అవకాశం ఇవ్వవద్దని సభాపతికి ఆయన విజ్ఞప్తి చేశారు.
అంతేకాకుండా ఎమ్మెల్యేలు పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ కూడా సర్వేలో పాల్గొనలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. సర్వే ఫారంలో భూముల వివరాలు అడిగే కాలమ్ ఉన్నప్పటికీ ఎవరూ సమాచారం ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. భూముల వివరాలు అడిగితే కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు భయపడి సర్వేలో పాల్గొనలేదని ముఖ్యమంత్రి ఆరోపించారు.