కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది…ముఖ్యమంత్రిపై వ్యతిరేకత వచ్చింది ..కేసీఆర్
ఈసారి అధికారం బీఆర్ యస్ దే అని ధీమా ..
తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయం
ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్‌కు ఏమీ కాదన్న కేసీఆర్
భవిష్యత్తులో కాంగ్రెస్ మళ్లీ గెలవదని జోస్యం
తెలంగాణ ప్రజల కోసం బీఆర్ఎస్ మాత్రమే పోరాడగలదు
సంస్థాగత నిర్మాణంపై ద్రుష్టి పెట్టాలన్న కేసీఆర్ …
కమిటీల ఇంచార్జి భాద్యతలు హరీష్ రావుకు ఇస్తున్నట్లు వెల్లడి
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ,ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బీఆర్ యస్ అధ్యక్షులు ,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు ..సీఎం పై ఇంత త్వరగా వ్యతిరేకత వస్తుందని తాను ఊహించలేదన్నారు ..బుధవారం బీఆర్ యస్ కార్యాలయం తెలంగాణ భవన్ జరిగిన రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు …తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం తథ్యమని పేర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మనం తప్పకుండా అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన బీఆర్ఎస్‌కు ఏమీ కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ అస్థిత్వ పార్టీ బీఆర్ఎస్ అని ఆయన ఉద్ఘాటించారు. గత గాయాల నుండి కోలుకున్న తెలంగాణను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ అదే స్థితికి తీసుకువెళుతోందని విమర్శించారు. తెలంగాణ మరోసారి దోపిడీ, వలసదారుల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తెలంగాణ ప్రజల శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని అన్నారు.
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలవదని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుత ఈ ముఖ్యమంత్రిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని, ఇంత త్వరగా ఆయనపై వ్యతిరేకత వస్తుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఆదాయం పెంచుకుంటూ వెళ్లామని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అదే అధికారులు ఉన్నారని, కానీ ప్రభుత్వం వారితో సరిగ్గా పని చేయించుకోవడం లేదని విమర్శించారు. ఏప్రిల్ 10వ తేదీ నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని, జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభ
తెలంగాణ ప్రజల కష్టనష్టాలు బీఆర్ఎస్‌కు మాత్రమే తెలుసని, వారి కోసం మన పార్టీ మాత్రమే పోరాడగలదని కేసీఆర్ అన్నారు. దశాబ్దాల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో తిరోగమనం చెందుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకోవడానికి పోరాటం చేయాలని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలు, ప్లీనరీ తదితర అంశాలపై చర్చించారు. పార్టీ ఆవిర్భావం మొదలు ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రస్థానంపై కేసీఆర్ వివరించారు. తెలంగాణ కోసం జరిగిన ఉద్యమం, అధికారంలోకి వచ్చాక తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కృషిని కూడా వివరించారు.
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పొడవునా నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ కమిటీలను వేయాలని నిర్ణయించారు. కమిటీల ఇంఛార్జి బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.