పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ కు సిపిఎం సంపూర్ణ మద్దతు
విభజన హామీలు నెరవేర్చని బీజేపీ
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం
బండి సంజయ్ అభివృద్ధి పనులు ఎక్కడ …
పసుపు బోర్డు కు నిధులు లేవు
ఖాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ,గిరిజన యూనివర్సిటీలు వాగ్దానాలకే పరిమితం..
కరీంనగర్ మీడియా సమావేశంలో సిపిఎం నేతలు
తెలంగాణ రాష్ట్రంలోని పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డికి సిపిఎం పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ విలేకరుల సమావేశంలో స్పష్టమైన ప్రకటన చేసింది. సమావేశం కరీంనగర్ పట్టణంలోని స్థానిక పాత్రికేయుల భవన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల ప్రస్తుత 13 జిల్లాల కార్యదర్శులు పాల్గొన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, బండారు రవికుమార్ మాట్లాడుతూ, ఉమ్మడి నాలుగు జిల్లాలకు చెందిన బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్‌లో నిధులను తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందారని ఆరోపించారు. తెలంగాణ విభజన హామీలను బీజేపీ నెరవేర్చలేదని, కరీంనగర్ జిల్లాకు బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నా కూడా అభివృద్ధి పనులు చేపట్టలేదని విమర్శించారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు మంజూరు చేసినప్పటికీ నిధులు కేటాయించకపోవడం, కాజీపేట రైల్వే కోచ్, గిరిజన యూనివర్సిటీ వంటివి వాగ్దానాలగానే మిగిలిపోయాయని తెలిపారు.
కేంద్రంలో అధికారాన్ని ఉపయోగించి బీజేపీ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తోందని, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థిగా ఉన్న అంజిరెడ్డి వ్యాపారవేత్తగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తున్నారని, ప్రజలు దీనిని గమనించి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు.
సిపిఎం రాజకీయ విధానం మేరకు బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే శక్తి, సామాజిక సేవలో అనుభవం, విద్య ఉన్న వూట్కూరి నరేందర్ రెడ్డి లాంటి అభ్యర్థి గెలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 13 జిల్లాల కార్యదర్శుల అభిప్రాయం మేరకు నరేందర్ రెడ్డికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని, సిపిఎం కార్యకర్తలు, మేధావులు, పట్టభద్రులు కలిసి ప్రచారం చేసి ఆయన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సిపిఎం కీలక నాయకులు మిల్కూరి వాసుదేవ రెడ్డి, వై. యాకయ్య, ఏ. రమేష్ బాబు, కె. చంద్రశేఖర్, కె. నర్సమ్మ, ఆముదాల మల్లారెడ్డి, సంకె రవి, ముషం రమేష్, పి. శ్రీకాంత్, దుర్గం నూతన్, లంక రాఘవులు, కోట శ్రీనివాస్, జీ. ముకుంద రెడ్డి, గుడికందుల సత్యం, జి. బీమా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.