- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
- యుద్ధానికి ముగింపు ఇప్పట్లో కనిపించడం లేదన్న జెలెన్‌స్కీ
- చాలా దూరంలో ఉందని వ్యాఖ్యలు
రష్యాతో జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు రష్యాతో యుద్ధం ముగింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో జెలెన్‌స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. యుద్ధానికి ముగింపు ఇప్పట్లో కనిపించడం లేదని, అది చాలా దూరంలో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
ఇటీవల అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరిగిన చర్చల్లో వాగ్వాదంపై ఆయన స్పందిస్తూ, అగ్రరాజ్యం నుంచి తదుపరి మద్దతు ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికాతో తమ సంబంధం కొనసాగుతుందని భావిస్తున్నానని, ఇది ఇప్పటి బంధం కాదని ఆయన పేర్కొన్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా చేస్తున్న సహాయాన్ని ఆయన గుర్తు చేశారు.
అమెరికాతో బలమైన భాగస్వామ్యం ఉందని జెలెన్‌స్కీ అన్నారు. అమెరికాతో ఖనిజ నిల్వల అంశంపై ఒప్పందానికి తాను సిద్ధమేనని పేర్కొన్న ఆయన, అమెరికాకు ఉక్రెయిన్ ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని తెలిపారు.