
- జనాభా లెక్కల ఆధారంగా ఎంపీ స్థానాల పునర్విభజన చేయాలనుకుంటున్న కేంద్రం
- దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న విజయ్
- యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో స్థానాలు పెరిగితే సహించబోమని హెచ్చరిక
లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వానికి, పలు రాష్ట్రాల్లోని పార్టీలకు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే అంశంపై తమిళ స్టార్ హీరో, తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ స్పందిస్తూ…. పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాలని అన్నారు.
జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేస్తే… పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందని విజయ్ అన్నారు. దీన్ని ఎంతమాత్రం అంగీకరించబోమని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ గత 50 ఏళ్లుగా జనాభా పెరుగుదలను నియంత్రించాయని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ స్థానాలు తగ్గినా… యూపీ, బీహార్ వంటి రాష్ట్రాల్లో స్థానాలు పెరిగినా సహించేది లేదని హెచ్చరించారు. అన్ని పార్టీలతో కలిసి దీనిపై పోరాడతామని చెప్పారు.
ఇండియాను ‘హిందీయా’గా మార్చాలనుకుంటున్నారు: కేంద్రంపై కమల్ హాసన్ విమర్శలు

- నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానంపై కేంద్రం, డీఎంకే మధ్య వాగ్యుద్ధం
- అన్ని రాష్ట్రాలు హిందీలో మాట్లాడేలా చేసి ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని చూస్తోందన్న కమల్ హాసన్
- మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే వారు ‘హిందీయా’ గురించి కలలు కంటున్నారని విమర్శ
ఇండియాను ‘హిందీయా’గా మార్చాలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చూస్తోందని ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే మధ్య వాగ్యుద్ధం నడుస్తోంది. ఈ అంశంపై కమల్ హాసన్ కూడా స్పందించారు.
అన్ని రాష్ట్రాలు హిందీలో మాట్లాడేలా చేసి, ఎన్నికల్లో మెజార్టీ సాధించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మనం ఇండియా గురించి ఆలోచిస్తుంటే వారు (బీజేపీ) మాత్రం హిందీయా గురించి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన, త్రిభాషా అంశాలపై ఈరోజు తమిళపార్టీలు సమావేశమయ్యాయి. పార్టీలు ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించాయి. 1971 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు. ఈ సమావేశంలోనే కమల్ హాసన్ మాట్లాడారు.
ఈ సందర్భంగా కమల్ హాసన్ 2019లో స్టాలిన్ వాడిన ‘హిందీయా’ పదాన్ని ప్రస్తావించారు.
అప్పట్లో, అంతర్జాతీయంగా భారత్ అంటే హిందీ భాష గుర్తుకు వస్తుందని కేంద్రమంత్రి అమిత్ షా ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ఆ పోస్టుపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. ‘ఇది ఇండియా… హిందీయా కాదు’ అని కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలను కమల్ హాసన్ తాజాగా ప్రస్తావించారు.