
- ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- పర్యటనకు ఒక రోజు ముందు జిల్లా ప్రజలకు వరం
- ఫలించిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కృషి
- మైనింగ్ కళాశాలనే ఎర్త్ సైన్సెస్ విశ్వ విద్యాలయంగా అప్ గ్రేడ్
- దేశంలోనే ఇది మొట్ట మొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. ప్రస్తుతం కొత్తగూడెంలో వున్న మైనింగ్ కళాశాలను అప్ గ్రేడ్ చేస్తూ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం భద్రాచలంలో జరగనున్న శ్రీరామ నవమి వేడుకలకు రేవంత్ రెడ్డి వస్తున్న నేపధ్యంలో, ఒక రోజు ముందు ఈ యూనివర్శిటీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంతో కాలంగా ఇక్కడ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రాలు అందజేస్తూ వస్తున్నారు. చివరకు తుమ్మల కృషి ఫలించి, సీఎం రేవంత్రెడ్డి యూనివర్సిటీని మంజూరు చేస్తూ ప్రకటన జారీ చేశారు.
300 ఎకరాల్లో యూనివర్శిటీ ఏర్పాటు
దక్షిణ భారతదేశంలో ఖనిజ నిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూల పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. నేషనల్ హైవేకి సమీపంలో 300 ఎకరాల్లో ఈ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేర పాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. విశ్వవిద్యాలయానికి సమీపంలో మినీ స్టిల్ ప్లాంట్, నావా లిమిటెడ్ , ఫెరో ఎల్లాయి,ఫెర్రో మెగ్నీషియం, విద్యుత్ ప్లాంట్ ఉన్నాయి. విద్యుత్ ప్లాంట్లో కూడా మరో 300 మెగావాట్ల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాంతానికి సమీపంలో ఐటీసీ పేపర్ బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్ ఉన్నాయి. ఈ ప్రాంతానికి 20 కిలో మీటర్ల దూరంలో విమానాశ్రయాన్ని ఏర్పాటుకు కూడా ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ కలా నెరవేరబోతోంది. రోడ్డు మరియు రైలు రవాణా మార్గాలు ఈ ప్రాంతానికి అతి సమీపంలో ఉన్నాయి. 35 కిలో మీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తుంది. దీని వల్ల భవిష్యత్తులో నీటి ఇబ్బందులు ఉండవు. అన్ని అవకాశాలు ఉన్న దృష్ట్యా, ఇక్కడ ఎర్త్ సైన్సెస్ విద్యాలయం ఏర్పాటు పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇక్కడ ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.