- బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ అభివృద్ధి చేయాలి
- ఫుడ్ ప్రాసెసింగ్ తో పంట విలువ పెరుగుతుంది
- సమీక్షలో మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించాలని, భవిష్యత్తు అంతా ఫుడ్ ప్రాసెసింగ్ రంగాని దేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గురువారం హైదారాబాద్ లో ఆహార ప్రాసెసింగ్ రంగంపై టి.ఎస్.ఐ. సి సీఈవో టి. మధు సూధన్, ఫుడ్ ప్రాసెసింగ్ డైరెక్టర్ అఖిల్ తో వారు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. ఫుడ్ పార్క్ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సకల సౌకర్యాలకు బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ అనుకూలంగా వుంటుందన్నారు. అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి కంపెనీలు వచ్చేలా చూడాలని చెప్పారు. పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి, అన్ని అవకాశాలు కల్పించాలన్నారు. రవాణా పరంగా బుగ్గపాడుకు ఉన్న వసతులు ఎక్కడా లేవన్నారు. ఖమ్మం నుంచి రాజమండ్రి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఉందన్నారు. అత్యధిక దిగుబడులు సాధించే రైతాంగం తెలంగాణకు ఉందని తెలిపారు. కాకినాడ, మచిలీపట్నం పోర్ట్ కుల కొద్ది సమీపంలో ఉందని వివరించారు. ఖమ్మం జిల్లాలో విరివిగా లభించే మామిడి, కొకో, ఆయిల్ పామ్, కొబ్బరి వంటి తోటల పంటల ప్రాసెసింగ్‌కు పార్క్ ఉపయోగకరంగా వుంటుందన్నారు. అత్యధిక స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి ఆయా పంటలను ఫుడ్ ప్రెస్సింగ్ చేసే అవకాశం కల్పిస్తే ఆయా పంటలకు విలువ పెరిగి రైతులకు సిరుల పంట కురుస్తుందన్నారు.