- కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించిన మంత్రి పొన్నం
- సీఎం మార్పుపై బీజేపీ నేతలు అవివేకంతో మాట్లాడుతున్నారని వ్యాఖ్య
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి బీజేపీ ఎంపీ వెనకుండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడన్న కేటీఆర్ ఆరోపణలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆ ఎంపీ పేరు చెప్పే దమ్ము, ధైర్యం లేదా? అంటూ కేటీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఏ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణలు అర్థ రహితమని కొట్టి పారేశారు. కేటీఆర్ మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదన్నారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు అవివేకంతో మాట్లాడుతున్నారని మంత్రి పొన్నం విమర్శించారు. సీఎం మార్పుపై ప్రకటనలు చేస్తూ వారి అవివేకాన్ని బయటపెట్టుకుంటున్నారని అన్నారు. ఒకవేళ సీఎంను మార్చాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎప్పుడో ప్రకటన చేసే వారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.