- యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలి
- ప్రతి ఎకరాకు సాగు నీరందించడమే సీఎం రేవంత్ లక్ష్యం
- సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు
- సీఈ రమేష్ బాబుకు మంత్రి తుమ్మల ఆదేశం
గత ఆగస్టు నెలలో వచ్చిన అకాల వర్షాలు వరదలకు కాలవలు పూర్తిగా దెబ్బతిన్నాయని, మే నెలాఖరు నాటికి కాలువల ఆధునికరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్ కెనాల్ ఆధునికరణ, మరమ్మత్తులు, తదితర అంశాలపై సూర్యాపేట, ఖమ్మం జిల్లాల సీఈ రమేష్ బాబుతో మంత్రి తుమ్మల మాట్లాడారు. చివరి ఆయకట్టు భూములకు సైతం నీరందించేలా పటిష్ట ప్రణాళికలతో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మరమ్మత్తులు ఆధునికరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అకాల వర్షాలు వరదల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని, క్షేత్ర స్థాయిలో కాలువలను పరిశీలించాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల మరమ్మత్తులు, ఆధునికరణ, కాలువ కట్టల బలోపేతం, బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆయా కాలువల మరమ్మత్తులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నాణ్యత పనుల్లో ఎక్కడ రాజీ పడ కుండా పని చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ఇది నిర్వహణలో అలసత్వం లేకుండా సమన్వయంతో పని చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఖమ్మం జిల్లాలో ప్రధాన వనరుగా ఉన్న ఎన్ఎస్పి కాలువల ద్వారా చివరి భూములకు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యంమని చెప్పారు. ప్రణాళిక బద్ధంగా ప్రభుత్వం సాగు నీటిని విడుదల చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా నీటిని విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన అలుగులకు మరమ్మత్తులు చేయాలన్నారు. రైతు ప్రయోజనమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. తెలంగాణను పచ్చని పంట పొలాలతో సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. బీడు భూముల లేని తెలంగాణగా మార్చేందుకు అను నిత్యం శ్రమిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. చివరి ఆయకట్టు భూములకు సైతం సకాలంలో నీరు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చివరి ఎకరాకు నీరు అందించేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. రైతులకు అవసరమైన సాగు నీరు విత్తనాలు ఎరువులు సకాలంలో అందించేందుకు ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి అధికారి బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు.