K2-18b
సైన్సు అండ్ టెక్నాలజీ

భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో జీవం

  • డీఎంఎస్ ఉనికిని గుర్తించిన కేంబ్రిడ్జ్ శాస్త్ర వేత్తలు
  • నాయకత్వం వహించిన భారత సంతతి శాస్త్ర వేత్త నిక్కు మధు సూదన్

భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న K2-18b అనే గ్రహంపై జీవం ఉనికికి బలమైన సంకేతమైన డైమిథైల్ సల్ఫైడ్ (DMS) అనే అణువును శాస్త్రవేత్తలు గుర్తించారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ నిక్కు మధు సూదన్ నేతృత్వంలోని బృందం ప్రతిష్టాత్మక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) సాయంతో ఈ అసాధారణ ఆవిష్కరణ చేసింది. భూమిపై, డైమిథైల్ సల్ఫైడ్ (DMS) ప్రధానంగా సముద్రపు పాచి వంటి సూక్ష్మజీవుల జీవ క్రియల ఫలితంగా మాత్రమే ఉత్పత్తి అవుతుంది. గంధకం, కార్బన్, హైడ్రోజన్‌లతో కూడిన ఈ అణువు K2-18b వాతావరణంలో కనుగొనడం, ఆ గ్రహంపై జీవం ఉండే అవకాశాలకు బలమైన సూచికగా పరిగణిస్తున్నారు. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ ‘ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్’ లో ప్రచురితమయ్యాయి. అయితే, ఇప్పుడే జీవాన్ని కనుగొన్నామని చెప్పడం తొందరపాటే అవుతుందని డాక్టర్ మధుసూదన్ ఒక సమావేశంలో స్పష్టం చేశారు. “అయితే, మా పరిశీలనలకు అత్యుత్తమ వివరణ ఏమిటంటే, K2-18b వెచ్చని సముద్రంతో నిండి, జీవంతో కళకళలాడుతూ ఉండవచ్చని ఆయన అన్నారు. ఇది ఒక విప్లవాత్మక క్షణం, మానవాళి నివాసయోగ్యమైన మరో గ్రహంపై జీవ సంకేతాలను చూడటం ఇదే తొలిసారని అభిప్రాయపడ్డారు. 1980లో భారతదేశంలో జన్మించిన డాక్టర్ నిక్కు మధుసూదన్, వారణాసిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి మాస్టర్స్, పీహెచ్‌డీ పట్టాలు పొందారు. ప్రస్తుతం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇతర గ్రహాల వాతావరణం, వాటి నిర్మాణం, జీవానికి అనుకూలతపై ఆయన పరిశోధనలు కేంద్రీకృతమై ఉన్నాయి. ‘హైసియన్’ గ్రహాల భావనను పరిచయం చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి చెందారు.

Related posts

చందమామపై బయటపడ్డ భారీ బిలం.. ప్రగ్యాన్ రోవర్ పరిశోధనలో గుర్తింపు!

Ram Narayana

భూమి వైపు జారుతున్న నాసా టెలిస్కోప్.. కాపాడేందుకు భారీ ఆపరేషన్!

Ram Narayana

ఇస్రో మరో ఘనత.. స్పేస్ డాకింగ్ సక్సెస్!

Ram Narayana