Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సైన్సు అండ్ టెక్నాలజీ

భూమికి కొత్త తోడు దొరికింది.. మన వెంటే తిరుగుతున్న ‘తాత్కాలిక చందమామ’!

  • ‘క్వాజీ-మూన్’ను గుర్తించిన పరిశోధకులు
  • ‘2025 పీఎన్7’గా పేరు పెట్టిన శాస్త్రవేత్తలు
  • ఇది నిజమైన చంద్రుడు కాదని, గ్రహశకలమని తెలిపిన నాసా
  • గత 60 ఏళ్లుగా భూమి కక్ష్యకు సమీపంలోనే సంచారం
  • 2083 వరకు మన గ్రహానికి తోడుగా ఉండే అవకాశం

మన భూమికి ఆకాశంలో ఓ కొత్త స్నేహితుడు దొరికాడు. ‘2025 పీఎన్7’ అనే పేరుగల ఈ చిన్న గ్రహశకలం, భూమికి ఒక ‘క్వాజీ-మూన్’ (తాత్కాలిక చంద్రుడు)గా వ్యవహరిస్తోందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తాజాగా ధ్రువీకరించింది. ఇది నిజమైన చంద్రుడిలా భూమి చుట్టూ తిరగకపోయినా, సూర్యుడి చుట్టూ భూమితో పాటే దాదాపు ఒకే వేగంతో ప్రయాణిస్తూ మన గ్రహాన్ని నీడలా అనుసరిస్తోంది.

హవాయి విశ్వవిద్యాలయం పరిశోధకులు ఈ గ్రహశకలాన్ని తొలిసారిగా గుర్తించారు. కొన్ని వారాల పాటు దాని గమనాన్ని విశ్లేషించిన అనంతరం, ఇది భూమికి తాత్కాలిక సహచరుడిగా ఉందని నాసా నిర్ధారించింది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం, ఇది 18 నుంచి 36 మీటర్ల వెడల్పుతో, దాదాపు ఓ చిన్న భవనమంత పరిమాణంలో ఉంది.

చంద్రుడు కాదు.. కేవలం సహచరుడు మాత్రమే
నిజమైన చంద్రుడు భూమి గురుత్వాకర్షణ శక్తికి కట్టుబడి మన చుట్టూ తిరుగుతాడు. కానీ, ‘2025 పీఎన్7’ అలా కాదు. ఇది సూర్యుడి గురుత్వాకర్షణ ప్రభావంలో ఉంటూ, భూమి కక్ష్యకు దగ్గరగా ప్రయాణిస్తుంది. శాస్త్రవేత్తలు దీనిని “ట్రాక్‌పై మన పక్కనే సమాన వేగంతో పరుగెత్తే స్నేహితుడి”తో పోలుస్తున్నారు. ఈ గ్రహశకలం గత 60 సంవత్సరాలుగా భూమికి సమీపంలోనే ఉందని, ఇదే కక్ష్యలో కొనసాగితే 2083 వరకు మనకు తోడుగా ఉండి, ఆ తర్వాత అంతరిక్షంలోకి దూరంగా వెళ్లిపోవచ్చని అంచనా వేస్తున్నారు.

భూమికి అత్యంత సమీపంగా వచ్చినప్పుడు దీని దూరం 40 లక్షల కిలోమీటర్లు ఉంటుంది. ఇది మన చంద్రుడితో పోలిస్తే దాదాపు పది రెట్లు ఎక్కువ దూరం. ఇక అత్యంత దూరంగా వెళ్లినప్పుడు 1.7 కోట్ల కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.

ఈ ఆవిష్కరణ ఎందుకంత ముఖ్యం?
ఇప్పటివరకు శాస్త్రవేత్తలు కేవలం ఎనిమిది ‘క్వాజీ-మూన్‌’లను మాత్రమే గుర్తించారు. ఈ అరుదైన ఖగోళ వస్తువులను అధ్యయనం చేయడం ద్వారా గ్రహశకలాల కదలికలు, భూమి గురుత్వాకర్షణ ప్రభావం వంటి విషయాలపై మరింత లోతైన అవగాహన వస్తుంది. అంతేకాకుండా, భవిష్యత్తులో చేపట్టే అంతరిక్ష ప్రయోగాలకు, పరిశోధనలకు ఇవి అనువైన లక్ష్యాలుగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Related posts

అంతరిక్ష అద్భుతం.. ఒకే ఫొటోలో భూమి సహా ఎనిమిది గ్రహాలు!

Ram Narayana

సూర్యరశ్మితో ఇంధనం.. శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ!

Ram Narayana

ఏఐతో నిండు 150 ఏళ్లు అంటున్న శాస్త్రవేత్తలు..

Ram Narayana

Leave a Comment