అంతర్జాతీయం

మూడు యుద్ధాలు చేసినా సాధించిందేం లేదు: పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్!

 పాకిస్థాన్ ఒక శాంతికాముక దేశం అట… ప్రధాని షెహబాజ్ ప్రవచనాలు

  • సైన్యానికి కృతజ్ఞతగా పాక్‌లో ‘యౌమ్-ఎ-తషక్కర్’ దినోత్సవం
  • శాంతి కాముకులమే అయినా, రక్షణకు తగ్గట్టు స్పందిస్తామన్న షెహబాజ్ షరీఫ్
  • ఇటీవలి ఘర్షణలో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ కుటుంబాన్ని ప్రధాని పరామర్శ
  • సార్వభౌమాధికారంపై రాజీపడే ప్రసక్తే లేదన్న పాక్ అధ్యక్షుడు జర్దారీ
  • భారత్ దుందుడుకు చర్యల వల్లే ఆత్మరక్షణ చేసుకున్నామన్న విదేశాంగ మంత్రి

పాకిస్థాన్ శాంతిని కోరుకునే దేశమే అయినప్పటికీ, ఆత్మరక్షణ కోసం తగిన రీతిలో బదులిచ్చే హక్కు తమకుందని ఆ దేశ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ శుక్రవారం స్పష్టం చేశారు. దేశ సైనిక దళాలకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన ‘యౌమ్-ఎ-తషక్కర్’ (కృతజ్ఞతా దినోత్సవం) సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి కాలంలో భారత్, పాకిస్థాన్ మధ్య నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో డ్రోన్లు, క్షిపణులతో దాడులు ప్రతిదాడులు జరిగిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మే 10న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.

‘యౌమ్-ఎ-తషక్కర్’ దినోత్సవం ఇస్లామాబాద్‌లో 31 తుపాకుల వందనంతో, ఇతర ప్రావిన్షియల్ రాజధానుల్లో 21 తుపాకుల వందనంతో ప్రారంభమైందని ప్రభుత్వ ఆధ్వర్యంలోని రేడియో పాకిస్థాన్ తెలిపింది. సాయుధ దళాలకు సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు, ర్యాలీలు నిర్వహించారు. ఇస్లామాబాద్‌లోని ప్రధానమంత్రి నివాసంలో షెహబాజ్ షరీఫ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సాయుధ దళాలు ఇటీవలి ఘర్షణల్లో సమర్థవంతంగా, దీటుగా స్పందించాయని, దేశ సైనిక చరిత్రలో అదొక సువర్ణాధ్యాయం అని ప్రశంసించారు.

అనంతరం, ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇటీవల భారత దాడుల్లో మరణించిన స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ ఇంటికి వెళ్లారు. ఆయన వెంట రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ కూడా ఉన్నారు. ఉస్మాన్ యూసఫ్ కుటుంబ సభ్యులకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, మృతిచెందిన అధికారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ తర్వాత రావల్పిండిలోని కంబైన్డ్ మిలిటరీ ఆసుపత్రిని సందర్శించి, దాడుల్లో గాయపడిన సైనికులు, పౌరుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమాల్లో పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాట్లాడుతూ, “పాకిస్థాన్ తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, కీలక జాతీయ ప్రయోజనాల విషయంలో ఎన్నటికీ రాజీపడదు” అని స్పష్టం చేశారు. మరోవైపు, ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా పాకిస్థాన్ చర్యలను సమర్థించుకున్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో యూకే విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీతో జరిగిన సమావేశంలో దార్ మాట్లాడుతూ, భారత్ అకారణంగా రెచ్చగొట్టడం వల్లే పాకిస్థాన్ ఆత్మరక్షణ హక్కును వినియోగించుకుని ప్రతిస్పందించిందని తెలిపారు. ఇరు దేశాల నేతలు దక్షిణాసియాలో ఇటీవలి ఉద్రిక్తతలు, భారత్-పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై విస్తృతంగా చర్చించినట్లు విదేశాంగ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. 

కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత పాకిస్థాన్ ‘యౌమ్-ఎ-తషక్కర్’ను పాటించడం ఇది రెండోసారి. గత ఆదివారం కూడా సాయుధ దళాలకు మద్దతుగా దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు.

ఇస్లామాబాద్‌లో ‘యూమ్-ఎ-తషాకుర్’ ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించిన పాకిస్థాన్ ప్రధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ భారత్, పాకిస్థాన్ మూడు యుద్ధాలు చేశాయని, సాధించిందేం లేదని అన్నారు. ఇస్లామాబాద్, న్యూఢిల్లీ శాంతియుత చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని కోరారు. త‌ద్వారా క‌శ్మీర్ అంశంతో స‌హా అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. అప్పుడే ఇరు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొటుంద‌ని తెలిపారు. శాంతి నెల‌కొంటే రెండు దేశాలు ఉగ్ర‌వాద వ్య‌తిరేక చ‌ర్య‌ల్లో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకోవ‌చ్చ‌ని పేర్కొన్నారు. మన సమస్యలు పరిష్కారం కాకుంటే, ప్రపంచంలోని ఏ భాగంలోనూ మనకు శాంతి ఉండద‌ని షెహ‌బాజ్ అన్నారు.

షెహ‌బాజ్ ఇంకా మాట్లాడుతూ… పాకిస్థాన్ శాంతియుత దేశం అయినప్పటికీ, త‌మ‌ రక్షణ కోసం తగిన సమాధానం ఇచ్చే హక్కు తమ‌కు ఉందని పాక్ ప్ర‌ధాని అన్నారు. “పాకిస్థాన్ ఒక శాంతియుత దేశం. కానీ దాని రక్షణలో తగిన విధంగా ప్రతిస్పందించే హక్కు దానికి ఉంది” అని భారత్‌ తో ఇటీవల జరిగిన సైనిక ఘర్షణను ప్రస్తావిస్తూ ఆయన అన్నారు.

కాగా, సరిహద్దు వెంబడి డ్రోన్లు, క్షిపణులతో తీవ్రమైన దాడుల‌తో నాలుగు రోజుల పాటు పాక్‌, భార‌త్ మ‌ధ్య కొన‌సాగిన‌ సైనిక ఘర్షణను ఆప‌డానికి ఇరు దేశాలు మే 10న సీజ్‌ఫైర్‌ ఒప్పందానికి వచ్చిన విష‌యం తెలిసిందే.

అయితే, శుక్ర‌వారం భార‌త ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ… ‘ఆపరేషన్ సిందూర్’ ఇంకా ముగియలేదని ధ్రువీకరించి, పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరిక చేసిన కొన్ని గంటల తర్వాత పాక్ ప్ర‌ధాని షెహ‌బాజ్ షరీఫ్ పైవిధంగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. “సరైన సమయం వచ్చినప్పుడు, మేము ఏంటో ప్రపంచానికి చూపిస్తాం. మేము పాకిస్థాన్‌ను పరిశీలనలోనే ఉంచాం. మీ ప్రవర్తన మెరుగుపడినట్లయితే, అది మీకు మంచిది. కాదు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తే మీకు అత్యంత కఠినమైన శిక్ష ఖాయం” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

ఏప్రిల్ 22న 26 మంది ప‌ర్యాట‌కుల‌ను పొట్ట‌న‌పెట్టుకున్న‌ పహల్గామ్ ఉగ్ర‌దాడికి ప్రతిస్పందనగా మే 7వ తేదీ తెల్లవారుజామున ఉగ్రస్థావ‌రాలపై ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట‌ భారత్ ల‌క్షిత‌ దాడులను నిర్వహించిందని మ‌రోసారి ఆయ‌న గుర్తు చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), ఉగ్రవాదం అనే అంశంపై మాత్రమే పాక్‌తో చర్చలు జరుపుతామని ఈ సంద‌ర్భంగా ర‌క్ష‌ణ మంత్రి స్పష్టం చేశారు.

Related posts

కెనడాలో ఓ పంజాబీ ఘాతుకం…భార్యను కత్తితో పొడిచి, తల్లికి వీడియో కాల్..

Ram Narayana

కెనడాలో మన విద్యార్థుల దీనావస్థ.. వెయిటర్ జాబ్ కోసం హోటల్ ముందు భారీ క్యూ..

Ram Narayana

యూఎస్‌లో గ్రీన్‌కార్డ్ దరఖాస్తుదారులకు షాక్.. ఇంటర్వ్యూలకు వెళితే అరెస్టులు…

Ram Narayana