Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

డొనాల్డ్ ట్రంప్ అణు పరీక్షల వ్యాఖ్యలు.. తీవ్రంగా స్పందించిన చైనా

  • బీజింగ్ ఎప్పుడూ శాంతియుత అభివృద్ధి మార్గానికి కట్టుబడి ఉందన్న చైనా
  • అణ్వాయుధాలను మొదట ఉపయోగించవద్దనే విధానానికి కట్టుబడి ఉందన్న మావో నింగ్
  • అణు సమస్యలపై చైనా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్న మావో నింగ్

చైనా రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తోందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను చైనా ఖండించింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ, బీజింగ్ ఎల్లప్పుడూ శాంతియుత అభివృద్ధి మార్గానికి కట్టుబడి ఉందని అన్నారు. అణ్వాయుధాల విషయంలో “మొదట ఉపయోగించవద్దు” అనే విధానానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

చైనా వ్యూహం పూర్తిగా రక్షణాత్మకమైనదని, అన్ని అణు పరీక్షలపై తాత్కాలిక నిషేధాన్ని కొనసాగించేందుకు కట్టుబడి ఉందని ఆమె తేల్చి చెప్పారు. చైనా అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తుందని, ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని నిలబెట్టడంలో చురుకైన పాత్ర పోషిస్తూనే ఉంటుందని వెల్లడించారు. అణు సమస్యలపై చైనా బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తుందని, బీజింగ్ అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఖండిస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

రష్యా, చైనా, పాకిస్థాన్, ఉత్తర కొరియా వంటి దేశాలు రహస్య అణు పరీక్షలు నిర్వహించాయని ట్రంప్ ఇటీవల ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ అణు పరీక్షలకు సన్నాహాలు ప్రారంభించాలని పెంటగాన్‌ను ఆయన ఆదేశించారు. అణ్వాయుధాలకు ఉన్న విధ్వంసకర శక్తి కారణంగా ఆ పరీక్షలు చేయకూడదని గతంలో నిర్ణయించామని, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయని ట్రంప్ వ్యాఖ్యానించారు.

Related posts

ఇజ్రాయెల్‌తో యుద్ధం తర్వాత తొలిసారి బహిరంగంగా కనిపించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ

Ram Narayana

రష్యా ఆక్రమిత క్రిమియా ప్రాంతంపై తుపాను పంజా… ఉక్రెయిన్ లోనూ అంధకారం…

Ram Narayana

అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. టేకాఫ్‌లోనే కుప్పకూలిన ఫ్లైట్, ముగ్గురి మృతి!

Ram Narayana

Leave a Comment