- తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఏపీలోనూ కలకలం
- తన ఫోన్, భర్త ఫోన్ ట్యాప్ చేశారని షర్మిల ఆరోపణ
- తనకు సంబంధం లేదన్న జగన్
తెలంగాణలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ రాజకీయ వేడిని రాజేస్తోంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేసిన ఆరోపణలు ఈ వివాదాన్ని మరింత తీవ్రతరం చేశాయి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నది వాస్తవమేనని, ఆ సమాచారాన్ని కేసీఆర్, జగన్ పంచుకున్నారని షర్మిల ఆరోపించారు. తన ఫోన్‌తో పాటు, తన భర్త ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ ఆరోపణలపై జగన్ తాడేపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో తొలిసారిగా స్పందించారు. షర్మిల ఫోన్ ను ట్యాపింగ్ చేశారో లేదో తనకు తెలియదని ఆయన అన్నారు. గతంలో షర్మిల తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారని చెప్పారు. తనకు తెలంగాణ వ్యవహారాలతో సంబంధం లేదని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదని చెప్పారు.
అణచివేత అనే పదానికి నిర్వచనంగా చంద్రబాబు: జగన్

- ప్రతిపక్ష నాయకుడు ప్రజలను కలవకుండా ఆంక్షలు పెట్టడమా?
- ఏడాది పాలనలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
- దేశ చరిత్రలోనే బహుశా ఇదే ప్రప్రథమం అంటూ చంద్రబాబుపై మండిపడ్డ జగన్
ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలను, మా పార్టీ నాయకులను కలవాలనుకుంటే ప్రభుత్వం ఎందుకు ఇన్ని ఆంక్షలు పెడుతోందని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అణచివేతపై ప్రజలకు నిజం తెలియాల్సి ఉందనే ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో తాను పర్యటిస్తే పోలీసు బలగాలను మోహరించి ఎక్కడికక్కడ ప్రజలను అడ్డుకున్నారని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ ఏడాది కాలంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. బహుశా దేశ చరిత్రలో ఇంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోనే ఉందని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అణచివేత అనే పదానికి చంద్రబాబు నిర్వచనంగా మారారని ఆరోపించారు.
సత్తెనపల్లిలో బుధవారం నిర్వహించిన తన పర్యటన మొత్తం కర్ఫ్యూ పరిస్థితుల మధ్య జరిగిందని జగన్ ఆరోపించారు. తాను ప్రజలను కలవడానికి ఆంక్షలు విధించాల్సిన అవసరం ఏమొచ్చిందని, చంద్రబాబు ఎందుకు ఇంతలా భయపడుతున్నారని జగన్ ప్రశ్నించారు. తన పర్యటన సందర్భంగా ప్రజలు, పార్టీ నేతలు ఎవరూ రాకుండా అధికారుల ద్వారా బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్యలు బయటకు రాకుండా ఉండేందుకే ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతోందని, రైతుల సమస్యలు వెలుగులోకి రాకుండా టాపిక్ డైవర్షన్ చేస్తోందని జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు.
వైసీపీ నాయకులపై తప్పుడు కేసులు
ప్రజల సమస్యలపై ఎవరూ గొంతెత్తకుండా వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతోందని జగన్ ఆరోపించారు. సత్తెనపల్లిలో తన పర్యటన ఎంతగా సక్సెస్ అయిందో తనకంటే మీడియాకే ఎక్కువ తెలుసని చెప్పారు. నాయకుల గొంతు నొక్కేందుకే తప్పుడు కేసులు పెడుతోందని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు ఇదే కోవలోకి చెందిందని ఆరోపించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించేందుకు ఆయన గన్ మెన్ తోనే స్టేట్ మెంట్ ఇప్పించుకునే ప్రయత్నం చేశారని తెలిపారు. తప్పుడు స్టేట్ మెంట్ ఇవ్వనని చెప్పినందుకు గన్ మెన్ పై దాడి చేయించారని చెప్పారు. తనపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీతో పాటు ఆ గన్ మెన్ డీజీపీకి, గవర్నర్ కు, రాష్ట్రపతికి లేఖలు పంపాడని గుర్తుచేశారు. దీనిపై న్యాయపోరాటం కూడా చేస్తున్నాడని జగన్ చెప్పారు.
ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారట..
ఎల్లో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తానని వ్యాఖ్యానించాడు. దీనిపై స్పందిస్తూ ‘ఎప్పుడు భూస్థాపితం చేస్తారు’ అని సదరు యాంకర్, ఆ టీవీ యజమాని అడుగుతున్నాడని విమర్శించారు. ఇదిగో మొదలు పెట్టేశాం, ఇక భూస్థాపితం చేసేస్తామని చంద్రబాబు బదులిచ్చాడని చెప్పారు. ‘76 ఏళ్ల వయసులో ఈ మాటలేంటి, రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏంటి, ఈ బెదిరింపులు ఏంటి.. వాడిని తొక్కుతా, వీడిని తొక్కుతా అనే మాటలేంటి?’ అని జగన్ నిలదీశారు. ప్రజలు ఏదో దయతలచి అధికారం కట్టబెడితే వారికి మంచి చేయాల్సింది పోయి ఈ బెదిరింపులు ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, చేయాల్సిన, చేస్తానని చెప్పిన పనులను పక్కన పెట్టి అబద్ధాలు, మోసాలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నాడని మండిపడ్డారు. ఈ మోసాలపై నిలదీసే వారిని భూస్థాపితం చేస్తానని బెదిరించడమేంటని జగన్ ప్రశ్నించారు.
మహిళలంటే ఎవరికి గౌరవం ఉన్నట్లు.. మాకా లేక చంద్రబాబుకా?: జగన్
ఆంధ్రప్రదేశ్ లో అక్కాచెల్లెమ్మలకు అండగా ఉన్నది, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలని తపన పడ్డది తమ ప్రభుత్వమేనని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. మహిళలకు సమాన ప్రాధాన్యం దక్కాలని చిత్తశుద్ధితో కృషి చేశామని వివరించారు. నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించామని, ఇందుకోసం ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చి అమలు చేశామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 32 లక్షల నిరుపేద మహిళలకు వారిపేరుతోనే ఇళ్ల పట్టాలను జారీ చేశామని గుర్తుచేశారు. అందులో 22 లక్షల ఇళ్లను సాంక్షన్ చేసి, పది లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చామని వెల్లడించారు. మహిళలంటే గౌరవం ఎవరికి ఉందనేది ఈ చర్యలతో తెలిసిపోతుందని చెప్పారు.
మహిళలకు చంద్రబాబు చేసిందేంటి?
మహిళల పట్ల చంద్రబాబుకు నిజంగా గౌరవం ఉందా అని జగన్ ప్రశ్నించారు. నిజంగా మహిళలపై గౌరవం ఉంటే రాష్ట్రంలో అక్కాచెల్లెమ్మలపై దారుణాలు జరుగుతుంటే చర్యలు ఎక్కడ తీసుకున్నారని నిలదీశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి ప్రాంతంలో, మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలో ఉన్న ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై దౌర్జన్యం జరిగిన సంగతి జగన్ గుర్తుచేశారు. గ్రామానికి చెందిన దళిత బాలికపై టీడీపీ నేతలు కొందరు సామూహిక అత్యాచారం చేసి బెదిరించారని చెప్పారు. వారి బెదిరింపులకు భయపడి బాధిత కుటుంబం మౌనాన్ని ఆశ్రయించగా.. బాలిక గర్భందాల్చడంతో విషయం బయటపడిందని గుర్తుచేశారు.
అయితే, కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనీయకుండా బాధిత కుటుంబాన్ని నిందితులు బెదిరించారని ఆయన ఆరోపించారు. బాధిత బాలికకు న్యాయం చేయాలనే తపన, నిందితులపై చర్యలు తీసుకోవాలనే ఆలోచన చంద్రబాబుకు లేదని జగన్ దుయ్యబట్టారు. మరో గిరిజన బాలిక కనిపించకుండా పోతే ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ఆ తర్వాత ఆ బాలిక శవమై కనిపించిందని గుర్తు చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదనే కారణంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారని జగన్ వివరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాక అప్పుడు చంద్రబాబు స్పందించారని విమర్శించారు. ఈ సంఘటనలను బట్టి మహిళలంటే ఎవరికి గౌరవం ఉందో ప్రజలే నిర్ణయించాలని జగన్ అన్నారు.
సాక్ష్యాలు క్రియేట్ చేసి మరీ తప్పుడు కేసులు: జగన్
తన చుట్టూ ఉన్న నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, ప్రస్తుత ఎమ్మెల్యేలను జైలుకు పంపడమే విధిగా పెట్టుకుందని మండిపడ్డారు. ఈ తప్పుడు కేసులకు సంబంధించి చంద్రబాబు అనుసరిస్తున్న మోడస్ అపరెండి ఒక్కటే.. చిన్నస్థాయి వ్యక్తులను పట్టుకుని కొట్టి బెదిరించి, ప్రలోభ పెట్టి వాంగ్మూలం తీసుకోవడం, దాని ఆధారంగా నేతలను అరెస్టు చేస్తున్నారని జగన్ ఆరోపించారు.
ప్రభుత్వం తమ పార్టీ నాయకులను అరెస్టు చేయడానికి, వారిపై పెట్టిన కేసులకు బలం చేకూర్చడానికి సాక్ష్యాలను సృష్టిస్తోందని ఆయన ఆరోపించారు. ఇలా సాక్ష్యాలు క్రియేట్ చేసి, తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే ఎవరిపైనైనా కేసులు పెట్టవచ్చని జగన్ చెప్పారు. అయితే, ఇది దుర్మార్గమని, వ్యవస్థను భ్రష్టు పట్టించడమేనని అన్నారు. ఇలాంటి పనుల వల్లే నక్సలిజం పుట్టుకొస్తుందని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ నాయకులు, దళిత నేతలు, లాయర్లను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని జగన్ మండిపడ్డారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్, వల్లభనేని వంశీ తదితరులపై ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారని ఆరోపించారు. మచ్చలేని ఆఫీసర్లు ఓఎస్డీ కృష్ణమోహన్, ధనుంజయ్ రెడ్డిలనూ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ చెప్పారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని, రామచంద్రారెడ్డిని ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని చూస్తున్నారని తెలిపారు. ఎప్పుడో కాలేజీ రోజుల్లో రామచంద్రారెడ్డి కొట్టాడనే కోపం చంద్రబాబులో ఇంకా ఉందని, ఆ కోపంతోనే రామచంద్రారెడ్డిని వేధించేందుకు కుట్రలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. పేర్ని నాని, కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డిలతో పాటు వారి కుటుంబాలను కూడా కూటమి ప్రభుత్వం వేధిస్తోందని జగన్ ఆరోపించారు.