
- భారత్-పాకిస్థాన్ యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ మరోసారి వ్యాఖ్య
- ట్రేడ్ డీల్స్, టారిఫ్‌లతో ప్రధాని మోదీని బెదిరించినట్టు వెల్లడి
- నా ఫోన్ తర్వాత 5 గంటల్లోనే అంతా సద్దుమణిగిందన్న ట్రంప్
- ఇప్పటికే 40 సార్లకు పైగా ఇదే విషయం చెప్పిన అమెరికా అధ్యక్షుడు
- డీజీఎంఓల చర్చల ద్వారానే ఒప్పందం కుదిరిందని స్పష్టం చేసిన భారత్
భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని వాణిజ్యపరంగా బెదిరించడం వల్లే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ సాధ్యమైందని ఆయన పునరుద్ఘాటించారు. అయితే, ట్రంప్ వాదనలను భారత ప్రభుత్వం మొదటి నుంచి తీవ్రంగా ఖండిస్తోంది.
తాజాగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడిన ట్రంప్, తాను ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాలను ఆపానని, వాటిలో భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన అణుయుద్ధం కూడా ఒకటని అన్నారు. తాను ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడినట్టు తెలిపారు. “భారత ప్రధాని మోదీ చాలా గొప్ప వ్యక్తి. ఆయనతో నేను, ‘మీకు, పాకిస్థాన్‌కు మధ్య ఏం జరుగుతోంది? ఈ విద్వేషం చాలా తీవ్రంగా ఉంది’ అని అడిగాను. మీతో ఎలాంటి వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని, తలతిరిగిపోయేలా భారీ టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించాను” అని ట్రంప్ వివరించారు.
తాను మోదీకి ఫోన్ చేసిన ఐదు గంటల్లోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ పేర్కొన్నారు. “భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పరిస్థితి వస్తే నేనే అడ్డుకుంటాను. ఇలాంటివి జరగడానికి వీల్లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. మే నెల నుంచి ఇప్పటివరకు ట్రంప్ ఈ తరహా వ్యాఖ్యలు 40 సార్లకు పైగా చేయడం గమనార్హం.
భారత్ వాదన ఇది..
అయితే, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని భారత ప్రభుత్వం మొదటి నుంచి ఖండిస్తూనే ఉంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కేవలం డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) స్థాయి అధికారుల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ఫలితమేనని స్పష్టం చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఎలాంటి మూడో వ్యక్తి ప్రమేయం లేదని, ఏ దేశ నాయకుడూ తమను సైనిక చర్య ఆపమని కోరలేదని ప్రధాని మోదీ స్వయంగా పార్లమెంటులో వెల్లడించారు. అయినప్పటికీ, ట్రంప్ తన వాదనను పదేపదే వినిపిస్తూనే ఉన్నారు.
ట్రంప్ ఫోన్ కాల్స్ ను అవాయిడ్ చేసిన మోదీ!

- జర్మనీ న్యూస్ పేపర్ లో కథనం
- టారిఫ్ లపై భారత ప్రధాని తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని వ్యాఖ్య
- అమెరికా టారిఫ్ లకు తలొగ్గేదిలేదని స్పష్టమైన సంకేతాలు
అగ్రరాజ్యం అమెరికా టారిఫ్ లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని జర్మనీ న్యూస్ పేపర్ ఓ కథనం ప్రచురించింది. టారిఫ్ ల విషయంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు ఫోన్ చేసినా మోదీ అందుబాటులోకి రాలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించినట్లు పేర్కొంది. ఇటీవలి కాలంలో ట్రంప్ భారత ప్రధానికి నాలుగుసార్లు ఫోన్ చేశారని, ఒక్క ఫోన్ కాల్ కూడా మోదీ స్వీకరించలేదని తెలిపింది.
ఈ చర్యతో ట్రంప్ పై మోదీ తన ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు టారిఫ్ ల విషయంలో తలొగ్గేది లేదనే సందేశం పంపారని పేర్కొంది. ఈ మేరకు ఫ్రాంక్ ఫర్టర్ అల్జెమైన్ జీటంగ్ వార్తా పత్రిక తాజాగా ఓ కథనం ప్రచురించింది. జపాన్ న్యూస్ పేపర్ నికేయ్ ఆసియా కూడా దాదాపుగా ఇదే తరహా కథనం ప్రచురించింది.
భారత్ పై భారీగా టారిఫ్ లు విధించడం, పాకిస్థాన్ కి స్నేహ హస్తం చాచడం వంటి చర్యల కారణంగా భారతదేశంలో ట్రంప్ పై వ్యతిరేకత నెలకొందని జర్మనీ న్యూస్ పేపర్ తన కథనంలో పేర్కొంది. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ట్రంప్ పేర్కొనడం కూడా భారతీయుల ఆగ్రహానికి కారణమైందని వివరించింది.
పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం వెనుక విదేశాల పాత్ర లేదని భారత ప్రధాని మోదీ స్పష్టం చేసినా ట్రంప్ పదే పదే తానే యుద్ధం ఆపానని చెప్పడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని వివరించింది.
భారత్‌తో ఒప్పందం ఖాయం.. కానీ మమ్మల్ని ఆడిస్తున్నారు: యూఎస్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

- భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆశాభావం
- అయితే చర్చల్లో భారత్ నాన్చివేత ధోరణి అవలంబిస్తోందని విమర్శ
- ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య మంచి సంబంధాలున్నాయన్న స్కాట్ బెస్సెంట్
- రష్యా చమురు కొని భారత్ లాభపడుతోందని మరోసారి ఆరోపణ
- రూపాయి రిజర్వ్ కరెన్సీగా మారే అవకాశం లేదని వ్యాఖ్య
భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదరడంపై అమెరికా ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తూనే, మరోవైపు చర్చల విషయంలో భారత్ తీరుపై అసహనం ప్రదర్శించింది. ఇరు దేశాల మధ్య ఒప్పందం చివరికి ఖరారవుతుందని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ధీమా వ్యక్తం చేశారు. అయితే, చర్చల ప్రక్రియలో భారత్ తమను ఆడిస్తోందని ఆయన ఆరోపించారు.
బుధవారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో స్కాట్ బెస్సెంట్ మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య చాలా మంచి వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. “ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ అయితే, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా, చివరికి మేమిద్దరం ఏకతాటిపైకి వస్తామని నేను భావిస్తున్నా” అని ఆయన అన్నారు.
అయితే, చర్చల విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పుబట్టారు. “ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక చాలా ముందుగానే భారత్ చర్చలకు వచ్చింది. మే, జూన్ నెలల్లోనే ఒప్పందం కుదురుతుందని నేను ఆశించాను. కానీ ఇప్పటికీ ఒప్పందం లేదు. వారు చర్చల ప్రక్రియను సాగదీస్తున్నారు” అని బెస్సెంట్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం భారత్ నుంచి దిగుమతులపై అదనంగా 25 శాతం సుంకాలను విధించింది. దీంతో మొత్తం సుంకాలు 50 శాతానికి చేరాయి.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ భారత్ లాభపడుతోందన్న పాత ఆరోపణను బెస్సెంట్ మరోసారి గుర్తుచేశారు. గతంలో ఈ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ గట్టిగా బదులిచ్చిన విషయం తెలిసిందే. “భారత్ నుంచి చమురు కొనడం మీకు సమస్య అయితే, కొనకండి” అని ఆయన గత వారం స్పష్టం చేశారు.
ఇక బ్రిక్స్ దేశాలు రూపాయిలలో వాణిజ్యం జరపడంపై అడిగిన ప్రశ్నకు బెస్సెంట్ నవ్వేశారు. “రూపాయి రిజర్వ్ కరెన్సీగా మారుతుందని నేను ఆందోళన చెందడం లేదు” అని ఆయన కొట్టిపారేశారు. డీ-డాలరైజేషన్ తమ అజెండాలో లేదని గత నెలలో భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ .. కౌంటర్ ప్లాన్ సిద్దం చేసుకున్న భారత్

- భారత్‌పై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు నిన్నటి నుంచి అమల్లోకి
- జౌళి ఉత్పత్తులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు వంటి ఎగుమతులపై తక్షణ తీవ్ర ప్రభావం
- ప్రత్యామ్నాయంగా 40 దేశాల్లో మార్కెట్ విస్తరణకు ప్లాన్ సిద్దం చేసిన భారత్
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతీకారంగా భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించిన విషయం తెలిసిందే. భారత్‌పై విధించిన 50 శాతం సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ అదనపు సుంకాలతో భారత్ నుంచి ఎగుమతి అయ్యే జౌళి ఉత్పత్తులు, దుస్తులు, జెమ్స్, ఆభరణాలు వంటి ఎగుమతులపై తక్షణమే తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తుల ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, ఎగుమతులు తగ్గనున్నాయి.
ప్రత్యామ్నాయ వ్యూహం సిద్దం
ఈ టారిఫ్‌లతో తలెత్తే ఎగుమతుల విఘాతం నుంచి తప్పించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ వ్యూహాన్ని సిద్ధం చేసింది. వాణిజ్య శాఖ ఆధ్వర్యంలో 40 దేశాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రోగ్రామ్‌ల ద్వారా ఆయా దేశాల్లో భారత ఉత్పత్తులకు మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రయత్నించనున్నారు.
ప్రచార కార్యక్రమాలు చేపట్టే దేశాలు
యునైటెడ్ కింగ్డమ్ (యూకే), జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, కెనడా, మెక్సికో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఆస్ట్రేలియా, రష్యా, తదితర 40 దేశాలలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. ఈ దేశాల్లో భారత్ ఉత్పత్తులకు మార్కెట్ ను మరింత విస్తరించేలా ఈ కార్యక్రమాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.
అమెరికాలో కాల్పుల కలకలం.. ‘భారత్‌పై అణుదాడి చేయాలి’ అంటూ తుపాకిపై దుండగుడి రాతలు

- అమెరికా మినియాపొలిస్‌లో స్కూల్ విద్యార్థులపై కాల్పుల ఘటన
- చర్చిలో ప్రార్థనల సమయంలో దాడి, ఇద్దరు చిన్నారుల మృతి
- నిందితుడు తన తుపాకులపై ‘భారత్‌పై అణుదాడి చేయాలి’ అని రాయడం కలకలం
- ‘ట్రంప్‌ను చంపాలి’, ‘ఇజ్రాయెల్ పతనం కావాలి’ అంటూ మరికొన్ని రాతలు
- దాడికి పాల్పడింది 23 ఏళ్ల రాబిన్ వెస్ట్‌మన్‌గా గుర్తింపు
అమెరికాలో మరోసారి తుపాకీ పేలింది. మినియాపొలిస్ నగరంలోని ఓ చర్చిలో ప్రార్థనలు చేస్తున్న స్కూల్ విద్యార్థులపై ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనకు పాల్పడిన నిందితుడు తన ఆయుధాలపై రాసుకున్న సందేశాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. ‘భారత్‌పై అణుదాడి చేయాలి’, ‘డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలి’ వంటి విద్వేషపూరిత రాతలు ఆయుధాలపై కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే… బుధవారం అన్నన్సియేషన్ క్యాథలిక్ స్కూల్‌కు చెందిన చర్చిలో ఈ ఘటన జరిగింది. నిందితుడిని 23 ఏళ్ల రాబిన్ వెస్ట్‌మన్‌గా అధికారులు గుర్తించారు. రైఫిల్, షాట్‌గన్, పిస్టల్ వంటి మూడు ఆయుధాలతో చర్చిలోకి ప్రవేశించిన వెస్ట్‌మన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి అనంతరం అదే ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో వెస్ట్‌మన్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు.
దాడికి పాల్పడటానికి ముందు వెస్ట్‌మన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను పోస్ట్ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఛానెల్‌ను యూట్యూబ్ తొలగించింది. ఆ వీడియోలో తన వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ప్రదర్శించాడు. తుపాకుల మ్యాగజైన్లపై ‘కిల్ డొనాల్డ్ ట్రంప్’, ‘ఇజ్రాయెల్ పతనం కావాలి’, ‘పిల్లల కోసం’, ‘మీ దేవుడు ఎక్కడ?’ వంటి రాతలు కనిపించాయి. ఆయుధాల్లో ఒకదానిపై స్పష్టంగా ‘న్యూక్ ఇండియా’ (భారత్‌పై అణుదాడి చేయాలి) అని రాసి ఉంది.
అమెరికా హోంల్యాండ్ సెక్రటరీ క్రిస్టీ నోయెమ్ ఈ వీడియోలోని సమాచారం వాస్తవమేనని ధ్రువీకరించారు. “తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఈ హంతకుడు” తన తుపాకీపై ఇలాంటి భయంకరమైన రాతలు రాశాడని ఆమె ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తెలిపారు. వెస్ట్‌మన్‌కు ఎలాంటి నేర చరిత్ర లేదని, ఆయుధాలను చట్టబద్ధంగానే కొనుగోలు చేశాడని, ఈ దాడిలో మరెవరి ప్రమేయం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది అమెరికాలో ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది 146వ సారి కావడం అక్కడి తుపాకీ సంస్కృతిపై ఆందోళనలను మరింత పెంచుతోంది.
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాప సూచికంగా దేశవ్యాప్తంగా జాతీయ జెండాను అవనతం చేయాలని అధికారులను ఆదేశించారు.
భారత్-అమెరికా బంధాన్ని ట్రంప్ దెబ్బతీస్తున్నారు: డెమొక్రాట్ల ఆందోళన

- రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలుపై ట్రంప్ ప్రభుత్వం ఆగ్రహం
- భారత్ దిగుమతులపై 50 శాతానికి టారిఫ్‌ల పెంపు
- చైనాను వదిలేసి భారత్‌నే లక్ష్యం చేసుకున్నారని డెమొక్రాట్ల విమర్శ
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలపై స్వదేశంలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్యా నుంచి అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తున్న చైనా వంటి దేశాన్ని వదిలేసి, కేవలం భారత్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడంపై డెమొక్రాటిక్ పార్టీకి చెందిన హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ తీవ్రంగా మండిపడింది. ట్రంప్ నిర్ణయాలు అమెరికా ప్రయోజనాలకు, భారత్‌తో దశాబ్దాలుగా నిర్మించుకున్న సంబంధాలకు హానికరమని ఆరోపించింది.
భారత దిగుమతులపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌లు అమెరికన్లనే నష్టపరుస్తున్నాయని, రెండు దశాబ్దాలుగా ఇరు దేశాలు నిర్మించుకున్న బలమైన సంబంధాలను దెబ్బతీస్తున్నాయని డెమొక్రాట్లు ఆరోపించారు. “ఇదంతా చూస్తుంటే అసలు సమస్య ఉక్రెయిన్ కాదేమో అనిపిస్తోంది” అంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఒక ప్రకటనలో విమర్శించారు. రష్యా నుంచి అత్యధికంగా ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న చైనాను వదిలేసి, కేవలం భారత్‌పైనే దృష్టి పెట్టడం గందరగోళ విధానమని న్యూయార్క్ టైమ్స్ నివేదికను కూడా వారు ఉటంకించారు. చైనా ఇప్పటికీ రాయితీ ధరలకు రష్యా చమురును కొనుగోలు చేస్తూనే ఉందని, కానీ ఆ దేశంపై ఎలాంటి చర్యలు లేవని వారు గుర్తుచేశారు.
రష్యా చమురు వాణిజ్యానికి ముడిపెడుతూ ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాలను విధించడంతో మొత్తం టారిఫ్‌లు 50 శాతానికి చేరాయి. ఈ నిర్ణయంతో సుమారు 48.2 బిలియన్ డాలర్ల విలువైన భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని మోదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ చర్య వల్ల అమెరికాకు జరిగే ఎగుమతులు వాణిజ్యపరంగా లాభదాయకం కావని, ఇది దేశంలో ఉద్యోగ నష్టాలకు, ఆర్థిక వృద్ధి మందగమనానికి దారితీయవచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల వంటి కొన్ని కీలక రంగాలకు ఈ అదనపు సుంకాల నుంచి అమెరికా మినహాయింపు ఇవ్వడం భారత్‌కు కొంత ఊరటనిచ్చే అంశం. గత కొన్నేళ్లుగా భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు విస్తరిస్తున్నప్పటికీ, మార్కెట్ యాక్సెస్ వంటి అంశాలపై వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా వ్యవసాయ, డెయిరీ రంగాల్లో తమకు మరింత ప్రాధాన్యత కల్పించాలని అమెరికా డిమాండ్ చేస్తుండటంతో వాణిజ్య ఒప్పంద చర్చలు నిలిచిపోయాయి.
విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్

- అమెరికాలో ‘డ్యురేషన్ ఆఫ్ స్టే’ కుదించే ప్రతిపాదన
- నాలుగేళ్లకు మించి ఉండకుండా కట్టడి చేయనున్న ట్రంప్
- విద్యార్థుల వీసాల్లో కీలక మార్పులకు ప్రయత్నాలు
అమెరికాలో చదువుకుంటున్న, ఉన్నత చదువుల కోసం ఆ దేశానికి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న విద్యార్థులకు ట్రంప్ సర్కారు మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వీసాలపై పలు ఆంక్షలు అమలు చేస్తున్న అమెరికా.. తాజాగా మరో కీలక సవరణకు ప్రతిపాదనలు చేసింది. విదేశీ విద్యార్థులు తమ దేశంలో ఎక్కువ కాలం ఉండిపోకుండా కట్టడి చేసేందుకు ప్రయత్నం చేస్తోంది. విద్యార్థులు, ఎక్స్ఛేంజ్ విజిటర్లు, మీడియా ప్రతినిధులకు జారీ చేసే వీసాలకు పరిమిత కాల గడువు విధిస్తూ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. స్టూడెంట్ వీసాపై వచ్చిన వారు నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండకుండా నిబంధనలకు సవరణ చేయనుంది.
ప్రస్తుతం ఎఫ్-1, జే–1 వీసాలకున్న ‘డ్యూరేషన్ ఆఫ్ స్టే’ వెసులుబాటును కుదించనున్నట్లు సమాచారం. ఈ వెసులుబాటు ప్రకారం.. విద్యార్థులు ఎంతకాలం చదవాలనుకుంటే అంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ఈ ఫ్లెక్సిబుల్ స్టూడెంట్ వీసాలకు కూడా గడువు విధించేలా ‘పరిమిత కాల నివాస అనుమతి’తో కూడిన వీసాలను మంజూరు చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. విదేశీ విద్యార్థులకు డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటు వల్ల భద్రతాపరమైన ఇబ్బందులు, అమెరికన్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొంది.
అందుకే కొన్ని రకాల వీసాదారుల నివాస అనుమతులపై పరిమితి తీసుకొస్తున్నామని తమ నోటీసుల్లో పేర్కొంది. ఈ ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రీలో పబ్లిష్ చేయనున్నారు. ఆ తర్వాత ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రజాభిప్రాయ సేకరణను తప్పించి తక్షణమే అమలు చేసేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసే అవకాశమూ లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మార్పులు అమలులోకి వస్తే ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్న 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులపై అధిక ప్రభావం పడే అవకాశం ఉంది.
ప్రతిపాదనలు..
- ఎఫ్, జే వీసా హోల్డర్లు, ఎక్స్ఛేంజ్ విజిటర్లకు గరిష్ఠ కాల పరిమితి నాలుగేళ్లు
- గ్రాడ్యుయేట్ స్థాయి ఎఫ్-1 విద్యార్థులు కోర్సు మధ్యలో ప్రోగ్రామ్‌లు మార్చుకుంటే ఆంక్షలు తప్పవు
- ఎఫ్-1 విద్యార్థులు మరో వీసా కోసం ప్రయత్నించేందుకు ప్రస్తుతం ఉన్న గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుంచి 30 రోజులకు కుదింపు
- ఐ-వీసాదారులు (మీడియా ప్రతినిధులు) 240 రోజుల వరకు అమెరికాలో ఉండొచ్చు. ఆ తర్వాత వీసా పరిమితిని మరో 240 రోజులకు పొడిగించుకోవచ్చు. చైనా మీడియా ప్రతినిధులకు అదనపు ఆంక్షలు