అంతర్జాతీయం

అమెరికాకే ప్రాణసంకటం.. వీసా ఫీజు పెంపుపై అమితాబ్ కాంత్l

  • భారత్‌కు టర్బోఛార్జ్‌ అన్న నీతి అయోగ్ మాజీ సీఈవో
  • ట్రంప్ నిర్ణయం అమెరికా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుందని వ్యాఖ్య
  • హెచ్ 1బీ వీసా ఫీజు పెంపును తప్పుబడుతున్న నిపుణులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయంపై నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ తీవ్రంగా స్పందించారు. హెచ్ 1బీ వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ నిర్ణయం వెనక ట్రంప్ ఉద్దేశం ఏదైనప్పటికీ అంతిమంగా భారత్ కే ప్రయోజనం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బహుశా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని, అయితే అది అమెరికాకే తిప్పికొడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వల్ల ఏర్పడే పరిణామాలు భారత్‌కు టర్బోఛార్జ్‌లా పనిచేస్తాయని అన్నారు.

అమెరికాలోని కంపెనీలు విదేశీ ఉద్యోగులను నియమించుకునేందుకు దరఖాస్తు చేసే హెచ్ 1బీ వీసాపై ట్రంప్ తాజాగా దృష్టి సారించారు. దేశంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచాలనే ఉద్దేశంతో ఈ వీసా ఫీజును పెంచినట్లు అమెరికా నిపుణులు చెబుతున్నారు. ఈ నిర్ణయంతో విదేశీ ఉద్యోగులను నియమించుకునే విషయంలో కంపెనీలు వెనక్కి తగ్గుతాయన్నదే ట్రంప్ ఉద్దేశమని అంటున్నారు. ఫలితంగా అమెరికన్లకు అవకాశాలు పెరుగుతాయని వాదిస్తున్నారు.

అయితే, ట్రంప్ నిర్ణయం అంతిమంగా అమెరికాకే చేటు చేస్తుందని అమితాబ్ కాంత్ తెలిపారు. వీసా ఫీజు పెంపు వల్ల అమెరికాకు వెళ్లే భారత నిపుణుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని వివరించారు. దీని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థపై గణనీయంగా ఉంటుందని తెలిపారు. హెచ్ 1బీ వీసా రెన్యూవల్ ఫీజును పెంచడం ద్వారా అమెరికాలోని భారత ఉద్యోగులకు ట్రంప్ ఓ చక్కటి అవకాశం కల్పించారని, మాతృదేశానికి సేవలందించే మార్గం చూపారని ఆయన పేర్కొన్నారు.

హెచ్1బీ వీసా ఫీజు పెంపు… ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు

Narendra Modi comments on H1B visa fee hike
  • పరాధీనతే మన నిజమైన శత్రువు అన్న ప్రధాని మోదీ
  • ఆత్మనిర్భర్ భారత్‌తోనే ప్రపంచంలో గౌరవం అని స్పష్టం
  • విదేశీ షిప్పింగ్‌పై ఏటా రూ.6 లక్షల కోట్ల భారీ వ్యయం
  • మన రక్షణ బడ్జెట్‌కు సమానమైన మొత్తమని వెల్లడి
  • కాంగ్రెస్ విధానాలతోనే షిప్పింగ్ రంగం కుప్పకూలిందని విమర్శ

భారతదేశానికి అసలైన శత్రువు ఇతర దేశాలపై ఆధారపడటమేనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ బలోపేతానికి, ప్రపంచ గౌరవానికి స్వావలంబన ఒక్కటే మార్గమని ఆయన స్పష్టం చేశారు. హెచ్1బీ వీసా ఫీజు పెంపు వేళ, గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో శనివారం జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

“ప్రపంచంలో మనకు పెద్ద శత్రువులెవరూ లేరు. ఇతర దేశాలపై ఆధారపడటమే మన ఏకైక నిజమైన శత్రువు. ఈ పరాధీనత అనే శత్రువును మనమందరం కలిసి ఓడించాలి” అని మోదీ పిలుపునిచ్చారు. ఇతరులపై ఆధారపడితే మన ఆత్మగౌరవం దెబ్బతింటుందని, 140 కోట్ల మంది ప్రజల భవిష్యత్తును ఇతరుల చేతుల్లో పెట్టలేమని ఆయన అన్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం తప్పనిసరిగా ఆత్మనిర్భర్‌గా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు.

గత కాంగ్రెస్ ప్రభుత్వాల విధానాలపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో నౌకా నిర్మాణాన్ని ప్రోత్సహించకుండా, విదేశీ నౌకలకు అద్దె చెల్లించడానికే వారు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు. దీనివల్ల దేశంలో షిప్పింగ్ రంగం పూర్తిగా కుప్పకూలిందని, 90 శాతం వాణిజ్యం కోసం విదేశీ నౌకలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడిందని తెలిపారు.

“ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా కోసం విదేశీ షిప్పింగ్ సంస్థలకు భారత్ ఏటా దాదాపు రూ.6 లక్షల కోట్లు చెల్లిస్తోంది. ఈ మొత్తం మన రక్షణ బడ్జెట్‌తో దాదాపు సమానం” అని మోదీ వివరించారు. అమెరికా ఇటీవల హెచ్-1బీ వీసాలపై భారీగా ఫీజులు విధించడం, భారత దిగుమతులపై సుంకాలు కొనసాగించడం వంటి పరిణామాల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

 అమెజాన్‌ టు టీసీఎస్‌.. హెచ్‌-1బీ వీసాలు ఏ కంపెనీలకు ఎన్నంటే..?

H1B Visa Impact on Amazon TCS and Other Companies
  • హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల వార్షిక ఫీజు విధింపు
  • రేప‌టి నుంచి అమల్లోకి కొత్త నిబంధన
  • ఈ ఏడాది అత్యధిక వీసాలు పొందిన రెండో కంపెనీగా టీసీఎస్
  • 10,044 వీసాలతో అగ్రస్థానంలో అమెజాన్  
  • అమెరికన్ల ఉద్యోగాల కోసమే ఈ నిర్ణయమని ప్రభుత్వం వెల్లడి
  • భారత ఐటీ కంపెనీలు, నిపుణులపై తీవ్ర ప్రభావం

అమెరికాలో ఉద్యోగాలు ఆశిస్తున్న భారత ఐటీ నిపుణులకు, కంపెనీలకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. హెచ్-1బీ వీసాలపై ఏకంగా లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) వార్షిక ఫీజు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ఒక కీలక ఉత్తర్వుపై సంతకం చేశారు. ఈ కొత్త నిబంధన ఈ నెల 21 నుంచి తక్షణమే అమల్లోకి రానుందని, ఏడాది పాటు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను కొన్ని కంపెనీలు వ్యవస్థాగతంగా దుర్వినియోగం చేస్తున్నాయని, దీనివల్ల అమెరికన్ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ట్రంప్ ప్రభుత్వం ఆరోపించింది. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ‘రెస్ట్రిక్షన్ ఆన్ ఎంట్రీ ఆఫ్ సెర్టెన్ నాన్-ఇమిగ్రెంట్ వర్కర్స్’ పేరిట జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐటీ కంపెనీలు వేల సంఖ్యలో విదేశీ ఉద్యోగులను నియమించుకుంటూ, అదే సమయంలో అమెరికన్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాయని ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది.

హెచ్‌-1బీ వీసాలు ఏ కంపెనీలకు ఎన్నంటే..?
ఈ నిర్ణయం వెలువడిన కొద్ది రోజుల ముందే, 2025 సంవత్సరానికి గాను హెచ్-1బీ వీసాలు పొందిన కంపెనీల జాబితాను యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం, అమెజాన్ 10,044 వీసాలతో అగ్రస్థానంలో నిలవగా, భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 5,505 వీసాలతో రెండో అతిపెద్ద లబ్ధిదారుగా నిలిచింది.

ఇతర టెక్ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్ (5,189), మెటా (5,123), యాపిల్ (4,202), గూగుల్ (4,181) కూడా భారీ సంఖ్యలో వీసాలు పొందాయి. భారత కంపెనీలైన ఇన్ఫోసిస్ (2,004), విప్రో (1,523), టెక్ మహీంద్రా (951) కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా విధించిన లక్ష డాలర్ల ఫీజుతో ఈ కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది.

హెచ్-1బీ ఉద్యోగుల వల్ల కంపెనీలకు 36 శాతం వరకు ఖర్చు ఆదా అవుతుందని ఒక అధ్యయనాన్ని ఉటంకిస్తూ ప్రభుత్వం తెలిపింది. కొన్ని కంపెనీలు వేలల్లో వీసాలు పొందుతూ, అదే సమయంలో పదివేల మందికి పైగా స్థానిక ఉద్యోగులను తొలగించాయని తన ఉత్తర్వుల్లో తీవ్రంగా విమర్శించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) రంగాల్లో ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి అమెరికన్ కంపెనీలకు హెచ్-1బీ వీసా వీలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. తాజా నిర్ణయంతో ఈ ప్రక్రియ అత్యంత ఖరీదైనదిగా మారనుంది.

హెచ్-1బీ వీసా ఫీజు పెంపు… నేను మళ్లీ చెబుతున్నా, మనకు ఒక బలహీన ప్రధాని ఉన్నారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi Criticizes Modi on H1B Visa Issue
  • అమెరికాలో భారీగా పెరిగిన H-1B వీసా ఫీజులు
  • ప్రధాని మోదీ బలహీన ప్రధాని అంటూ రాహుల్ తీవ్ర విమర్శ
  • లక్ష డాలర్లకు చేరిన వార్షిక ఫీజుతో భారతీయులపై పెను భారం
  • మోదీ-ట్రంప్ స్నేహం వట్టిదేనని ఆరోపించిన కాంగ్రెస్ నేతలు
  • అమెరికన్ల ఉద్యోగాల కోసమే ఈ నిర్ణయమన్న ట్రంప్ ప్రభుత్వం

అమెరికా తీసుకున్న హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నిర్ణయం ఇప్పుడు భారత్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నేను మళ్లీ చెబుతున్నా… భారత్‌కు ఒక బలహీన ప్రధాని ఉన్నారంటూ ఆయన ఘాటుగా విమర్శించారు.

శనివారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్-1బీ  వీసా ఫీజును 1,00,000 డాలర్లకు పెంచడం వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతీయులేనని పేర్కొంటున్న ఒక వార్తా కథనాన్ని కూడా ఆయన తన పోస్టుకు జత చేశారు. 2017 జులై 5న కూడా తాను ఇదే విధంగా “భారత్‌కు బలహీన ప్రధాని ఉన్నారు” అని చేసిన పాత పోస్టును ఆయన గుర్తుచేశారు.

అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 71 శాతం హెచ్-1బీ  వీసాలు కలిగి ఉన్న భారతీయులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. గతంలో 1,700 నుంచి 4,500 డాలర్ల మధ్య ఉన్న ఈ ఫీజును అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకంగా లక్ష డాలర్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వీసా ప్రోగ్రామ్ దుర్వినియోగాన్ని అరికట్టి, దేశీయ అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం తన ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టింది. కాంగ్రెస్ ఎంపీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ, “ఒకవైపు ట్రంప్‌తో గొప్ప స్నేహం అంటారు, మరోవైపు భారతీయులపై ఇలాంటి భారం మోపుతున్నారు. ఆయన తనను తాను రాజులా భావిస్తున్నారు” అని విమర్శించారు. మరో కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్‌పుత్ మాట్లాడుతూ, “మోదీకి స్నేహితుడినని చెప్పుకుంటూనే అమెరికా శత్రువులా ప్రవర్తిస్తోంది. చాబహార్ పోర్టుపై ఆంక్షల నుంచి భారత వస్తువులపై 50 శాతం టారిఫ్‌ల వరకు అన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి” అని ఆరోపించారు.

హెచ్-1బీ  వీసా అనేది అమెరికా కంపెనీలు టెక్నాలజీ, ఇంజనీరింగ్ వంటి రంగాలలో నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను తాత్కాలికంగా నియమించుకోవడానికి అనుమతించే ఒక వర్క్ పర్మిట్. ఏటా 85,000 వీసాలను జారీ చేస్తుండగా, తాజా నిర్ణయం భారతీయ టెకీలపై, వారిని నియమించుకునే అమెరికన్ టెక్ కంపెనీలపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది.

హెచ్-1బీ వీసా భారం.. అమెరికా నిర్ణయంతో భారత్‌కు పరోక్ష ప్రయోజనం?

H1B Visa Fee Hike Will India Benefit
  • హెచ్-1బీ వీసా వార్షిక ఫీజును లక్ష డాలర్లకు పెంచిన అమెరికా
  • సెప్టెంబర్ 21 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధన
  • భారత్‌లో భారీగా విస్తరించనున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు
  • అమెరికన్ కంపెనీలకే తీవ్ర నష్టం అంటున్న నిపుణులు
  • భారత ఐటీ కంపెనీలపై ప్రభావం స్వల్పమేనని అంచనా
  • పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం, నాస్కామ్

అమెరికా వెళ్లాలనుకునే భారతీయ టెక్కీలకు ఇది కచ్చితంగా చేదువార్తే. హెచ్-1బీ వీసాలపై అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వార్షిక వీసా ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు (సుమారు రూ.83 లక్షలు) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త నిబంధన రేప‌టి నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లినప్పటికీ, అనూహ్యంగా ఇది భారత్‌కు మేలు చేస్తుందని టెక్ వర్గాల్లో బలమైన వాదన వినిపిస్తోంది.

అమెరికా తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో ఏర్పడే పరిణామాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఐటీ పరిశ్రమల సమాఖ్య ‘నాస్కామ్’ రంగంలోకి దిగాయి. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అయితే, నిపుణుల అంచనా ప్రకారం, ఈ కొత్త ఫీజుల భారం భారతీయ ఉద్యోగుల కంటే ఎక్కువగా వారిని నియమించుకునే అమెరికన్ కంపెనీలపైనే పడనుంది. నైపుణ్యం కలిగిన భారతీయ టెక్కీలపై అధికంగా ఆధారపడే ఆయా సంస్థలకు ఇది పెద్ద సవాల్‌గా మారనుంది.

ఈ నేపథ్యంలో అమెరికాలో ఏర్పడే టెక్కీల కొరతను అధిగమించేందుకు చాలా గ్లోబల్ కంపెనీలు భారత్ వైపు చూసే అవకాశం ఉంది. తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీ) ఇండియాలో ఏర్పాటు చేయడం లేదా ఇప్పటికే ఉన్నవాటిని భారీగా విస్తరించడం ద్వారా ఈ సమస్యను అధిగమించాలని భావిస్తున్నాయి. ప్రపంచంలోని జీసీసీలలో దాదాపు సగం మన దేశంలోనే ఉన్నాయని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. 2029-30 నాటికి దేశంలోని జీసీసీల సంఖ్య 1,700 నుంచి 2,100కు పెరుగుతుందని అంచనా.

మరోవైపు, ఈ కొత్త ఫీజుల ప్రభావం భారత ఐటీ కంపెనీలపై పెద్దగా ఉండకపోవచ్చని AIonOS సహ వ్యవస్థాపకుడు సీపీ గుర్నానీ తెలిపారు. “గత కొన్నేళ్లుగా భారతీయ ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని 50 శాతం మేర తగ్గించుకున్నాయి. అమెరికాలో స్థానికంగా నియామకాలు చేపట్టడం, ఆటోమేషన్‌పై పెట్టుబడులు పెట్టడం వంటి వ్యూహాల వల్ల ఈ మార్పు సాధ్యమైంది. కాబట్టి ఈ ఫీజుల ప్రభావం మా వ్యాపారాలపై పరిమితంగానే ఉంటుంది” అని ఆయన వివరించారు. మొత్తం మీద, అమెరికా నిర్ణయం భారత టెక్కీలకు ఒక దారిని మూసినా, దేశీయంగా కొత్త ఉద్యోగ అవకాశాలకు మరో దారి తెరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

అమెరికాలో అరుదైన హిందూ దేవాలయం…!

Ram Narayana

మొదలుపెట్టకముందే ముగించేశాడు.. కొత్త పార్టీపై మస్క్ యూటర్న్!

Ram Narayana

ట్రంప్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ!

Ram Narayana