ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్!

  • తిరుమలలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
  • తిరుమలలో రాధాకృష్ణన్ కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్
  • శేషవాహన సేవలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి, సీఎం దంపతులు

భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా నిన్న రాత్రి తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. తిరుమల ఆలయం వద్దకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఘన స్వాగతం పలికారు.

దేవాలయం లోపలికి వెళ్ళిన అనంతరం ఉపరాష్ట్రపతి దంపతులు శ్రీవారి ప్రధాన దర్శనంతో పాటు వకుళామాత ఆలయం, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామి ఆలయాలను కూడా దర్శించుకున్నారు.

తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల తొలి రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఆలయ ప్రధాన గోపురం నుంచి పెద్ద శేషవాహనంపై తిరుమల మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ శేషవాహన సేవలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దంపతులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు, మంత్రి నారా లోకేష్ దంపతులు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ విజయవాడ పర్యటన ముగిసిన తర్వాత తిరుమలకు చేరుకున్నారు. 

విజయవాడ ఉత్సవ్‌లో ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కీలక వ్యాఖ్యలు

CP Radhakrishnan Key Remarks at Vijayawada Utsav
  • విజయవాడ పర్యటన తన జీవితంలో మరిచిపోలేని అనుభవంగా నిలిచిపోతుందన్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
  • విజయవాడ హాట్ సిటీ .. కూల్ పీపుల్స్ అని వ్యాఖ్య
  • చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ‘‘వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌’’ దిశగా ముందుకు సాగుతోందన్న సీపీ రాధాకృష్ణన్

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా నిన్న పున్నమి ఘాట్‌లో నిర్వహించిన విజయవాడ ఉత్సవ్ – 2025 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగులో “అందరికీ నమస్కారం” అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన సీపీ రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణలాంటిదని అన్నారు.

తెలుగు భాష యొక్క అందం, సాహిత్యం, సంగీతం వైభవాన్ని ఆయన ప్రశంసించారు. తెలుగులో పాడిన పాటలు అద్భుతంగా ఉంటాయని కొనియాడారు. విజయవాడ ఉత్సవ్ మరిన్ని దశాబ్దాలు, శతాబ్దాలు కొనసాగాలని ఆకాంక్షించారు. “విజయవాడ హాట్ సిటీ.. కూల్ పీపుల్” అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో విజయవాడ నగరం అభివృద్ధి చెందిన నగరంగా నిలవబోతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారికంగా మొదటిసారి విజయవాడకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడలో తనకు అద్భుతమైన గౌరవం లభించిందని అన్నారు. ఇక్కడి సంప్రదాయాలు, సంస్కృతి దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ఈ పర్యటన తన జీవితంలో మరిచిపోలేని అనుభవంగా నిలిచిపోతుందని అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం ‘‘వికసిత్ ఆంధ్రప్రదేశ్’’ దిశగా ముందుకు సాగుతోందని కొనియాడారు. ప్రజలందరికీ కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. తన ప్రసంగాన్ని ‘‘జై ఆంధ్రప్రదేశ్!’’ అనే నినాదంతో ముగించారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు. 

Related posts

తాడిపత్రికి వెళ్లేందుకు తొలగిన అడ్డంకులు.. పెద్దారెడ్డికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Ram Narayana

బాబూ ట్యాక్సీ కావాలా”… అంటూ అడిగిన అధ్యక్షుడు బైడెన్… 

Drukpadam

ఈ ఆలయాలపై గ్రహణం ప్రభావం చూపదట… అందుకే తెరిచి ఉంచుతారు!

Drukpadam