Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తరుముకొస్తున్న ‘మొంథా’ తీవ్ర తుపాను.. పవన్ కల్యాణ్ తో కలిసి సీఎం చంద్రబాబు సమీక్ష!

  • ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణకు అధికారులకు ఆదేశాలు
  • నేటి అర్ధరాత్రి కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటే అవకాశం
  • డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలని సూచన
  • ఇప్పటికే 43 వేల హెక్టార్లలో పంట నీట మునిగినట్లు అంచనా
  • రహదారులకు అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశం

బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తీవ్ర తుపాను కోస్తాంధ్ర తీరంవైపు దూసుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. తుపాను ప్రభావిత ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులను, అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా వాగులు ఆకస్మికంగా పొంగిపొర్లే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. మంగళవారం అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి మొంథా తుపాను ప్రభావం, ప్రభుత్వ సన్నద్ధతపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

తీరం దాటే ప్రాంతంపై ప్రత్యేక దృష్టి

ప్రస్తుతం మొంథా తుపాను అత్యంత వేగంగా తీరానికి సమీపిస్తోందని, ఈ అర్ధరాత్రికి కాకినాడకు దక్షిణంగా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం, విశాఖపట్నం సహా పలు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. దీనిపై స్పందించిన చంద్రబాబు, తుపాను తీరం దాటే అవకాశం ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాలకు తక్షణమే మరిన్ని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను తరలించాలని ఆదేశించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యంత్రసామాగ్రి, కమ్యూనికేషన్ పరికరాలు, అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. గడచిన అనుభవాలను, ముఖ్యంగా హుద్‌హుద్ తుపాను సృష్టించిన విధ్వంసాన్ని గుర్తుచేసుకుంటూ, అప్పటి స్ఫూర్తితో కేవలం నాలుగు రోజుల్లోనే ప్రజలను గట్టెక్కించామని, అదే పట్టుదలతో ఇప్పుడు పనిచేయాలని పిలుపునిచ్చారు.

క్షేత్రస్థాయిలో పక్కా సమాచారం ఉండాలి

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎంత విస్తీర్ణంలో నీరు నిలిచింది, ఏయే వాగులు పొంగే ప్రమాదం ఉందో కచ్చితమైన అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నందున ఎర్రకాలువకు ఎగువ నుంచి ఆకస్మిక వరద ప్రవాహం వచ్చే ప్రమాదం ఉందని, ఆ ప్రాంతంలో అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

డ్రోన్లతో పర్యవేక్షణ, తక్షణ పునరుద్ధరణ

తుపాను ప్రభావంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 43 వేల హెక్టార్లలో పంట నీట మునిగిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా కోనసీమ, ప్రకాశం, నంద్యాల, కడప, తూర్పుగోదావరి జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా ఉందని వివరించారు. ఈ సందర్భంగా పంట నష్టం వివరాలను రైతులు నేరుగా ప్రభుత్వానికి పంపేలా వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌లో మార్పులు చేయాలని సీఎం సూచించారు. 

డ్రోన్ల ద్వారా ముంపు ప్రాంతాలను, గాలుల కారణంగా కూలిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, టవర్లను గుర్తించి తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల్లోని 1.92 కోట్ల మందికి మొబైల్ ఫోన్ల ద్వారా హెచ్చరిక సందేశాలు పంపామని, 2,703 జనరేటర్లను సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. అత్యవసర కమ్యూనికేషన్ కోసం పోలీస్ శాఖ 81 టవర్లతో వైర్‌లెస్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని వివరించారు.

ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తుపాను కారణంగా రోడ్లపై చెట్లు, స్తంభాలు కూలిపోయి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 

మరోవైపు… అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తాను ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నానని, యంత్రాంగమంతా క్షేత్రస్థాయిలో ఉందని మంత్రి నారా లోకేశ్ సీఎంకు తెలిపారు. 

రాయలసీమలో ప్రస్తుతం వర్షాలు లేనందున కృష్ణా నది ప్రవాహాలను అక్కడి చెరువులకు మళ్లించి, ఒక్క టీఎంసీ నీటిని కూడా వృథా చేయవద్దని జలవనరుల శాఖ అధికారులకు చంద్రబాబు సూచించారు. ఈ సమీక్షలో మంత్రులు అనిత, నారాయణ, అనగాని సత్యప్రసాద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

గన్నవరం విమానాశ్రయంలో ఎన్నారై వైద్యుడు లోకేశ్ అడ్డగింత.. శాటిలైట్ ఫోన్ స్వాధీనం…

Ram Narayana

బీహార్ మంత్రి తేజ్‌ప్రతాప్‌కు వారణాసిలో దారుణ అవమానం!

Drukpadam

ఏపీ వ్యాప్తంగా ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల ఆందోళ‌న‌లు…

Drukpadam

Leave a Comment