బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష..
బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష..
షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించిన ఐసిటి కోర్టు
ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్ష ఖరారు
ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం తీసుకుంటున్న షేక్ హసీనా
షేక్ హసీనా తీరు మానవత్వానికి మచ్చ అన్న ఐసిటికోర్టు
అమాయకులను కాల్చిచంపాలని ఆదేశాలు ఇచ్చారన్న ఐసిటి కోర్టు
తీర్పుకు ముందు భగ్గుమన్న బంగ్లాదేశ్..
నిరసనలకు పిలుపునిస్తూ ఆడియో సందేశం విడుదల చేసిన హసీనా
ఢాకాలో వరుస పేలుళ్లు, దహనం ఘటనలతో అల్లకల్లోలం
అల్లరి మూకలపై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల జారీ
తీర్పుకు ముందు భగ్గుమన్న బంగ్లాదేశ్.. షేక్ హసీనాకు మరణశిక్ష?

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కేసులో అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ఐసీటీ) మరణశిక్షను విధిస్తు తీర్పు వెలువరించింది …దీంతో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తీర్పునకు ముందు ఆదివారం రాత్రి రాజధాని ఢాకా సహా పలు నగరాలు వరుస పేలుళ్లు, దహనం ఘటనలతో దద్దరిల్లాయి. గతేడాది జరిగిన విద్యార్థి ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై హసీనాకు మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది ..
ప్రస్తుతం భారత్‌లో ప్రవాసంలో ఉన్న షేక్ హసీనా, తనపై జరుగుతున్న విచారణను రాజకీయ ప్రేరేపిత కుట్రగా అభివర్ణించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి అవామీ లీగ్ ఫేస్‌బుక్ పేజీలో ఒక ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించినా, తన మద్దతుదారులు నిరసనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. “భయపడాల్సిన పనిలేదు. నేను బతికే ఉన్నాను. దేశ ప్రజలకు అండగా ఉంటాను” అని ఆమె ధైర్యం చెప్పారు. ఈ విచారణను ‘కంగారూ కోర్టు’ (అనధికార న్యాయస్థానం)గా అభివర్ణించిన హసీనా.. తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనుస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో హత్యలకు ఆదేశాలు ఇచ్చింది తాను కాదని, యూనుస్ అని ఆమె ఆరోపించారు.
హసీనా పిలుపు మేరకు అవామీ లీగ్ సోమవారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. మరోవైపు, తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా హింస చెలరేగింది. ఢాకాలో తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు నివాసం వెలుపల రెండు కచ్చా బాంబులు పేలాయి. పలు ప్రాంతాల్లో బస్సులకు నిప్పుపెట్టారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్లర్లకు పాల్పడితే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు ఢాకా పోలీస్ కమిషనర్ ప్రకటించారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
గతేడాది ఆగస్టులో జరిగిన ఈ విద్యార్థి ఉద్యమంలో హింస చెలరేగి వందల మంది ప్రాణాలు కోల్పోగా, షేక్ హసీనా 15 ఏళ్ల పాలన ముగిసింది. అప్పటి నుంచి ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. తాత్కాలిక ప్రభుత్వం ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించగా, తమ పార్టీని నిషేధిస్తే ఎన్నికలను అడ్డుకుంటామని హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ హెచ్చరించారు..
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్
- మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారని అభియోగాలు
- తనకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చారన్న న్యాయమూర్తి
- నిరసనకారులపై ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించారని పేర్కొన్న న్యాయమూర్తి
బంగ్లాదేశ్‌లో గత ఏడాది జరిగిన అల్లర్ల కేసులో మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాను ఆదేశంలోని అంతర్జాతీయ క్రైమ్ ట్రైబ్యునల్ దోషిగా తేల్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న అభియోగాల నేపథ్యంలో ఆమెపై పలు కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో ఆమెకు గరిష్ఠ శిక్ష పడే అవకాశం ఉంది. గత ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో జరిగిన ఆందోళనలలో 1,400 మంది మృతి చెందారని న్యాయమూర్తి వెల్లడించారు. తనకు వ్యతిరేకంగా అల్లర్లు చేస్తున్న వారిని చంపేయమని ఆదేశాలు ఇచ్చారని పేర్కొన్నారు.
గత ఏడాది ఆగస్టు 5న ఢాకాలో నిరసనలపై ఆర్మీ కాల్పులు జరిపిందని, వారిపై హెలికాప్టర్లు, ప్రాణాంతక ఆయుధాలు ఉపయోగించాలని ఆదేశించారని మరో న్యాయమూర్తి తీర్పులో ప్రస్తావించారు. గాయపడిన వారికి వైద్య సహాయం అందించేందుకు నిరాకరించారని పేర్కొన్నారు. ఆమె అధికారంలో ఉండేందుకు బలప్రయోగం చేశారని తెలిపారు. తీర్పు ఇవ్వడంలో ఏదైనా ఆలస్యమైతే క్షమించాలని విజ్ఞప్తి చేశారు.
షేక్ హసీనాతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అబ్దుల్లా ఆల్‌మామున్‌లు మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ట్రైబ్యునల్ తీర్పులో పేర్కొంది. హత్య, హత్యాయత్నం, హింసతో పాటు ఇతర అమానవీయ చర్యలకు వారు పాల్పడినట్లు ట్రైబ్యునల్ పేర్కొంది.
కాగా, ఈ తీర్పునకు ముందు దేశ రాజధాని ఢాకా, మరికొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చెలరేగడంతో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం భద్రతను పెంచింది.
తీర్పు నేపథ్యంలో ఢాకా సహా పలు నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. వాహనాలు తగులబెట్టేందుకు ప్రయత్నిస్తే, బాంబులు విసిరేందుకు ప్రయత్నిస్తే వారిని కాల్చివేయాలంటూ ఢాకా పోలీస్ చీఫ్ షేక్ మహమ్మద్ సజ్జత్ అలీ ఆదేశాలు
మా అమ్మ ఇండియాలో సురక్షితంగా ఉన్నారు..షేక్ హసీనా కుమారుడు మరణశిక్ష విధించినా ఎవరూ ఏమీ చేయలేరు..
ప్రస్తుతం వాషింగ్టన్‌లో నివసిస్తున్న సాజిబ్ వాజెద్ మాట్లాడుతూ.. “మా అమ్మపై తీర్పు ఎలా ఉంటుందో మాకు తెలుసు. అనేక కేసుల్లో ఆమెను దోషిగా తేలుస్తారు. బహుశా మరణశిక్ష కూడా విధించవచ్చు. కానీ వారు నా తల్లిని ఏమీ చేయలేరు. ఆమె ప్రస్తుతం భారత్‌లో సురక్షితంగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు. తమ అవామీ లీగ్ పార్టీపై నిషేధం ఎత్తివేయకపోతే బంగ్లాదేశ్‌లో మరోసారి హింసాత్మక ఆందోళనలు తప్పవని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న జాతీయ ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు.
మరోవైపు, భారత్ నుంచే వర్చువల్‌గా తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన షేక్ హసీనా.. తనపై నమోదైన కేసులన్నీ చట్టవిరుద్ధమని, కుట్రపూరితమైనవని ఆరోపించారు. “ఇలాంటి చర్యలతో నా గళాన్ని అణచివేయలేరు. నాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ పాటించాలి” అని ఆమె తన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
గతేడాది విద్యార్థుల ఆందోళనలతో ప్రధాని పదవి కోల్పోయిన షేక్ హసీనా.. ఆగస్టు 5న బంగ్లాదేశ్ విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఢిల్లీలోని ఓ రహస్య ప్రాంతంలో నివసిస్తున్నారు. గతేడాది జరిగిన అల్లర్లలో అనేకమంది ప్రాణాలు కోల్పోవడంతో ఆమెపై హత్య సహా పలు తీవ్రమైన కేసులు నమోదైన విషయం తెలిసిందే..
భారత్‌లో ఆశ్రయం పొందుతూ తొలిసారి నోరువిప్పిన షేక్ హసీనా…
యూనస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు

- మహ్మద్ యూనస్ నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఆరోపణ
- దేశంలో హిందూ, ఇతర మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన
- రాబోయే ఎన్నికలు కేవలం ఓ నాటకమని, ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వ్యాఖ్య
- ఉగ్రవాద సంస్థలతో కొత్త ప్రభుత్వం అంటకాగుతోందని తీవ్ర విమర్శలు
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో రహస్య ప్రాంతంలో ఆశ్రయం పొందుతున్న ఆమె ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మహ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బంగ్లాదేశ్ నిరంకుశ పాలన దిశగా జారుకుంటోందని, ఉగ్రవాద సంస్థలతో కలిసి తీవ్రవాదం వైపు మళ్లుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
గతేడాది ఆగస్టు 5న తనను హింసాత్మకంగా అధికారం నుంచి తొలగించారని, విద్యార్థుల నిరసనలను అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు కుట్ర పన్నాయని హసీనా ఆరోపించారు. తన తండ్రి, జాతిపిత షేక్ ముజిబుర్ రెహ్మాన్ చారిత్రక నివాసాన్ని ధ్వంసం చేయడం ద్వారా విమోచన యుద్ధ స్ఫూర్తిని చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలు కేవలం నామమాత్రమేనని, అది రాజ్యాంగ విరుద్ధమైన పాలనను చట్టబద్ధం చేసే ఒక బూటకమని ఆమె అభివర్ణించారు. తన అవామీ లీగ్ పార్టీపై నిషేధం విధించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని అన్నారు.
యూనస్ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో హిందువులు, ఇతర మైనారిటీలపై వ్యవస్థీకృతంగా దాడులు జరుగుతున్నాయని హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వం వారికి రక్షణ కల్పించడంలో విఫలమవడమే కాకుండా, ఈ దాడులను ప్రోత్సహిస్తోందని విమర్శించారు. తన 15 ఏళ్ల పాలనలో మతసామరస్యాన్ని కాపాడానని గుర్తుచేశారు. ప్రస్తుత కష్టకాలంలో తనకు తాత్కాలిక ఆశ్రయం కల్పించినందుకు భారత ప్రభుత్వానికి, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. బంగ్లాదేశ్ భవిష్యత్తును ఆ దేశ ప్రజలే నిర్ణయించుకోవాలని, ఈ విషయాన్ని భారత్ అర్థం చేసుకుంటుందని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు.