చరిత్రలో నిలిచిపోయేలా ఖమ్మలో 100 సంవత్సరాల సిపిఐ బహిరంగ సభ …భాగం
హాజరు కానున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా
20న జాతీయ స్థాయి సెమినార్
12న కవి సమ్మేళనం
ర్యాలీలు, సభలు, సమావేశాలతో విస్తృత ప్రచారం
19 నుంచి 21 వరకు ఖమ్మంలో జాతీయ సమితి సమావేశాలు
ఖమ్మం చరిత్రలో నిలిచిపోయేలా సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ జనవరి 18న నిర్వహిస్తున్నట్లు సిపిఐ జాతీయ సమితి -సభ్యులు,శతాబ్ది ఉత్సవాల ఆహ్వాన సంఘ కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి లక్షలాది మంది ప్రజలు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు.మంగళవారం సిపిఐ కార్యాలయంలో ఏపూరి లతాదేవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో హేమంతరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో జాతీయ స్థాయి సభ జరగడం ఇదే మొదటిసారి అని వందేళ్ల సిపిఐ సమర చరితను నేటి తరానికి తెలియజేయడంతో పాటు సమకాలిన రాజకీయ పరిస్థితులు, మతోన్మాద ప్రమాదం, పెరుగుతున్న ఆర్థిక అసమానతలు తదితర విషయాలను నేటి తరానికి తెలియజేసి భవిష్యత్తు పోరాటాలకు కార్యోన్ముఖులను చేసేందుకు ఈ సభ దోహదపడుతుందన్నారు.ఖమ్మం ఎస్ఆర్ఆండ్బిజిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే ఈ సభకు అన్ని రాష్ట్రాల నుంచి సిపిఐ నాయకులు హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 19 నుంచి 21 వరకు జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మం సప్తపది ఫంక్షన్ హాల్ లో జరుగుతాయన్నారు. 18న బహిరంగ -సభ సందర్భంగా స్థానిక పెవిలియన్ మైదానం నుంచి 15వేల జనసేవాదళ్ కార్యకర్తలు కవాత్ చేస్తారని వీరితో పాటు కళాకారులు వృత్తి సంఘాలకు ప్రాతినిథ్యంవహిస్తూ ప్రజా సంఘాల కార్యకర్తలు ఆయా వృత్తుల వేషధారణలతో పాల్గొంటారని హేమంతరావు తెలిపారు.శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న జరిగే సభ జయప్రదం కోరుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.కరపత్రాలు, పోస్టర్లు,జీపుజాతాల ద్వారా ప్రచారం జరిగిందన్నారు.ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో గడిచిన నాలుగు రోజులుగా జీపుజాతాలు నిర్వహించామని ఎనిమిదిన అన్ని మండలాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు జరుగుతాయని తొమ్మిదిన జిల్లా కేంద్రం ఖమ్మంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ ఉంటుందన్నారు.
20న జాతీయ స్థాయి సెమినార్ :
ఖమ్మంలో జనవరి 20న జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం జరుగుతుందని ఈ సెమినార్కు అన్ని వామపక్షాల జాతీయ నాయకులు హాజరుకానున్నారని హేమంతరావు తెలిపారు. సిపిఐ జాతీయ కార్యదర్శి డి. రాజా, సిపిఎం జాతీయ కార్యదర్శి ఎంఏ బేబి, వామపక్షాల నేతలు -దీపాంకర్ భట్టాచార్య తదితరులు పాల్గొననున్నారని ఆయన తెలిపారు. భారతదేశంలో వామపక్ష ఉద్యమం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే -అంశంపై జాతీయ స్థాయి సెమినార్ జరుగుతుందన్నారు..
12న కవి సమ్మేళనం :
సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను పురస్కరించుకుని జనవరి 12న స్థానిక డిపిఆర్సి భవనంలో కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు హేమంతరావు తెలిపారు. ఈ కవి సమ్మేళనానికి ప్రముఖ కవులు సుద్దాల అశోక్ తేజ, కెవిఎల్ తో పాటు అభ్యుదయ కవులు ఖమ్మం జిల్లాకు చెందిన కవులందరిని ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమానికి సంబంధించి రచనలను సేకరించడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక కవితల సంకలనాన్ని విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. జనవరి 17న జాతీ య స్థాయి ఎడ్యుకేషన్ సబ్ కమిటీ సమావేశం అంతకు ముందు ప్రత్యేక కళారూపాల ప్రదర్శన జరుగుతుందని హేమంతరావు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, వివిధ ప్రజా సంఘాల బాధ్యులు, ఆహ్వాన సంఘ విభాగాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
సిపిఐ శతాబ్ది ఉత్సవాలకు సిఎం రేవంత్

భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న జరిగే బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. జనవరి 18న యస్ఆర్ అండ్ బి జిఎన్ఆర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో సిఎం పాల్గొంటారని ఉత్సవాల ఆహ్వాన సంఘ కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. హైదరాబాద్ నుంచి రెండు గంటలకు ఖమ్మం చేరుకుంటారని ఖమ్మంలో బహిరంగ -సభలో పాల్గొన్న అనంతరం ఖమ్మం నుంచి మేడారం వెళ్లనున్నట్లు హేమంతరావు తెలిపారు. శతాబ్ది ఉత్సావాల ముగింపు సందర్భంగా జరిగే సభకు లక్షలాది మంది ప్రజలు హాజరుకానున్నారని తెలిపారు. సిపిఐ జాతీయ -నాయకత్వంతో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు హాజరుకానున్నారని హేమంతరావు తెలిపారు.