మొత్తం బడ్జెట్ .. ఏ రంగానికి ఎంతెంత..?

- 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.53.5 లక్షల కోట్ల బడ్జెట్
- మూలధన వ్యయాన్ని రూ.12.2 లక్షల కోట్లకు పెంచిన కేంద్ర ప్రభుత్వం
- బయోఫార్మా, ఎంఎస్ఎంఈ రంగాలకు చెరో రూ.10,000 కోట్ల నిధులు
- వ్యక్తిగత అవసరాల దిగుమతులపై కస్టమ్స్ సుంకం 10 శాతానికి తగ్గింపు
- ఏప్రిల్ 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఆదివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. యువశక్తిని చోదకశక్తిగా చేసుకుని, పేదలు, అణగారిన వర్గాల ప్రగతి లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. మొత్తం రూ.53.5 లక్షల కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన ఈ బడ్జెట్‌లో స్థిరమైన ఆర్థిక వృద్ధి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం, ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ దార్శనికతతో అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అనే మూడు ప్రధాన కర్తవ్యాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
ప్రధాన కేటాయింపులు, ఆర్థిక అంచనాలు
2026-27 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వ్యయం రూ.53.5 లక్షల కోట్లుగా అంచనా వేయగా, మొత్తం రాబడులు (అప్పులు మినహా) రూ.36.5 లక్షల కోట్లుగా ఉంటాయని బడ్జెట్‌లో పేర్కొన్నారు. కేంద్ర నికర పన్ను రాబడులు రూ.28.7 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్యలోటును జీడీపీలో 4.3 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 2025-26 సవరించిన అంచనాల్లో ద్రవ్యలోటు 4.4 శాతంగా ఉంది. స్థూల మార్కెట్ రుణాలు రూ.17.2 లక్షల కోట్లుగా ఉంటాయని తెలిపారు.
మౌలిక సదుపాయాలకు భారీ కేటాయింపులు
దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ప్రభుత్వ మూలధన వ్యయాన్ని (పబ్లిక్ క్యాపెక్స్) గత ఏడాది రూ.11.2 లక్షల కోట్ల నుంచి ఈసారి రూ.12.2 లక్షల కోట్లకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ భారీ నిధులతో దేశవ్యాప్తంగా పలు కీలక ప్రాజెక్టులకు ఊతం లభించనుంది. ఇందులో భాగంగా పర్యావరణ అనుకూల ప్రయాణ వ్యవస్థలను ప్రోత్సహించేందుకు ఏడు హై-స్పీడ్ రైల్ కారిడార్లను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. వీటిలో ముంబై-పుణె, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు కారిడార్లు ఉన్నాయి. దీంతో పాటు తూర్పున డంకుని నుంచి పశ్చిమాన సూరత్ వరకు కొత్త ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. రాబోయే ఐదేళ్లలో 20 కొత్త జాతీయ జలమార్గాలను అందుబాటులోకి తీసుకురానున్నారు.
రంగాల వారీగా నిధుల కేటాయింపు
ఈ బడ్జెట్‌లో పలు కీలక రంగాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు.
బయోఫార్మా: బయోఫార్మా రంగంలో భారత్‌ను గ్లోబల్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ‘బయోఫార్మా శక్తి’ పథకాన్ని ప్రకటించారు. దీనికోసం రాబోయే ఐదేళ్లలో రూ.10,000 కోట్లు కేటాయించారు.
ఎంఎస్ఎంఈ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి రూ.10,000 కోట్లతో ‘ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఎలక్ట్రానిక్స్: ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ తయారీ పథకం కోసం కేటాయింపులను రూ.40,000 కోట్లకు పెంచారు.
పరిశ్రమలు: కంటైనర్ల తయారీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ఐదేళ్ల కాలానికి రూ.10,000 కోట్లు కేటాయించారు.
పర్యావరణం: కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజ్ (సీసీయూఎస్) టెక్నాలజీల కోసం రాబోయే ఐదేళ్లలో రూ.20,000 కోట్లు కేటాయించారు.
పట్టణాభివృద్ధి: నగర ఆర్థిక ప్రాంతాల (సిటీ ఎకనామిక్ రీజియన్స్) అభివృద్ధి కోసం ఒక్కో ప్రాంతానికి ఐదేళ్లలో రూ.5,000 కోట్లు కేటాయించనున్నారు.
పన్నులు, ఇతర ప్రతిపాదనలు
పన్ను చెల్లింపుదారులకు సౌలభ్యం కల్పించేందుకు పలు సంస్కరణలు ప్రతిపాదించారు. ఏప్రిల్ 2026 నుంచి ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025’ అమల్లోకి రానుంది. విదేశీ పర్యటన ప్యాకేజీలపై టీసీఎస్ రేటును 2 శాతానికి తగ్గించారు. వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసుకునే వస్తువులపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని 20% నుంచి 10%కి తగ్గించడం ద్వారా సామాన్యులకు ఊరట కల్పించారు.
క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే 17 రకాల మందులపై బేసిక్ కస్టమ్స్ సుంకాన్ని మినహాయించారు. మరోవైపు, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ని 0.02% నుంచి 0.05%కి పెంచారు. మొత్తం మీద ఈ బడ్జెట్, దీర్ఘకాలిక వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా మౌలిక వసతులు, తయారీ రంగాలపై దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.
కేంద్ర బడ్జెట్ ఎఫెక్ట్: ధరలు పెరిగేవి, తగ్గేవి
- కొన్ని రకాల ఔషధాలు, ఈవీ బ్యాటరీలు, మొబైల్స్, ట్యాబ్లెట్స్ ధరల్లో తగ్గుదల
- విదేశీ విద్య, వైద్యపరికరాలపై తగ్గనున్న భారం
- పెరగనున్న సిగరెట్, లగ్జరీ వాచ్ లు, విదేశీ మద్యం ధరలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ నిలిచారు. దేశీయ ఉత్పత్తులకు మద్దతు ఇచ్చేలా, దిగుమతులను నియంత్రించేలా, అదే సమయంలో డిమాండ్ పెంచేలా ఈ బడ్జెట్‌లో చర్యలు ప్రకటించారు. బడ్జెట్ ప్రభావంతో కొన్ని రకాల వస్తువుల ధరలు పెరగనుండగా, మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి.
కొన్ని రకాల మెడిసిన్ ధరలు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, మొబైల్స్, ట్యాబ్లెట్స్, తోలు, వస్త్ర పరిశ్రమ ఉత్పత్తుల ధరలు తగ్గే అవకాశం ఉంది.
క్యాన్సర్, డయాబెటిస్ సహా 17 రకాల ఔషధాల ధరలు తగ్గనున్నాయి. విదేశీ విద్య, వైద్య పరికరాలు, టూర్ ప్యాకేజీలపై పన్ను తగ్గింపు నేపథ్యంలో ఖర్చులో కాస్త ఊరట దక్కనుంది. సముద్ర ఆహార ప్రాసెసింగ్ ఇన్‌పుట్‌లకు సుంకం లేని దిగుమతిని ప్రస్తుత పరిమితిని మూడు రెట్లు పెంచారు.
మైక్రోవోవెన్ల తయారీలో ఉపయోగించే నిర్దిష్ట భాగాలపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో ఈ ఉత్పత్తుల ధరలు తగ్గనున్నాయి. ఈవీ బ్యాటరీలు, సోలార్ ప్యానల్స్ ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది.
ఆల్కాహాల్, సిగరెట్, పాన్ మసాలా వంటి హానికర ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. వీటిపై అధిక ఎక్సైజ్ సుంకం విధించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యక్తిగతంగా దిగుమతి చేసుకున్న కొన్ని ఉత్పత్తులపై విధించే సుంకం పెంచుతున్న నేపథ్యంలో వాటి ధరలు పెరగనున్నాయి. లగ్జరీ వాచ్ లు, విదేశీ మద్యం ధరలు పెరగనున్నాయి.
ఆదాయపు పన్నుపై ఈసారి దక్కని ఊరట
- ఆదాయపు పన్ను తగ్గింపుపై ఆశగా ఎదురు చూసిన వేతనజీవులు
- కొత్త, పాత విధానాల్లోని స్లాబుల్లో లేని మార్పు
- విధానపరమైన అంశాల్లో మాత్రమే ఊరట
కేంద్ర బడ్జెట్ అంటేనే చాలామంది, ముఖ్యంగా వేతనజీవులు ఆదాయపు పన్నులో ఊరట కోసం వేచి చూస్తుంటారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన పలు బడ్జెట్‌లలో వేతనజీవులకు భారీ ఊరట కల్పిస్తూ ప్రకటనలు చేసింది. ఈసారి కూడా ఆదాయపు పన్ను తగ్గింపుపై వేతనజీవులు ఆశగా ఎదురు చూసినప్పటికీ నిరాశ ఎదురైంది. కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబుల్లో ఎటువంటి మార్పులు లేవని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
విధానపరమైన అంశాల్లో మాత్రమే పన్ను చెల్లింపుదారులకు కాస్త ఊరట దక్కింది. ఐటీఆర్-1, ఐటీఆర్-2 ఫైలింగ్‌కు జులై 31 వరకు గడువు కల్పిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నాన్-ఆడిట్ బిజినెస్‌లు, ట్రస్టులు ఫైలింగ్‌కు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చారు. ఆదాయపు పన్ను నిబంధనలు సరళతరం చేసినట్లు వెల్లడించారు. కొత్త చట్టాన్ని అర్థం చేసుకోవడానికి పన్ను చెల్లింపుదారులకు తగినంత సమయం ఇస్తామని తెలిపారు.
ఏప్రిల్ 1 నుంచి నూతన ఆదాయపు పన్ను చట్టం
- ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేసినట్లు వెల్లడి
- ఆదాయపు పన్ను ఫారాలు సరళతరం చేసినట్లు వెల్లడి
- విదేశీ యాత్రలు, విద్య, వైద్యంపై పన్ను, టీడీఎస్ తగ్గిస్తున్నట్లు తెలిపిన ఆర్థిక మంత్రి
- విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి అన్న నిర్మలా సీతారామన్
రానున్న ఏప్రిల్ 1వ తేదీ నుంచి నూతన ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆమె లోక్‌సభలో ప్రసంగిస్తూ, సామాన్యులు కూడా ఫైల్ చేసేలా ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేసినట్లు చెప్పారు. సరళతరం చేసిన ఫారాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని ఆమె తెలిపారు.
సవరించిన పన్ను రిటర్నుల దాఖలు గడువును పెంచుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ 31తో గడువు ముగిసిందని, దీనిని మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. విదేశీ యాత్రలపై పన్ను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. అలాగే విదేశీ విద్య, వైద్యంపై టీడీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించనున్నట్లు తెలిపారు.
మానవ వనరుల సరఫరా సంస్థలపై కూడా టీడీఎస్ తగ్గించనున్నట్లు తెలిపారు. ఈ ఏజెన్సీలపై 1 లేదా 2 శాతం టీడీఎస్ వర్తిస్తుందని అన్నారు. రహదారి ప్రమాదాల పరిహారం వడ్డీపై పన్నును తొలగిస్తున్నామని అన్నారు. చిన్న మొత్తంలో పన్ను చెల్లింపులు జరిపే వారికి కూడా ప్రత్యేక పథకం తీసుకు వస్తున్నట్లు తెలిపారు.
ఇక నుంచి విదేశీ ఆస్తుల వివరాలు వెల్లడించడం తప్పనిసరి అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా స్పష్టం చేశారు. అదే సమయంలో కంపెనీల బైబ్యాక్ విధానాలకు కేంద్ర ఆర్థిక మంత్రి షాకిచ్చారు. కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 2 శాతం పన్ను విధించనున్నట్లు తెలిపారు. నాన్-కార్పొరేట్ బైబ్యాక్ కొనుగోళ్లపై 30 శాతం పన్ను విధిస్తున్నట్లు తెలిపారు.
పన్ను వివాదాల్లో క్రిమినల్ చర్యల తీవ్రతను తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇలాంటి వివాదాల్లో జైలు శిక్షను రెండేళ్లకు తగ్గిస్తున్నట్లు ప్రకటించిన ఆర్థిక మంత్రి, జరిమానా చెల్లిస్తే కనుక ఆ జైలు శిక్ష నుంచి కూడా మినహాయింపు ఉండనుందని ప్రకటించారు.