
- ముంబైలో విమానం ఎక్కేముందు పార్టీ నేతకు ఫోన్ చేసిన దాదా
- కులమత భేదం చూపకుండా అందరినీ కలుపుకుని వెళ్లాలని సూచన
- దాదా ఫోన్ కాల్ సంభాషణను బయటపెట్టిన ఎన్సీపీ నేత
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ గత నెల 28న విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం బారామతి బయలుదేరిన అజిత్ పవార్.. విమానం క్రాష్ ల్యాండ్ కావడంతో దుర్మరణం పాలయ్యారు. ముంబైలో విమానం ఎక్కే ముందు పార్టీ నేత శ్రీజిత్ పవార్ కు ఫోన్ చేశారు. ఆయన మాట్లాడిన చివరి కాల్ అదే. తాజాగా ఈ ఫోన్ కాల్ సంభాషణను శ్రీజిత్ పవార్ బయటపెట్టారు. ఐక్యత, సమానత్వం గురించే ఆయన తనకు సూచనలు చేశారని తెలిపారు.
‘‘పార్టీ వ్యవహారానికి సంబంధించి దాదా (అజిత్ పవార్)తో ఓ విషయం మాట్లాడాలని ఆ రోజు ఉదయం ఫోన్ చేశా. అయితే, నెట్ వర్క్ కవరేజ్ లేకపోవడంతో ఫోన్ కలవలేదు. దీంతో ఓ మెసేజ్ పెట్టాను. నెట్ వర్క్ కవరేజ్ ఏరియాలోకి వచ్చిన తర్వాత ఆ మెసేజ్ చూసిన దాదా వెంటనే నాకు ఫోన్ చేశారు. పార్టీలో ఎలాంటి అసమానతలకు, వివక్షకు చోటు లేదని స్పష్టంగా చెబుతూ.. అన్ని కులాలను, మతాలను కలుపుకుని వెళ్లాలని దాదా నాకు సూచించారు. మహారాష్ట్ర గురించి, రాష్ట్ర ప్రజల గురించి దాదా ఆలోచనలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేనీ సంభాషణకు సంబంధించిన ఆడియోను విడుదల చేస్తున్నా” అంటూ శ్రీజిత్ పవార్ తెలిపారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: