- భారత్‌లో తనను ఆశ్చర్యపరిచిన పది విషయాలపై విదేశీ యువతి మియా పోస్ట్
- ఇక్కడి ప్రజలు ఇంగ్లిష్ మాట్లాడే తీరు అద్భుతమని ప్రశంస
- మారుమూల ప్రాంతాల్లోనూ ఉబెర్ సేవలు అందుబాటులో ఉండటంపై ఆశ్చర్యం
- దేశవ్యాప్తంగా భారతీయ పర్యాటకులు ఎక్కువగా కనిపించడం ఊహించలేదన్న మియా
- చివరకు తాను ఇండియా ప్రేమలో పడిపోయానని వెల్లడి
భారత పర్యటనకు వచ్చిన ఓ విదేశీ యువతి, ఇక్కడి పరిస్థితులు, ప్రజల గురించి తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకోగా అది ఇప్పుడు వైరల్‌గా మారింది. “ఇండియా నుంచి నేను ఊహించని 10 విషయాలు” అనే టైటిల్‌తో మియా అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తోంది. గోవాలో యోగా క్లాస్ ముగించుకున్న తర్వాత బీచ్ పక్కన ఈ వీడియో చేసినట్టు ఆమె పేర్కొంది. ఈ దేశం తనను ఎంతగానో ఆకట్టుకుందని, చివరికి ఇండియా ప్రేమలో పడిపోయానని ఆమె చెప్పింది.
మియా తన పోస్ట్‌లో పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించింది. ముఖ్యంగా దేశంలోని వివిధ ప్రాంతాలను చుట్టివస్తున్న భారతీయ పర్యాటకుల సంఖ్యను చూసి తాను ఆశ్చర్యపోయానని చెప్పింది. తాను గతంలో పర్యటించిన దేశాల్లో ఈ పరిస్థితి చూడలేదని, మొదట్లో హాస్టళ్లలో తాము మాత్రమే విదేశీయులుగా ఉండటం వింతగా అనిపించినా, వెంటనే మంచి భారతీయ స్నేహితులు దొరికారని మియా వివరించింది. వారితో కలిసి వారం రోజులకు పైగా ప్రయాణించామని తెలిపింది.
అలాగే, భారతీయుల ఇంగ్లిష్ భాషా నైపుణ్యం తనను అబ్బురపరిచిందని మియా పేర్కొంది. “ఇక్కడి వారు చాలా స్పష్టంగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. స్లాంగ్ కూడా ఉపయోగిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పాఠశాలల్లో ఇంగ్లిష్ బోధించడం, సోషల్ మీడియా ప్రభావం ఇందుకు కారణమై ఉండొచ్చు” అని ఆమె అభిప్రాయపడింది. దీనివల్ల స్థానికులతో సులభంగా కలిసిపోగలిగానని చెప్పింది.
ఇక, ఆధునిక సదుపాయాల గురించి మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో కూడా ఉబెర్ వంటి క్యాబ్ సేవలు అందుబాటులో ఉండటం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని మియా తెలిపింది. డెలివరీ యాప్‌లు కూడా చాలా సులభంగా ఉన్నాయంది. ప్రతి రెస్టారెంట్‌లో చేతులు కడుక్కోవడానికి సింక్‌లు, సబ్బులు ఉండటం కూడా ఊహించని విషయమని ఆమె పేర్కొంది. దేశవ్యాప్తంగా చైనీస్, ఇజ్రాయెల్ వంటకాలు సులభంగా దొరికాయని, రుచికరమైన షక్షుకా, హమ్మస్ వంటివి కూడా తిన్నానని చెప్పింది.
అయితే, కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని మియా సూచించింది. నకిలీ పనీర్, నీటి విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అలాగే రైళ్లలో ప్రయాణించాలంటే టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవాలని, సీట్లు త్వరగా నిండిపోతాయని తెలిపింది. చివరగా “నేను ఇండియా ప్రేమలో పడతానని నాకు ముందే తెలుసు” అంటూ తన పోస్ట్‌ను ముగించడం విశేషం.