జాతీయ వార్తలు

మనిషి కాలుతో కుక్క సంచారం.. విచారణలో తేలిన షాకింగ్ నిజాలు!

  • సిమ్లాలో మనిషి కాలు నోట కరుచుకుని తిరుగుతున్న కుక్క వీడియో కలకలం
  • ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగినట్టు విచారణలో వెల్లడి
  • ఆపరేషన్‌లో తొలగించిన కాలును స్టోర్ రూమ్‌లో ఉంచి తాళం వేయని సిబ్బంది
  • ఈ ఘటనపై శానిటేషన్ సూపర్‌వైజర్, సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ

సిమ్లాలో ఓ వీధికుక్క మనిషి కాలును నోట కరుచుకుని తిరుగుతున్న షాకింగ్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు జరిపిన విచారణలో ఆసుపత్రి సిబ్బంది ఘోర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. వైద్య వ్యర్థాల నిర్వహణలో జరిగిన తీవ్రమైన తప్పిదం వల్లే ఈ దారుణం చోటుచేసుకున్నట్లు తేలింది.

వివరాల్లోకి వెళితే.. సిమ్లాలోని చమియానాలో ఉన్న అటల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రిలో గత గురువారం అత్తర్ సింగ్ (61) అనే వ్యక్తికి శస్త్రచికిత్స చేసి కాలును తొలగించారు. ఆ కాలును ఒక కవర్‌లో ఉంచి ఆసుపత్రిలోని స్టోర్ రూమ్‌లో పెట్టారు. దానిని నిబంధనల ప్రకారం డిస్పోజ్ చేయాలని శానిటేషన్ ఏజెన్సీకి సూచించారు.

అయితే, ఈ నెల 22న‌ సిబ్బంది ఆ స్టోర్ రూమ్‌కు తాళం వేయడం మర్చిపోయారు. దీంతో లోపలికి ప్రవేశించిన ఓ వీధికుక్క, అక్కడ ఉన్న కాలును నోట కరుచుకుని బయటకు వెళ్లిపోయింది. ఆసుపత్రి పరిసరాల్లో కుక్క మనిషి కాలుతో తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

విచారణలో సిబ్బంది నిర్లక్ష్యం నిజమని తేలడంతో ఆసుపత్రి యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు బాధ్యులుగా భావిస్తూ శానిటేషన్ సూపర్‌వైజర్‌తో పాటు ఇతర సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Related posts

56 ఏళ్లక్రితం కూలిన ఎయిర్‌ఫోర్స్ విమానం.. ఇప్పుడు లభ్యమైన 4 మృతదేహాలు!

Ram Narayana

కుంభమేళాలో పడవలు నడిపి రూ. 30 కోట్లు సంపాదించిన కుటుంబం!

Ram Narayana

బాప్‌రే బాప్.. మహా కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ కి ఇంత భారీ ఆదాయ‌మా…!

Ram Narayana