- ఇజ్రాయెల్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
- విమానాశ్రయంలో మోదీకి స్వాగతం పలికిన నెతన్యాహు
- పలు రంగాల్లో కీలక ఒప్పందాలు చేసుకోనున్న భారత్-ఇజ్రాయెల్
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. టెల్ అవీవ్‌లోని బెన్-గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మోదీకి ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా విచ్చేసి, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి ఘనస్వాగతం పలికారు. 2017లో తొలిసారి ఇజ్రాయెల్‌లో పర్యటించిన మోదీ, మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఆ దేశ గడ్డపై అడుగుపెట్టడం ఇరు దేశాల మధ్య బలపడుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి నిదర్శనంగా నిలిచింది.
ఈ పర్యటనలో అత్యంత కీలకమైన ఘట్టం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగించనుండటం. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించబోతున్న మొట్టమొదటి భారత ప్రధానిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని నెస్సెట్ భవనాన్ని భారత త్రివర్ణ పతాక వర్ణాలతో అలంకరించడం విశేషం. ఈ గౌరవం ప్రపంచంలోని అతికొద్ది మంది నేతలకు మాత్రమే దక్కుతుంది.
పర్యటనలో భాగంగా ఇరువురు నేతలు పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. రేపు జరగనున్న ఉన్నత స్థాయి సమావేశంలో ఆర్థిక, భద్రత, రక్షణ, సాంకేతికత, వ్యవసాయ రంగాల్లో కీలక ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. ముఖ్యంగా రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికత బదిలీపై చర్చలు జరగనున్నాయి.
మరోవైపు, మోదీ రాకను పురస్కరించుకుని ఇజ్రాయెల్ మీడియా ‘నమస్తే.. షాలోమ్’ అంటూ ఫ్రంట్ పేజీ కథనాలతో స్వాగతం పలికింది. “మోదీ, నెతన్యాహుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహం కేవలం ఇద్దరు నేతల మధ్య సంబంధం మాత్రమే కాదు, ఇది రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య ఉన్న దృఢమైన బంధం” అని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం పేర్కొంది. పర్యటనలో భాగంగా మోదీ ప్రవాస భారతీయులతో కూడా సమావేశమై, వారితో సంభాషించనున్నారు.