- తన అనుచరులతో కలిసి లొంగిపోవాలనుకున్న అన్వేష్ అలియాస్ రేణు
- ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మరో నేత సుక్రు
- కుళ్లిపోయిన స్థితిలో అన్వేష్ మృతదేహం లభ్యం
ఒడిశా అడవుల్లో మావోయిస్టుల మధ్య చెలరేగిన అంతర్గత విభేదాలు ఒక కీలక నేత ప్రాణాలను బలిగొన్నాయి. తుపాకీ పట్టి విప్లవం బాటలో నడిచిన ఒక మావో కీలక నేత జనజీవన స్రవంతిలో కలిసేందుకు సిద్ధమవడమే ఆయన మరణానికి శాపమైంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు నాయకుడు అన్వేష్ అలియాస్ రేణు, తన అనుచరులతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయేందుకు సిద్ధమవగా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నేత సుక్రు అతడిని అత్యంత దారుణంగా హతమార్చాడు. జనవరి 29న జరిగిన ఈ అడవి రక్తపాతం, పకారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అన్వేష్ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం… అన్వేష్ తలపై రూ. 22 లక్షల భారీ రివార్డు ఉంది. సుదీర్ఘ కాలం అజ్ఞాతంలో గడిపిన ఆయన, ఇటీవల తనతో పాటు మరికొందరు కమాండర్లను కలుపుకుని పోలీసులకు లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడు. అయితే, ఈ ప్రతిపాదనను మరో మావోయిస్టు నేత సుక్రుతో పాటు అతడి ప్రధాన అనుచరులు సిలా, జగేష్‌లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే దళం లోపల చెలరేగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానలా మారి, అన్వేష్ హత్యకు దారితీసింది. దారింగ్‌బాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో దొరికిన మృతదేహం ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.
ఈ ఘటన మావోయిస్టు కేడర్‌లో నెలకొన్న తీవ్ర అసహనాన్ని, అంతర్గత విభేదాలను బట్టబయలు చేసింది. లొంగుబాటు నిర్ణయాలు తీసుకునే వారిని సొంత దళ సభ్యులే శత్రువులుగా చూస్తున్నారని ఈ ఉదంతం నిరూపిస్తోంది. ఇదిలా ఉండగా, అన్వేష్ హత్యలో పాలుపంచుకున్నట్లు భావిస్తున్న జగేష్ అనే మావోయిస్టు, ఇటీవల కంధమాల్ జిల్లాలో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు.