వెలుగుమట్ల బాధితులతో మంత్రి పొంగులేటి ముఖాముఖీ ..
వెలుగుమట్ల బాధితులతో మంత్రి పొంగులేటి ముఖాముఖీ ..
మీ కన్నీరు తుడిచే బాధ్యత నాదంటూ భాదితులకు మంత్రి భరోసా
15లోపు పట్టాలిస్తాం.. ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని హామీ
వెలుగుమట్ల నిర్వాసితులకు మంత్రి పొంగులేటి అభయం
దళారుల ‘దగా’పై ఉక్కుపాదం.. బాధితులకు ‘సర్కారు’ దన్ను
పదేళ్లు కళ్లు మూసుకుని.. ఇప్పుడొచ్చి ముసలి కన్నీరా?
ప్రతిపక్షాలపై మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి ధ్వజం

అప్పులు చేసి నిర్మించుకున్న ఆశల గూడు కూలిపోయిందని ఆవేదన చెందకండి.. ఈ ప్రభుత్వం మీది. మీ కన్నీరు తుడిచే బాధ్యత నాది. అర్హులైన ప్రతి పేదవాడికి ఈ నెల 15వ తేదీలోపు ఇళ్ల స్థలాల పట్టాలతో పాటు రూ. 5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెలుగుమట్ల బాధితులకు భరోసానిచ్చారు. ఆదివారం ఖమ్మం ఐడిఒసి వేదికగా జరిగిన బాధితుల ముఖాముఖిలో మంత్రి వారి కష్టాలను స్వయంగా విని చలించిపోయారు.
దళారుల నుంచి డబ్బులు వసూలు చేయించి ఇస్తామని హామీ
వెలుగుమట్ల భూదాన్ భూముల్లో కొన్నేళ్లుగా దళారుల ఉచ్చులో చిక్కి, నిరుపేదలు అనుభవిస్తున్న నరకయాతన మంత్రి ఎదుట వెలుగుచూసింది. తక్కువ ధరకే స్థలం వస్తుందని నమ్మి, రెక్కాడితే గానీ డొక్కాడని తాము రూ. 30 వేల నుంచి రూ. 8 లక్షల వరకు అప్పులు చేసి దళారులకు చెల్లించామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తీరా ఇల్లు కట్టుకున్నాక అధికారులు వచ్చి కూల్చేయడంతో తామంతా దిక్కుతోచని స్థితిలో పడ్డామన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి ఒక్క పైసా కూడా ఎవరికీ లంచం ఇవ్వాల్సిన పనిలేదని, పేదల రక్తం తాగిన ఆ దళారుల నుంచి డబ్బును రికవరీ చేయిస్తామని బాధితులకు గట్టి హామీ ఇచ్చారు.
చీకటి బతుకుల నుంచి వెలుగు కాలనీల వైపు
గత 9 నెలలుగా కరెంటు, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు లేక చీకట్లో మగ్గుతున్నామని బాధితులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి… కేవలం ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడమే కాకుండా, కొత్తగా నిర్మించే కాలనీల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, డ్రైనేజీతో పాటు అంగన్వాడీ, పాఠశాలలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని వివరించారు. నియోజకవర్గాల వారిగా బాధితులను గుర్తించి, వారి వారి ప్రాంతాల్లోనే గౌరవప్రదమైన పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు.
రాజకీయ శవాల మీద చిల్లర ఏరుకోవద్దు
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… బాధితుల సానుభూతి కోసం పాకులాడుతున్న ప్రతిపక్ష నేతలపై మంత్రి పొంగులేటి నిప్పులు చెరిగారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఈ పేదలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు. అధికారం పోగానే షెడ్ల కింద కూర్చుని డ్రామాలు ఆడుతున్నారని, రాజకీయాల కోసం పేదలను కవచంలా వాడుకోవడం మూర్ఖత్వమని మండిపడ్డారు. మీ పార్టీ ఏదైనా సరే.. మీరు నిజమైన పేదలైతే ఈ ప్రభుత్వం మీకు ఇల్లు ఇచ్చి తీరుతుందని, రాజకీయాలకు అతీతంగా పారదర్శకమైన సర్వే ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని ప్రకటించారు.
అర్హులకే పట్టా.. మార్చి 15 ‘డెడ్ లైన్
గతంలో లబ్ధి పొందిన వారిని ఏరివేసి, కేవలం నిరుపేదలకే న్యాయం జరిగేలా సమగ్ర సర్వే నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 15వ తేదీన తానే స్వయంగా వచ్చి అర్హులైన కుటుంబాలకు ఇళ్ల స్థలాల పట్టాలు, ఇందిరమ్మ ఇళ్ల ఆర్డర్లు అందజేస్తానని మంత్రి భరోసా ఇచ్చారు. అధికారులే నేరుగా బాధితుల వద్దకు వస్తారని, మరోమారు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మట్టా దయానంద్ తదితరులు పాల్గొన్నారు.
వెలుగుమట్ల భూదాన్ భూములలో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయానికి గురైన అర్హులైన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా కల్పించారు. కలెక్టరేట్ లో వెలుగుమట్ల బాధితులతో చర్చించి, జిల్లా కలెక్టర్ అనుదీప్ , సిపి సునీల్ దత్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేసినట్లు తమకు సమాచారం వచ్చిందని, బాధితులు ఎవరికైనా డబ్బులు ఇస్తే తమకు సమాచారం అందించాలని అన్నారు. వెలుగుమట్ల భూదాన్ బాధితులలో అర్హులైన పేదలకు వారి సొంత ప్రాంతంలో ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని మంత్రి భాదితులకు హామీ ఇచ్చారు ..
వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుతున్నారని, తాము ఈ అంశాన్ని కేవలం పేదల కోణంలోనే చూస్తున్నట్లు తెలిపారు. పేదలకు ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్యాయం జరిగే ప్రసక్తే ఉండదన్నారు. వెలుగుమట్ల ప్రభుత్వ భూదాన్ భూముల ఆక్రమణలో తప్పు ఒకరు చేస్తే, శిక్ష మరొకరికి వచ్చినట్లు కొంతమంది బాధితులు తెలియక అక్కడ ఇండ్ల పట్టాలు పొందామనే భ్రమలో ఇండ్లు కట్టుకున్నారని మంత్రి అన్నారు.
వెలుగుమట్ల సంఘటనలో బాధితులు ఎప్పటినుంచి ఇక్కడ ఉంటున్నారు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అధికారులతో క్షుణ్ణంగా విచారణ చేయించి నిరుపేదలకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని అన్నారు. వెలుగుమట్ల భూదాన్ భూములలో కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఇందిరమ్మ ఇళ్లు తీసుకున్నవాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోందని, అటువంటి వారికి కాకుండా మిగిలిన అర్హులైన పేదలందరికీ ఖమ్మం పరిసర ప్రాంతాల్లో, సంబంధిత బాధితుల సొంత ప్రాంతాల్లో ఇంటి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని అన్నారు.
బాధితులు వెలుగుమట్ల ఇంటి స్థలం కోసం ఎవరికి డబ్బులు ఇచ్చారో నిర్భయంగా పోలీసు అధికారులకు చెప్పాలని, ఆ డబ్బులు కూడా బాధితులకు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. వెలుగుమట్ల బాధితులకు ఇచ్చే ఇండ్ల దగ్గర అంగన్వాడీ కేంద్రం, పాఠశాల, త్రాగు నీరు, విద్యుత్ సౌకర్యం, మౌళిక వసతులు కల్పిస్తామని అన్నారు. పేద ప్రజల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, గత పాలకులు వెలుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేయని కారణంగానే నేడు కూల్చివేతలు జరిగాయని మంత్రి అన్నారు. ప్రతి అంశాన్ని రెచ్చగొట్టే ధోరణితో చూడవద్దని తెలిపారు.