- తిరుపతి అలిపిరిలో వాకర్స్ నిరసన
- దివ్యరామంలో ప్రవేశ రుసుము వసూలుపై ఆందోళన
- కిలోమీటరు మేర నిలిచిపోయిన తిరుమల వాహనాలు
తిరుపతి నగరంలోని అలిపిరి మార్గంలో ఈరోజు ఉదయం వాకర్లు ఆందోళనకు దిగారు. కపిలతీర్థం నుంచి అలిపిరి వెళ్లే ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించడంతో తిరుమల వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సుమారు కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అలిపిరి సమీపంలోని దివ్యరామంలో ఉన్న నగరవనంలో వాకింగ్ చేసేందుకు నెలకి రూ.100 ప్రవేశ రుసుము చెల్లించాలని అటవీశాఖ అధికారులు కొత్త నిబంధన విధించారు. ఈరోజు ఉదయం రుసుము చెల్లించని వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆగ్రహానికి గురైన వాకర్లు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. డీఎఫ్‌ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనకు వాకర్స్‌లోని సీపీఎం నేతలు నాయకత్వం వహించారు.
తిరుమల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో వాహనాల్లోని భక్తులు, ప్రయాణికులు వాకర్ల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అలిపిరి సీఐ రామకిశోర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపి వారికి నచ్చజెప్పడంతో వాకర్లు తమ నిరసనను విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.