జాతీయ వార్తలు

వాణిజ్య గ్యాస్ కటకట.. మూసివేత దిశగా హోటళ్లు…రంగంలోకి కేంద్రం…

  • ప్రధాన నగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల తీవ్ర కొరత
  • మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం కారణంగా సరఫరాలో అంతరాయాలు
  • మూసివేత అంచున బెంగళూరు, చెన్నై, ముంబై హోటళ్లు
  • ప్రభుత్వ హామీకి, క్షేత్రస్థాయికి పొంతన లేదంటున్న సంఘాలు
  • సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం

 మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత హోటల్, రెస్టారెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతల కారణంగా కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడటంతో, దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య వంట గ్యాస్ (LPG) సిలిండర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లోని హోటళ్లు మూసివేత అంచుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని, ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కర్మాగారాలను ఆదేశించింది.

నగరాల్లో తీవ్రమైన ప్రభావం
గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇవాళ్టి నుంచి నగరవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. “హోటల్ పరిశ్రమ అత్యవసర సేవల కిందకు వస్తుంది. రోజువారీ భోజనం కోసం హోటళ్లపై ఆధారపడే సామాన్యులు, విద్యార్థులు, వైద్య నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు” అని ఆ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. 70 రోజుల పాటు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా చేస్తామని చమురు కంపెనీలు హామీ ఇచ్చి, ఇప్పుడు ఉన్న‌ట్టుండి నిలిపివేయడం పరిశ్రమకు పెద్ద దెబ్బ అని పేర్కొంది. అయితే, “చివరి బొట్టు గ్యాస్ ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం” అని అసోసియేషన్ అధ్యక్షుడు పీసీ రావు స్పష్టం చేశారు.

చెన్నైలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఆసుపత్రులు, ఐటీ పార్కులు, హాస్టళ్లు, ప్రయాణికులకు 24 గంటలూ ఆహారం అందించే పరిశ్రమకు గ్యాస్ సరఫరా నిలిచిపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెన్నై హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. రవి ప్రధాని మోదీకి లేఖ రాశారు. ముంబైలో ఇప్పటికే దాదాపు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు కార్యకలాపాలు నిలిపివేశాయి. దాదర్, అంధేరి, మాతుంగ వంటి ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు తమ మెనూలను కుదించాయి. రవ్వ దోస, దాల్ మఖనీ వంటి ఎక్కువ సమయం ఉడికించాల్సిన వంటకాలను నిలిపివేస్తున్నాయి.

జాతీయ సంఘాల ఆందోళన
దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (FHRAI), నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు లేవని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉందని, ఈ నెల 5 నాటి ప్రభుత్వ ఉత్తర్వులను చూపుతూ డిస్ట్రిబ్యూటర్లు సరఫరా నిలిపివేస్తున్నారని ఎఫ్‌హెచ్ఆర్ఏఐ కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి రాసిన లేఖలో పేర్కొంది. దీనిపై తక్షణమే స్పష్టత ఇవ్వాలని, సరఫరాను పునరుద్ధరించాలని కోరింది.

ప్రభుత్వ స్పందన.. చర్యలు
పరిశ్రమల నుంచి వస్తున్న ఒత్తిడి నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని, అదనపు ఉత్పత్తిని గృహ అవసరాలకు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. నల్ల బజారును, నిల్వలను అరికట్టేందుకు సిలిండర్ల మధ్య 25 రోజుల బుకింగ్ వ్యవధిని ప్రవేశపెట్టింది. దిగుమతి చేసుకున్న వాణిజ్య గ్యాస్‌ను ఆసుపత్రులు, విద్యాసంస్థల వంటి అత్యవసర రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే అభ్యర్థనలను సమీక్షించడానికి మూడు చమురు మార్కెటింగ్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

ఇదిలా ఉంటే.. గత శనివారం వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 115 పెరిగింది. అయితే, ముడిచమురు ధర బ్యారెల్‌కు 130 డాలర్లు దాటితే తప్ప దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. భారత్ సురక్షితమైన స్థితిలోనే ఉందని, ఇంధన దిగుమతులు సజావుగానే సాగుతున్నాయని మంత్రి హర్దీప్ సింగ్ పురి గత వారం హామీ ఇచ్చారు.

గ్యాస్ సంక్షోభం.. ‘ఎస్మా’ ప్రయోగించిన కేంద్రం

ESMA Act imposed due to gas cylinder shortage
  • గృహ అవసరాలకే తొలి ప్రాధాన్యమని వెల్లడి
  • హోటళ్లకు షాక్ ఇస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
  • దేశవ్యాప్తంగా పలు నగరాల్లో మూతపడనున్న హోటళ్లు!

దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా కమర్షియల్ ఎల్‌పీజీ కొరత ఏర్పడింది. దీంతో వంట గ్యాస్ క్రమబద్ధమైన సరఫరాను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నిత్యావసర వస్తువుల చట్టం’ (ఎస్మా)ను ప్రయోగించింది. పశ్చిమాసియాలోని కీలక ఇంధన రవాణా మార్గాల్లో తలెత్తిన ఆటంకాల ఫలితంగా.. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని హాస్పిటాలిటీ రంగం ఇప్పుడు అకస్మాత్తుగా కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరతను ఎదుర్కొంటోంది. సరఫరా పునరుద్ధరించకపోతే కొన్ని రోజుల్లోనే హోటళ్లు మూతపడవచ్చని రెస్టారెంట్ అసోసియేషన్లు హెచ్చరిస్తున్నాయి.

ఏమిటీ ‘ఎస్మా’ ఆర్డర్?
పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. దేశంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీలపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. రిఫైనరీల్లో ఉత్పత్తి అయ్యే ప్రొపేన్, బ్యూటేన్ గ్యాస్ నిల్వలను కేవలం వంట గ్యాస్ తయారీకే వాడాలని, పెట్రోకెమికల్స్ తయారీకి మళ్లించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఉత్పత్తి అయిన మొత్తం గ్యాస్‌ను కేవలం ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ లకు మాత్రమే విక్రయించాలని స్పష్టం చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే ఎస్మా చట్టం కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

హోటళ్లు, రెస్టారెంట్లపై ‘సిలిండర్’ బాంబు!
గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తూ కమర్షియల్ గ్యాస్ సరఫరాపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీనివల్ల బెంగళూరు, చెన్నై, ముంబై వంటి నగరాల్లో కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో వందలాది హోటళ్లు మూతపడే స్థితికి చేరుకున్నాయి. దీంతో హోటళ్లను కూడా అత్యవసర సేవలుగా గుర్తించి గ్యాస్ సరఫరాను పునరుద్ధరించాలని హోటళ్ల అసోసియేషన్ వారు కోరుతున్నారు. దీనికి తోడు మార్చి 7 నుంచి గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ.60, కమర్షియల్ సిలిండర్ ధర రూ.115 పెరగడం గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది.

హర్దీప్ పూరీ భరోసా..
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ.. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి కాకుండా, అమెరికా నుంచి దాదాపు 2.2 మిలియన్ టన్నుల గ్యాస్‌ను దిగుమతి చేసుకునేందుకు చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని, ఆ నిల్వలు ఇప్పటికే రావడం ప్రారంభించాయని ఆయన వెల్లడించారు.

ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్… బెంగళూరు తర్వాత ముంబైలో 20 శాతం హోటళ్లు బంద్

Iran War impact 20 percent Mumbai hotels closed after Bangalore
  • వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబైలో హోటళ్లు బంద్
  • రాబోయే రెండు రోజుల్లో నగరంలో సగం హోటళ్లు మూతపడే అవకాశం
  • ఢిల్లీ, బెంగళూరులలోను తాత్కాలికంగా హోటళ్లు బంద్

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం నిత్యావసర వస్తువులపై భారీగా పడుతోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండటం లేదంటూ బెంగళూరులో హోటల్స్ అసోసియేషన్ ఈరోజు నుంచి రెస్టారెంట్లు, హోటళ్లను మూసివేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబైలో కూడా 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి.

ఈ మేరకు ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలో సగం హోటళ్లు మూతపడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వాణిజ్య సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీ, బెంగళూరు సహా వివిధ నగరాల్లో పలు హోటళ్లను తాత్కాలికంగా మూసివేశారు. సిలిండర్ల కొరత కారణంగా తమ వ్యాపారం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గ్యాస్ సిలిండర్ల కొరత వల్ల కొన్ని ప్రాంతాల్లో బ్లాక్‌లో విక్రయాలు జరుగుతున్నాయి. బ్లాక్‌లో విక్రయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని ప్రస్తుతం ఉన్న 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వాణిజ్య సిలిండర్ల సరఫరాను సమీక్షించేందుకు చమురు మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

తెలుగు రాష్ట్రాలపై యుద్ధ ప్రభావం.. తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం

Telangana Hotels Association Meeting on War Impact Gas Shortage
  • కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల నిలిపివేతపై హోటల్ యజమానుల ఆందోళన
  • ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం చూపించాలన్న తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
  • వాణిజ్య సిలిండర్ల కొరత ఉందన్న విశాఖ హోటల్ మర్చంట్ సంఘం

గ్యాస్ కొరత తెలుగు రాష్ట్రాలలోని హోటల్ పరిశ్రమపై కూడా పడింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీలలో పలు హోటళ్లు తాత్కాలికంగా మూతబడిన విషయం తెలిసిందే. వాణిజ్య గ్యాస్ సిలిండర్ కొరత ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని హోటళ్లపై కూడా పడింది. హోటళ్లకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిపివేయాలని డీలర్లను పెట్రోలియం కంపెనీలు ఆదేశించాయి. దీనితో హోటల్, రెస్టారెంట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు.

కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయడంతో తమ వ్యాపారానికి గండిపడిందని తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు ప్రత్యామ్నాయాలు చూపించకపోతే రాష్ట్రవ్యాప్తంగా హోటళ్ల బంద్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సికింద్రాబాద్‌లో తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. గ్యాస్ కొరతతో వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాణిజ్య సిలిండర్ల కొరత తీవ్రంగా ఉందని విశాఖ హోటల్ మర్చంట్ సంఘం అధ్యక్షుడు బాలకృష్ణ తెలిపారు. సిలిండర్ల సరఫరా రేపటి నుంచి మరింత తగ్గవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఇప్పటి వరకు బ్లాక్ మార్కెట్ నడుస్తోందని, పరిస్థితి ఇలాగే ఉంటే నిర్వహణ కష్టంగా మారుతుందని అన్నారు. వాణిజ్య సిలిండర్ల కొరతపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. గ్యాస్ కొరత లేకుండా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చూడాలని కోరారు.

ఇరాన్, అమెరికా యుద్ధంతో గ్యాస్ కొరత… హోటళ్లలో ఆ టిఫిన్లకు గుడ్‌బై

Iran US Conflict Leads to Gas Shortage Hotels Say Goodbye to Some Breakfasts
  • అధిక గ్యాస్ అవసరమయ్యే దోశ, వడ వంటి ఫలహారాలు తాత్కాలికంగా నిలిపివేత
  • తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హోటల్ నోటీసు బోర్డుల్లో ప్రత్యక్షం
  • దోశకు బదులు శాండ్ విచ్ అందిస్తున్న హోటల్స్

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్ కొరత ఏర్పడి బెంగళూరు, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో హోటళ్లు తాత్కాలికంగా మూతపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్ల సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. దీంతో ఆయా నగరాల్లో రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడుతున్నాయి.

సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్, రెస్టారెంట్ల యాజమాన్యాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్యాస్ ఎక్కువగా అవసరమయ్యే ఫలహారాలను తమ మెనూ జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఉదాహరణకు దోశ, మైసూర్ బజ్జీ, వడ వంటి వాటిని మెనూ నుంచి తొలగిస్తున్నారు. వాటికి బదులు శాండ్ విచ్ వంటి ఆహార పదార్థాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓవెన్‌తో అందించే ఫలహారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా మెనూలో మార్పులు చేస్తున్నామని హోటల్స్, రెస్టారెంట్ల యజమానులు చెబుతున్నారు. దోశ, వడ వంటి పదార్థాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. అధిక గ్యాస్ వినియోగమయ్యే ఫలహారాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు నోటీసు బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.

వంటగ్యాస్ ఆందోళన… ప్రధాని మోదీ కీలక సమీక్ష

Narendra Modi Holds Key Meeting on Cooking Gas Crisis
  • 10 శాతం మేర ఉత్పత్తి పెంచాలని ఇంధన ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు
  • భారత రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయన్న కేంద్రం
  • దేశానికి 70 శాతం ఉత్పత్తులు ఇతర మార్గాల్లో వస్తున్నాయన్న కేంద్రం

వంటగ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంటగ్యాస్‌ను బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 10 శాతం మేర ఉత్పత్తిని పెంచాలని ఇంధన ఉత్పత్తి కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఇంధన ఉత్పత్తిపై ఆందోళనలు రేకెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించారు.

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఎల్పీజీ నిల్వలు, సరఫరాపై సమీక్ష జరిపారు.

కాగా ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కేంద్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. కమర్షియల్ ఎల్పీజీ వాస్తవ అవసరాలను గ్యాస్ కంపెనీలు అందుకోవాల్సిందేనని ఇంధన కంపెనీలకు స్పష్టం చేసింది.

ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో కొంత సంక్షోభం వాస్తవమే కానీ పెట్రోలియం ఉత్పత్తుల ప్రస్తుతానికి ఇబ్బంది లేదని కేంద్రం తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధానికి ముందు తరహాలోనే భారత రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అన్నారు. దేశానికి వచ్చే 70 శాతం ఉత్పత్తులు హోర్ముజ్ జలసంధి నుంచి కాకుండా ఇతర మార్గాల్లో వస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

Related posts

యూపీలో బీజేపీ మహిళా కార్యకర్తల ఫైటింగ్.. వీడియో ఇదిగో!

Ram Narayana

‘డిజిటల్ అరెస్ట్’ భయంతో యువకుడి ఆత్మహత్య?

Ram Narayana

మహా కుంభమేళాకు 50 కోట్లు దాటిన భక్తులు… ఆ ఒక్కరోజే 8 కోట్ల భక్తుల పుణ్యస్నానాలు!

Ram Narayana