తెలంగాణ వార్తలు

వాహన రిజిస్ట్రేషన్‌లో కొత్త రూల్.. ఇక అంతా ఆన్‌లైనే!

కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తెలంగాణ రవాణా శాఖ కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. షోరూమ్ డీలర్లు ‘హ్యాండ్లింగ్ ఛార్జీల’ పేరుతో చేస్తున్న అదనపు వసూళ్లకు అడ్డుకట్ట వేసేందుకు మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ చేసింది. ఇకపై వాహన రిజిస్ట్రేషన్ కోసం ఎలాంటి పత్రాలను భౌతికంగా ఆర్‌టీఏ కార్యాలయాల్లో సమర్పించాల్సిన అవసరం లేదని, అంతా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయాలని రవాణా శాఖ కమిషనర్ కె. ఇలంబరిది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త నిబంధనలు శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి.

ఇప్పటివరకు వాహన కొనుగోలుదారుల నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో డీలర్లు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. బైక్‌లకు రూ.1000, కార్లకు రూ.5000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు క్షేత్రస్థాయి విచారణలో తేలింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం ఎక్స్-షోరూమ్ ధర మినహా ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో, అక్రమాలకు తావులేని పారదర్శక విధానాన్ని తీసుకువచ్చారు.

కొత్త విధానం ప్రకారం వాహన యజమాని సంతకాలతో కూడిన ఫారం-20 సహా అన్ని పత్రాలను డీలర్లు తమ లాగిన్ల ద్వారా స్కాన్ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. మార్చి 13 నుంచి తాత్కాలిక రిజిస్ట్రేషన్ (TR) పొందిన వాహనాలకు సంబంధించిన భౌతిక పత్రాలను ఆర్‌టీఏ కార్యాలయాలు స్వీకరించవు. ఈ మార్పుల వల్ల వాహనదారులు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించిన వెంటనే షోరూమ్‌లోనే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (HSNP) అమర్చే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది.

Related posts

మార్చి 31న పని చేయనున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు!

Ram Narayana

విశ్వనగరం హైద్రాబాద్ లో ఆసియా లోనే పెద్దదైన “సింధు హాస్పిటల్స్”…పార్థసారధిరెడ్డి

Ram Narayana

ఉత్తర తెలంగాణలో స్వల్ప భూకంపం

Ram Narayana