ఏపీ హైకోర్టు వార్తలు

చంద్రబాబుపై రాళ్ల దాడి కేసు: నలుగురి బెయిల్ రద్దు, వైసీపీ ఎమ్మెల్సీకి ముందస్తు బెయిల్…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆయన కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడి కేసులో హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులోని మొదటి నలుగురు నిందితులకు గతంలో నందిగామ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. తీర్పు కాపీ అందిన వారం రోజుల్లోగా సంబంధిత మేజిస్ట్రేట్ ముందు లొంగిపోవాలని నిందితులను ఆదేశించింది. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, ఆయన సోదరుడు జగన్మోహనరావుతో పాటు మరికొందరికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

2022 నవంబర్ 5న కృష్ణా జిల్లా నందిగామలో ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటిస్తుండగా, ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుసూధనరావు గాయపడ్డారు. ఆయన ఫిర్యాదు మేరకు నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ ఘటనపై ప్రత్యేక బృందాలతో లోతుగా దర్యాప్తు చేపట్టారు. చంద్రబాబును హత్య చేసేందుకే ప్రణాళికతో దాడి చేశారని తేల్చిన పోలీసులు, కేసులో హత్యాయత్నం (IPC 307), నేరపూరిత కుట్ర (IPC 120B) వంటి సెక్షన్లను చేర్చారు.

కింది కోర్టు తీర్పును తోసిపుచ్చిన హైకోర్టు 
ఈ కేసులో 2024 నవంబర్ 23న అరెస్ట్ అయిన నిందితులు కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్, ఎం. శ్రీనివాసరావులను పోలీసులు నందిగామ కోర్టులో హాజరుపరిచారు. అయితే, హత్యాయత్నం వంటి తీవ్రమైన సెక్షన్లు వర్తించవని పేర్కొంటూ న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ నందిగామ సీఐ హైకోర్టును ఆశ్రయించారు. పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు.

విచారణ జరిపిన జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, నందిగామ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను రద్దు చేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చారు. కాగా, ముందస్తు బెయిల్ పొందిన వారు పాస్‌పోర్టులను దర్యాప్తు అధికారికి అప్పగించాలని, చార్జిషీటు దాఖలు చేసే వరకు ప్రతి ఆదివారం ఐవో ముందు హాజరుకావాలని స్పష్టమైన షరతులు విధించారు. 

Related posts

మావోయిస్టు అగ్రనేతలపై హైకోర్టులో పిటిషన్.. పోలీసుల అదుపులో ఉన్నారా?

Ram Narayana

ఐపీఎస్‌ సునీల్‌ నాయక్‌‌కు తాత్కాలిక ఊరట…

Ram Narayana

ఐటీ కంపెనీలకు భూకేటాయింపులపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Ram Narayana