దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు కీలక సూచనలు జారీ చేశాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడటంతో, క్యాంటీన్లలో సేవలను పరిమితం చేస్తున్నామని, ఉద్యోగులు తమ భోజనాన్ని ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని కోరుతున్నాయి.
పుణె, బెంగళూరు, చెన్నైలోని పలు ఐటీ క్యాంపస్‌లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కంపెనీలు తమ క్యాంటీన్లలో మెనూలను భారీగా తగ్గించాయి. దోశ, ఆమ్లెట్ వంటివి అందించే లైవ్ ఫుడ్ కౌంటర్లను తాత్కాలికంగా మూసివేశాయి. టీసీఎస్ యరవాడ క్యాంపస్‌లో కేవలం పప్పు-అన్నం వంటి ప్రాథమిక భోజనాన్ని మాత్రమే అందిస్తుండగా, విప్రో క్యాంపస్‌లోనూ ఫాస్ట్ ఫుడ్ కౌంటర్లను నిలిపివేశారు.
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాలకు అధిక ప్రాధాన్యమిస్తూ, వాణిజ్యపరమైన కార్యకలాపాలకు ఎల్పీజీ సరఫరాను నియంత్రించాలని నిర్ణయించింది. ఈ అధికారిక ఉత్తర్వుల కారణంగానే ఐటీ కంపెనీల్లోని క్యాంటీన్ నిర్వాహకులకు గ్యాస్ సరఫరా తగ్గింది. కంపెనీల నిర్ణయంతో ఉద్యోగులు, ముఖ్యంగా పీజీలు, హాస్టళ్లలో ఉంటూ బయటి ఆహారంపై ఆధారపడేవారు ఇబ్బందులు పడుతున్నారు.