అంతర్జాతీయం

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు …పెరుగుతున్న నిరసనలు…

ఇజ్రాయెల్‌పై ఇరాన్ ‘డ్యాన్సింగ్ మిస్సైల్’ ప్రయోగం

Iran Launches Dancing Missile at Israel

ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం 17వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ఇరాన్ తొలిసారిగా ‘డ్యాన్సింగ్ మిస్సైల్’ అని పిలిచే అత్యాధునిక క్షిపణిని ప్రయోగించి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. సాధారణ క్షిపణులు ఒకే మార్గంలో వెళ్తాయి, కానీ ఈ క్షిపణి గగనతలంలో దిశలను మారుస్తూ, వంకరటింకరగా ప్రయాణిస్తూ ఇజ్రాయెల్ రక్షణ కవచం ‘ఐరన్ డోమ్’ను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ క్షిపణి ప్రయాణించే తీరును చూసి రక్షణ రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించింది. ఈ క్షిపణులు రాడార్లకు దొరకకుండా, శత్రుదేశాల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ లక్ష్యాన్ని చేరుకుంటాయని వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలే లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. తమ అమ్ములపొదిలో ఉన్న అత్యంత రహస్య ఆయుధాల్లో ఇదొకటని, తాము ఇంకా తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేదని ఇరాన్ హెచ్చరించింది.

మరోవైపు, ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అమెరికా తన ‘థాడ్’  క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్‌లో మోహరించినప్పటికీ, ఇరాన్ కొత్తగా ప్రయోగిస్తున్న ఈ ‘డ్యాన్సింగ్ మిస్సైళ్ల’ను అడ్డుకోవడం పెద్ద సవాలుగా మారింది.

నాటో దేశాలకు ట్రంప్ వార్నింగ్

Donald Trump Warns NATO Nations

పశ్చిమాసియా యుద్ధం ముదురుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యూరోపియన్ మిత్రదేశాలపై నిప్పులు చెరిగారు. నార్త్ అట్లాంటిక్ ట్రెటీ ఆర్గనైజేషన్ (నాటో) భవిష్యత్తుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రస్తుత పరిస్థితి ‘‘చాలా దారుణంగా’’ ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ అడ్డంకుల వల్ల మూతపడిన హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు తమతో కలిసి రావాలని నాటో కూటమిని ఆయన డిమాండ్ చేశారు.

హర్మూజ్ జలసంధి ద్వారా చమురు పొందుతున్న దేశాలు తమ సొంత నౌకల రక్షణ కోసం ముందుకు రాకపోవడాన్ని ట్రంప్ తప్పుబట్టారు. ‘‘అందరి కోసం అమెరికా ఒక్కటే కాపలా కాయలేదు. ఈ కీలక మార్గాన్ని తెరిపించేందుకు జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు తమ యుద్ధనౌకలను పంపించాలి. నాటో దేశాలు తమ బాధ్యతను నెరవేర్చకుంటే ఆ కూటమి భవిష్యత్తు ప్రశ్నార్థకమే’’ అని ఆయన హెచ్చరించారు. 

మరోవైపు, ఇరాన్‌పై అమెరికా జరిపిన బాంబు దాడులను ట్రంప్ సమర్థించుకున్నారు. చమురు సరఫరాను అడ్డుకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, దానిని అడ్డుకోవడానికి ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనకాడబోమని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలతో నాటో కూటమిలో ఒక్కసారిగా కలకలం రేగింది. పశ్చిమాసియా యుద్ధంలో నేరుగా పాల్గొనడానికి యూరోపియన్ దేశాలు మొగ్గు చూపకపోవడంతో, అమెరికా, దాని మిత్రదేశాల మధ్య దూరం పెరుగుతోందనే చర్చ మొదలైంది.

తైవాన్ వద్ద మళ్లీ చైనా దూకుడు.. భారీగా యుద్ధ విమానాలు, నౌకల మోహరింపు

China Resumes Aggression Near Taiwan with Military Aircraft Naval Deployment

తైవాన్ జలసంధిలో గత రెండు వారాలకు పైగా కొనసాగిన అసాధారణ నిశ్శబ్దానికి తెరపడింది. చైనా తన సైనిక విమానాలు, నౌకలతో మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. గడిచిన 24 గంటల్లో తమ ద్వీపం చుట్టూ 26 చైనా సైనిక విమానాలు, 7 నౌకలు సంచరించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. వీటిలో 16 విమానాలు తమ వాయు రక్షణ గుర్తింపు జోన్ (ADIZ)లోని ఉత్తర, మధ్య, నైరుతి ప్రాంతాల్లోకి ప్రవేశించాయని పేర్కొంది.

ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి మొదటి వారం వరకు తైవాన్ సమీపంలో చైనా సైనిక విమానాల కదలికలు దాదాపుగా నిలిచిపోయాయి. 2021 తర్వాత ఇంత ఎక్కువ కాలం పాటు చైనా విమానాల కార్యకలాపాలు ఆగడం ఇదే తొలిసారి. దీంతో చైనా తన వ్యూహాన్ని మార్చుకుందేమోనని, సైనిక శిక్షణ ప్రాధాన్యతలపై దృష్టి సారించి ఉండవచ్చని లేదా దౌత్యపరమైన చర్చల నేపథ్యంలో సంయమనం పాటిస్తుండవచ్చని విశ్లేషకులు భావించారు. అయితే, ఈ ఊహాగానాలకు తెరదించుతూ చైనా మళ్లీ తన దూకుడును ప్రదర్శించింది.

తాజా పరిణామాల నేపథ్యంలో తైవాన్ అప్రమత్తమైంది. చైనా విమానాలు, నౌకల కదలికలను పర్యవేక్షించేందుకు తమ వాయు, నౌకా దళాలతో పాటు తీరప్రాంత క్షిపణి వ్యవస్థలను మోహరించినట్లు తెలిపింది. చైనా నుంచి కవ్వింపు చర్యలు మినహా ఎలాంటి దూకుడు చర్యలు చోటుచేసుకోలేదని అధికారులు తెలిపారు.

ఇటీవలి సంవత్సరాలలో తైవాన్‌పై ఒత్తిడి పెంచే “గ్రే-జోన్” తంత్రంలో భాగంగా చైనా దాదాపు ప్రతిరోజూ తమ గగనతలంలోకి విమానాలను పంపుతోంది. రాజకీయంగా కీలకమైన సంఘటనల సమయంలో ఈ కార్యకలాపాల తీవ్రత మారుతూ ఉంటుంది. తమ నుంచి విడిపోయిన భూభాగంగా తైవాన్‌ను పరిగణించే చైనా, అవసరమైతే బలవంతంగానైనా విలీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. అయితే, రెండు వారాల పాటు సైనిక విన్యాసాలను ఎందుకు నిలిపివేసింది, ఇప్పుడు మళ్లీ ఎందుకు ప్రారంభించింది అనే దానిపై బీజింగ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

దుబాయ్ వెళ్తూ మధ్యలోనే వెనక్కి మళ్లిన ఎమిరేట్స్ విమానాలు!

Emirates Flights Return MidAir After Dubai Airport Drone Attack

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒక చమురు ట్యాంకర్‌పై ఇరాన్ ఈ రోజు ఉదయం డ్రోన్ దాడి చేయడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరిణామంతో కేరళం నుంచి దుబాయ్ వెళ్లిన విమానాలకు ఆటంకం కలిగింది. తిరువనంతపురం నుంచి దుబాయ్ బయలుదేరి వెళ్లిన ఎమిరేట్స్ విమానం (EK 523) విమానాశ్రయం మూసివేత సమాచారంతో వెనక్కి మళ్లింది.

353 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బందితో ఉన్న ఈ విమానం తిరిగి తిరువనంతపురంలోనే సురక్షితంగా ల్యాండ్ అయింది. కొచ్చి నుంచి 325 మంది ప్రయాణికులతో బయల్దేరిన మరో ఎమిరేట్స్ విమానం (EK 533) కూడా నాలుగు గంటల ప్రయాణం తర్వాత తిరిగి కొచ్చికే చేరుకుంది. హైదరాబాద్ నుంచి వెళ్లిన ఎమిరేట్స్ విమానం (EK 525) కూడా ఇదే విధంగా వెనక్కి మళ్లినట్లు సమాచారం. ఎయిర్ ఇండియా కూడా దుబాయ్ నుంచి రాకపోకలు సాగించే తన విమాన సర్వీసులన్నింటినీ తాత్కాలికంగా రద్దు చేసింది.

దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించిన వివరాల ప్రకారం.. డ్రోన్ దాడి వల్ల విమానాశ్రయం సమీపంలోని ఇంధన నిల్వ కేంద్రంలో మంటలు చెలరేగాయి, అయితే ఎవరికీ గాయాలు కాలేదు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు సివిల్ డిఫెన్స్ బృందాలు పనిచేస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత దుబాయ్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి చేయడం ఇది మూడోసారి కావడం గమనార్హం. ప్రయాణికులు ఎయిర్‌లైన్స్ నుంచి తాజా అప్డేట్స్ పొందిన తర్వాతే ప్రయాణాలకు సిద్ధం కావాలని అధికారులు సూచించారు.

నేపాల్‌లో చుక్కలను అంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

Nepal Petrol Diesel Prices Skyrocket Amidst Global Turmoil

పశ్చిమాసియాలో చెలరేగుతున్న యుద్ధ సెగలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దహించివేస్తున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కాస్తా ప్రపంచ ఇంధన సంక్షోభానికి దారితీయడంతో, మన పొరుగు దేశమైన నేపాల్‌లో పెట్రో ధరలు రాత్రికి రాత్రి రికార్డు స్థాయికి చేరాయి. నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయంతో ఈ రోజు నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి.

భారీగా పెరిగిన ధరలు..
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా నేపాల్ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా సవరించింది. పెట్రోల్ లీటరుకు రూ.31 పెరగడంతో ఇప్పుడు రూ.188 కి చేరింది. డీజిల్ ఏకంగా రూ.54 పెరగడంతో లీటరు ధర రూ.196 కి చేరుకుంది. ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.296 భారం పడటంతో, ఇప్పుడు ఒక్కో బండ ధర రూ.2,126 కు పెరిగింది.

యుద్ధమే అసలు కారణం..
ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ గుండా నౌకల రాకపోకలు నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు కొరత ఏర్పడింది. ఈ ప్రభావం నేరుగా దిగుమతులపై ఆధారపడే నేపాల్ వంటి దేశాలపై పడింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో తమకు నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేస్తున్న ‘ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్’కు నేపాల్ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది. భారత్‌ లో ప్రస్తుతానికి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ సరిహద్దు దాటితే మాత్రం పెట్రో మంటలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి.

ఇజ్రాయెల్ దాడులతో దద్దరిల్లిన ఇరాన్… అధ్యక్షుడు వాడే విమానం పేల్చివేత

Israel Strikes Iran Destroys Presidents Plane

ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో ఇరాన్ అగ్ర నాయకత్వం ఉపయోగించే ఒక కీలక విమానాన్ని ధ్వంసం, పలు సైనిక స్థావరాలను చేసినట్లు సోమవారం ప్రకటించింది. ఈ దాడితో ఇరాన్, దాని మిత్రపక్షాల మధ్య సమన్వయం దెబ్బతింటుందని ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) పేర్కొంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు తెలిపింది.

ఐడీఎఫ్ ప్రకటన ప్రకారం, ధ్వంసమైన విమానం ఎయిర్‌బస్ ఏ340. దీనిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, గతంలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వంటి అగ్ర నాయకులు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉపయోగించేవారు. టెహ్రాన్‌లోని ఈ విమానాశ్రయంలో దేశీయ విమానాలతో పాటు ఇరాన్ వైమానిక దళానికి చెందిన సైనిక స్థావరాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో టెహ్రాన్, షిరాజ్, తబ్రిజ్ వంటి ఇతర నగరాల్లోని మౌలిక సదుపాయాలపై కూడా దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

మరోవైపు, హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచే విషయంలో అమెరికాకు మిత్రదేశాలు సాయం చేయకపోతే నాటో భవిష్యత్తు ‘చాలా దారుణంగా’ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం, ఆదివారం ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి ద్వారా యూరప్ దేశాలు ఎక్కువగా లబ్ధి పొందుతున్నాయని, కాబట్టి అక్కడి భద్రతకు వాళ్లు కూడా బాధ్యత వహించాలని ట్రంప్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ విషయంలో అమెరికా గతంలో యూరప్‌కు సాయం చేసిందని, ఇప్పుడు వారు తమకు సాయం చేయాల్సిన సమయం వచ్చిందని ఆయన వాదించారు.

మోదీ పర్యటనకు, ఇరాన్‌పై దాడికి సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్

Modis visit not linked to Iran attack says Israeli envoy Ruven Azar

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ పర్యటనపై వస్తున్న విమర్శలకు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ స్పష్టతనిచ్చారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు, ఆ వెంటనే ఇరాన్‌పై జరిగిన దాడులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.

ప్రధాని మోదీ ఫిబ్రవరి 25-26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 28న) ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. ఈ క్రమాన్ని ఉటంకిస్తూ, పశ్చిమాసియా ఉద్రిక్తతలకు భారత్ మద్దతు ఇస్తోందన్నట్లుగా విపక్షాలు చేస్తున్న విమర్శలను ఇజ్రాయెల్ రాయబారి తోసిపుచ్చారు. ఆ ప్రాంతంలో పరిస్థితులు మోదీ పర్యటనకు ముందు నుంచే అస్థిరంగా ఉన్నాయని, ఆపరేషన్ చేపట్టేందుకు తమకు అవకాశం వచ్చినప్పుడే దాడులు చేశామని ఆయన వివరించారు. మోదీ ఇజ్రాయెల్ పర్యటన పూర్తిగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఉద్దేశించినదని, దీనిని సైనిక చర్యలతో ముడిపెట్టడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

Related posts

వీడికి ఇదో రకం పాడు బుద్ది …జపాన్ లో కామాంధుడు …!

Ram Narayana

భారత్‌కు ఇది కష్టకాలం .. ఆదుకుంటాం: ఎయిరిండియా ప్రమాదంపై ట్రంప్

Ram Narayana

ఎప్ స్టీన్ ఫైల్స్ పై దలైలామా వివరణ!

Ram Narayana