ప్రతిపక్ష నేతగా ఉంటూ శాసనసభ సమావేశాలకు హాజరు కాకుండానే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోటి రూపాయలకు పైగా జీతభత్యాలు తీసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం రాత్రి శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.
2023 డిసెంబర్ 1 నుంచి మార్చి 18 వరకు కేసీఆర్ రూ. 1,06,56,674 జీతభత్యాలు పొందారని రేవంత్ రెడ్డి సభలో వెల్లడించారు. విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకుంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు కూడా ప్రజాసేవకులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. అలాంటప్పుడు విధులకు రాకుండా జీతభత్యాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై సభలో చర్చ జరగాలన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రతిపక్ష నేత సభకు వచ్చి చర్చల్లో పాల్గొని, విలువైన సలహాలు ఇవ్వాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. స్పీకర్ ద్వారా కేసీఆర్‌ను సభకు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కొత్త గవర్నర్‌కు స్వాగతం పలికేందుకు, అసెంబ్లీ ప్రాంగణంలో ‘తెలంగాణ తల్లి’ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజరుకాకపోవడం విచారకరమన్నారు.
బీఆర్ఎస్ నేతలు అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించారని, ప్రజలు బుద్ధి చెప్పినా వారిలో మార్పు రాలేదని సీఎం విమర్శించారు. కొందరు నేతల్లో ఇంకా రాచరికపు, నియంతృత్వ పోకడలు కనిపిస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన కబ్జాలు, కూల్చివేతలపై అధ్యయనం చేసేందుకు వాస్తవ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.