పశ్చిమాసియా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దాదాపుగా నిర్మూలించామని, యుద్ధ లక్ష్యాలకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ట్రంప్ మాటలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అవి కేవలం భ్రమ మాత్రమేనని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాక్చీ ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా ఆయన అమెరికా తీరును వియత్నాం యుద్ధంతో పోల్చారు. 1960లలో వియత్నాంలో అమెరికా ఓడిపోతున్నప్పటికీ, తమ దేశం గెలుస్తోందంటూ నాటి జనరల్ వెస్ట్‌మోర్‌ల్యాండ్ ప్రజలను తప్పుదోవ పట్టించారని గుర్తుచేశారు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ప్రకటనలు కూడా అలాంటివేనని ఆయన విమర్శించారు.
వియత్నాం యుద్ధ సమయంలో సైగాన్లో సైనిక అధికారులు రోజూ సాయంత్రం 5 గంటలకు మీడియా సమావేశాలు నిర్వహించి, యుద్ధంలో గెలుస్తున్నామంటూ కట్టుకథలు చెప్పేవారని, వాటిని మీడియా ‘ఫైవ్ ఓ క్లాక్ పోలీస్’ (సాయంత్రం 5 గంటల పిచ్చితనం) అని పిలిచేదని అరాక్చీ తెలిపారు. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కూడా అలాంటి ‘ఫాంటసీ’ కథలని ఆయన సెటైర్ వేశారు.
ప్రభుత్వ ప్రకటనలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య తేడా ఉండటాన్ని ‘క్రెడిబిలిటీ గ్యాప్’ అంటారని, అమెరికా మరోసారి అదే తప్పు చేస్తోందని అరాక్చీ అన్నారు. ఇరాన్ రక్షణ వ్యవస్థను ధ్వంసం చేశామన్న అమెరికా వాదనల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆయన ఈ వ్యాఖ్యలతో స్పష్టం చేశారు.
తొలిసారిగా 4,000 కి.మీ. దూరంలోని అమెరికా స్థావరంపై ఇరాన్ దాడి

పశ్చిమాసియాకే పరిమితమైన అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు ఇప్పుడు హిందూ మహాసముద్రానికి విస్తరించాయి. ఏకంగా 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా వ్యూహాత్మక సైనిక స్థావరం ‘డియాగో గార్సియా’ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించడం అంతర్జాతీయంగా కలకలం సృష్టిస్తోంది. ఇరాన్ వద్ద ఇంతటి శక్తిమంతమైన క్షిపణులు ఉన్నాయని అంచనా వేయడంలో విఫలమయ్యామని అమెరికా భావిస్తోంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. ఇరాన్ రెండు క్షిపణులను ప్రయోగించగా, ఒకటి సాంకేతిక లోపంతో విఫలమైంది. మరొకటి అమెరికా రక్షణ వ్యవస్థల చేతిలో నిర్వీర్యమైంది. దాడి విఫలమైనప్పటికీ, కీలకమైన యుద్ధ విమానాలు, బాంబర్లు ఉండే స్థావరంపై దాడికి యత్నించడం అమెరికాను ఆత్మరక్షణలో పడేసింది.
మరోవైపు, ఇరాన్ తన శత్రువులకు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా భద్రత ఉండదని హెచ్చరించింది. పార్కులు, పర్యాటక కేంద్రాలే లక్ష్యంగా దాడులు ఉంటాయని ఇరాన్ జనరల్ ఒకరు ప్రకటించడం ప్రపంచ ఉగ్రవాద ముప్పుపై ఆందోళనలను పెంచుతోంది. ఇప్పటికే హర్మూజ్ జలసంధిలో రవాణా స్తంభించిపోవడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్ తీవ్ర సంక్షోభంలో ఉంది.
ఒకవైపు దాడులతో రెచ్చిపోతున్న ఇరాన్, మరోవైపు కీలక నేతలను కోల్పోతోంది. ఈ వారంలోనే అలీ లారిజానీ వంటి ముఖ్య నేతతో పాటు, తాజాగా రివల్యూషనరీ గార్డ్ ప్రతినిధి అలీ మహమ్మద్ నైనీ కూడా అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఇరాన్ క్షిపణి సామర్థ్యం తగ్గలేదని ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం గమనార్హం.
ఇరాన్ చమురుతోనే ఇరాన్‌కు చెక్.. ట్రంప్ సర్కార్ మాస్టర్ ప్లాన్

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ఆకాశాన్నంటుతున్న చమురు ధరలను నియంత్రించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై ఒకవైపు సైనిక దాడులు కొనసాగిస్తూనే, మరోవైపు ఆ దేశ చమురు రవాణాపై ఉన్న ఆంక్షలను 30 రోజుల పాటు తాత్కాలికంగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లోకి ఇరాన్ చమురు అందుబాటులోకి వచ్చి, ధరలు తగ్గుముఖం పడతాయని వాషింగ్టన్ భావిస్తోంది.
ఈ వ్యూహాన్ని “ఇరాన్ బ్యారెళ్లను ఇరాన్‌కు వ్యతిరేకంగానే ఉపయోగించడం” అని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ అభివర్ణించారు. ప్రస్తుతం సముద్రంలో సుమారు 140 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ చమురు నిలిచిపోయి ఉంది. ఆంక్షల సడలింపుతో ఈ నిల్వలు ప్రపంచ మార్కెట్లోకి ప్రవహించనున్నాయి. తద్వారా సరఫరా పెరిగి, ఇంధన ధరల భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఫిబ్రవరి 28న ప్రారంభమైన ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’, ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’ దాడులతో ఇరాన్ రక్షణ వ్యవస్థలు బలహీనపడ్డాయి. దీంతో హర్మూజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకొని ధరలను పెంచాలని టెహ్రాన్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇరాన్ పాత నిల్వలను మార్కెట్లోకి వదలడం ద్వారా అమెరికా ఆ ప్రయత్నాలకు గండికొడుతోంది.
ఈ మినహాయింపునకు అమెరికా కఠిన నిబంధనలు విధించింది. కొత్తగా చమురు ఉత్పత్తి చేయడానికి గానీ, ఒప్పందాలు చేసుకోవడానికి గానీ ఇరాన్‌కు అనుమతి లేదు. ముఖ్యంగా, ఈ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం టెహ్రాన్‌కు చేరకుండా కఠినమైన ఆంక్షలు అమలు చేయనుంది. సైనిక చర్యలతో పాటు ఆర్థికంగానూ ఇరాన్‌ను దిగ్బంధించడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.
బాగ్దాద్‌ను కమ్మేసిన దట్టమైన పొగ.. అమెరికా స్థావరంపై రాకెట్ల వర్షం

అమెరికా, ఇరాన్ మధ్య రాజుకుంటున్న ఉద్రిక్తతలు ఇరాక్‌ను తాకాయి. రాజధాని బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని అమెరికా దౌత్య, లాజిస్టిక్ కేంద్రంపై మిలిటెంట్లు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో దౌత్య కార్యాలయం అగ్నిప్రమాదానికి గురైంది. దాడి తీవ్రతకు దట్టమైన నల్లటి పొగ కిలోమీటర్ల మేర ఆకాశంలోకి ఎగసిపడటంతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది.
గత కొంతకాలంగా బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం, సైనిక స్థావరాలపై రాకెట్లు, డ్రోన్లతో దాడులు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన దాడికి ‘అషాబ్ అల్-కహ్ఫ్’ అనే ఇరాన్ మద్దతు ఉన్న గ్రూప్ బాధ్యత స్వీకరించింది. మరోవైపు, ‘కతైబ్ హిజ్బుల్లా’ అనే మరో శక్తిమంతమైన గ్రూప్ కీలక ప్రకటన చేసింది. నివాస ప్రాంతాలపై అమెరికా దాడులు నిలిపివేస్తే, తాము ఐదు రోజుల పాటు దాడులు ఆపుతామని షరతు విధించింది.
అమెరికా తన కేంద్రాల రక్షణకు ‘C-RAM’ వంటి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తోంది. వీటి ద్వారా చాలా డ్రోన్లను గాలిలోనే కూల్చివేస్తున్నప్పటికీ, కొన్ని లక్ష్యాలను ఛేదించడంతో ఆస్తి నష్టం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటి నుంచి ఇరాన్ అనుకూల గ్రూపులు ఇరాక్‌లోని అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నాయి.
ఇరు దేశాల ఆధిపత్య పోరులో ఇరాక్ యుద్ధ క్షేత్రంగా మారుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద దాడులు జరగడంతో విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ భయానక పరిస్థితుల నేపథ్యంలో, తమ పౌరులు తక్షణమే ఇరాక్ విడిచి వెళ్లాలని అమెరికా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.
ఇరాన్ చమురు అమ్మకాలకు అమెరికా గ్రీన్ సిగ్నల్.. ధరల నియంత్రణకు కొత్త వ్యూహం!

ఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా అనూహ్య నిర్ణయం తీసుకుంది. గ్లోబల్ ఇంధన మార్కెట్లపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు, సముద్రంలో ఇప్పటికే రవాణా అవుతున్న ఇరాన్ చమురు అమ్మకాలకు 30 రోజుల పాటు తాత్కాలికంగా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్య ద్వారా ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలను స్థిరీకరించాలని ట్రంప్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ విషయాన్ని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 19 మధ్య నౌకల్లోకి ఎక్కించిన ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని యూఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ జారీ చేసిన లైసెన్స్‌లో స్పష్టం చేసింది. కొత్తగా చమురు ఉత్పత్తి చేయడానికి గానీ, కొనుగోలు చేయడానికి గానీ ఈ వెసులుబాటు వర్తించదని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో సుమారు 14 కోట్ల బ్యారెళ్ల చమురు ప్రపంచ మార్కెట్లకు అందుబాటులోకి వస్తుందని బెస్సెంట్ వివరించారు.
ఇరాన్‌తో కొనసాగుతున్న “ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ” కారణంగా ఏర్పడిన సరఫరా అంతరాయాలను అధిగమించేందుకే ఈ చర్య తీసుకున్నామని ఆయన తెలిపారు. “ధరలను అదుపులో ఉంచేందుకు మేము ఇరాన్ బ్యారెళ్లనే టెహ్రాన్‌కు వ్యతిరేకంగా వాడుతున్నాం” అని బెస్సెంట్ చేసిన వ్యాఖ్యలు అమెరికా వ్యూహాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అదే సమయంలో ఈ వెసులుబాటును అలుసుగా తీసుకోవద్దని ఇరాన్‌ను హెచ్చరించారు. ఈ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇరాన్ పొందడం కష్టతరం చేస్తామని, ఆ దేశంపై ఒత్తిడి విధానం యథాతథంగా కొనసాగుతుందని ఆయన తేల్చి చెప్పారు. ప్రపంచ ఉగ్రవాదానికి ఇరాన్ కేంద్రంగా మారిందని ఆరోపించిన బెస్సెంట్, ఆంక్షల పరిధిలోని ఇరాన్ చమురును చైనా చౌకగా కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటోందని విమర్శించారు.
ఇటీవలి వారాల్లో రష్యా చమురు విషయంలోనూ ఇలాంటి సడలింపులు ఇచ్చిన అమెరికా, తాజా నిర్ణయంతో మార్కెట్లను స్థిరీకరించే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు సైనిక, ఆర్థిక ఒత్తిడి కొనసాగిస్తూనే, మరోవైపు వ్యూహాత్మక జలసంధి అయిన హర్మూజ్ గుండా ఇంధన సరఫరాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలన్నది అమెరికా ఉద్దేశంగా కనిపిస్తోంది. ప్రపంచానికి ఇంధన సరఫరాను పెంచేందుకు అమెరికా తన ఆర్థిక, సైనిక శక్తిని వినియోగిస్తూనే ఉంటుందని బెస్సెంట్ స్పష్టం చేశారు.